A Tholiprema Generation Abbayi Meets A Khushi Generation Ammayi - A Modern Day Love Story

Updated on
A Tholiprema Generation Abbayi Meets A Khushi Generation Ammayi - A Modern Day Love Story

పొద్దున్న ఆరు ఏడు ప్రాంతాల్లో, సత్య ఉండే ఫ్లాట్ బాల్కనీ నుండి, సూర్యోదయం చాలా బాగా కనిపిస్తుంది. ఆ సూర్యోదయాన్ని చూస్తూ, కాఫీ తాగడం సత్య కి అలవాటు.

ఆ తరువాత తనకు వచ్చినంతలో వంట చేస్కుని, బాక్స్ కట్టుకుని, ఒక కిలోమీటర్ దూరం లో తాజా కిచెన్ లో టిఫిన్ తినేసి, దానికి ఆనుకుని ఉన్న 100 ఫీట్ రోడ్ మీదుగా తన బుల్లి కార్ మీద ఆఫీస్ కి పరుగులు పెట్టడం, అలవాటు చేసుకోవాలి అని అనిపించకపోయినా, చేసుకున్న అలవాటు.

ఇంతటి ఉరుకుల పరుగుల సత్య జీవితాన్ని కాసేపు ఆపి తన వైపు చూసేలా చేసింది స్వప్న. ఈ నెల ఒకటిన తన ఎదురు ప్లాట్ ని కొనుక్కుని దిగింది. ఎవరో చెప్పగా, ఈ మధ్యే చదువు అయ్యి, ఏదో కంపెనీ లో ఇంటీరియర్ డిజైనర్ ఇంటర్న్ గా చేరిందని అని, చాలా ఇష్టాంగా ఆ ఇంటిని తనే డిజైన్ చేసుకుంది అని తెలుసుకున్నాడు. రోజు ఏదోరకంగా ఎక్కడో అక్కడ, సత్య కి స్వప్న తారసపడుతూనే ఉంది. తన రోజు పరిపూర్ణం చేస్తూనే ఉంది.

మూడు నెలలు గడిచిన స్వప్న తో మాట్లాడే అవకాశం రాలేదు... కానీ ఒక ఆదివారం ఎవరో తట్టి లేపినట్టు గా 4 గంటలకే మెలుకువ వచ్చింది. అదేంటో ఆదివారమే త్వరగా మెలుకువ వస్తుంది మనకి అనుకుంటూ.. సూర్యోదయం అవ్వడానికి ఇంకా 2 గంటల సమయం ఉంది, అలా కాసేపు 100 ఫీట్ రోడ్ మీదుగా నడిచి వెళ్లి కాఫీ తాగి వద్దాం అనుకుని కిందకి వచ్చిన తనకి, మోయలేనంత లగేజ్ తో స్వప్న కనిపించింది. క్యాబ్ వాడు కాన్సల్ చేస్తున్నాడు అని స్వప్న మాటల్లో కాదు చిరాకు లో అర్థం అయ్యింది.

అన్ని రోజులు మాట్లాడలేని సత్య ఆ రోజు ఎందుకో మాట్లాడకుండా ఉండలేకపోయాడు. పైగా స్వప్న ఏదో అవసరం లో ఉంది.

సత్య: హాయ్.

స్వప్న: హే, హాయ్

సత్య: ఎక్కడికైనా వెళ్తున్నారా?

స్వప్న: Yeah, చెన్నై కి..

సత్య: మరి ఇంత లగేజ్.

స్వప్న: అంటే 3 months project వర్క్ మీద సో..

(3 months అనగానే, తనని చూడకుండా 3 months ఉండాలా అని ముందు గుండె గుభేలు మంది.. కానీ 3 months ey chill అనుకుని)

సత్య: ఓహ్ ట్రైన్?

స్వప్న: కాదు బస్ 5 am కి 100 ఫీట్ రోడ్ దగ్గరే ఎక్కాలి. ఇంత లగేజ్ ఉంది కదా అని క్యాబ్ బుక్ చేస్తున్న, ఎవరు accept చెయ్యట్లేదు..

సత్య: ohh నేను ఎలాగో, అక్కడి వరకు వాకింగ్ చేద్దాం అనుకుంటున్నా... ఆ లగేజ్ ఇటు ఇవ్వండి.. దగ్గరే కదా.. మీకు కంపెనీ ఇస్తా...

స్వప్న: అయ్యో పర్లేదు

సత్య: ఇంకా 40 మినిట్స్ మాత్రమే పదండి వెళదాం.

(అని సత్య స్వప్న లగేజ్ లో కొంత తీసుకున్నాడు. ఇద్దరు నడక మొదలుపెట్టారు.. కాసేపు తరువాత మౌనం బోర్ కొట్టిందో లేదా మాట్లాడే మంచి తరుణం ఇంతకు మించి రాదనుకున్నాడో మాట్లాడటం మొదలు పెట్టాడు)

సత్య: సో, సినిమాలు చూస్తుంటారా? (ప్రపంచం లో ఇంతకన్నా జనరల్ టాపిక్ ఇంకోటి ఉండదు కదా)

స్వప్న: హా బానే చూస్తా...

సత్య: అంటే తెలుగు మూవీస్?

స్వప్న: కాదు, mostly ఇంగ్లీష్ మూవీసే....

సత్య: అస్సలు చూడరా తెలుగు సినిమాలు?

స్వప్న: చూస్తా.. కానీ ఎక్కువ చూడను.. ఖుషి చాలా ఇష్టం.. ఇంట్లో నా నిక్ నేమ్ కూడా అదే, ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు పుట్టా అని డాడ్ అలా పిలుస్తుంటారు...

సత్య: ఓహ్ నాకు తొలిప్రేమ ఇష్టం.. ఆ సినిమా రిలీజ్ అయ్యే టైం కి నాకు 2 ఇయర్స్ ఉండచ్చు.. థియేటర్ లో ఈ మనసే పాటకి సీట్ దిగి డాన్స్ చేశా అంటా.. మా మావయ్య ఇప్పటికి చెప్తుంటాడు

(అని ఒక చిన్న నవ్వు నవ్వాడు.. స్వప్న కూడా ఏదో నవ్వాలి కాబట్టి నవ్వినట్టు నవ్వింది.. మళ్ళీ కాసేపు మౌనం)

సత్య: sunrise or sunset? (ఇంకో ప్రశ్న తట్టలేదు మనోడికి పాపం)

స్వప్న: sunset. సాయంత్రం లోపు చెన్నై లో ఫ్రెండ్ ఫ్లాట్ లో దిగచ్చు అని ఇంత మార్నింగ్ బుక్ చేసుకున్న.

(ఛా అనుకుని...)

సత్య: ఫ్లైట్ బుక్ చేసుకుంటే, త్వరగా వెళ్తారు కదా...? అలా ఆకాశం మేఘాల మధ్య...

స్వప్న: నాకు ఆకాశం కన్నా భూమి, ఆ పొలాలు అవి ఎక్కువ ఇష్టం.. సో మరి అవసరమైతే తప్ప, ఫ్లైట్ బుక్ చెయ్యను. పైగా డబ్బులు కూడా ఎక్కువ. పైగా ఎలాగో ఆదివారం.

(ఛాఛా అనుకుని...)

సత్య: చలి గా ఉంది కదా... ఇక్కడ బస్టాప్ దగ్గర కొట్టు లో కాఫీ బాగుంటుంది తాగాలి.

స్వప్న: అవునా నేను ఎప్పుడు కాఫీ తాగలేదు.. sunset చూస్తూ టీ తాగడం ఇష్టం. ఇక్కడ టీ కూడా బాగుంటుంది.

(ఈ సారి ఛాఛాఛా అనుకుని అక్కడ తను కాఫీ తాగాడు, స్వప్న టీ తాగింది.. మెల్లగా 100 ఫీట్ రోడ్ బస్టాప్ కి వచ్చేసారు)

సత్య: మధ్యాహ్నం ఎప్పుడో వెళ్తారు.. మధ్యలో టిఫిన్ సెంటర్ బాగుంటుందో లేదో.. బస్ వచ్చే టైం ఇంకా ఉంది అనుకుంటా. ఈ బండి దగ్గర దోశలు బాగుంటాయి. ఇక్కడే ఉండండి రెండు మంచి వేడి వేడి ఉల్లిపాయ దోస పట్టుకొస్తా...

స్వప్న: అయ్యో వద్దులేండి సత్య గారు..

సత్య: పర్లేదు లేండి. తెస్తా ఉండండి.. (అని రెండు అడుగులు వెయ్యబోతుంటే)

స్వప్న: ఉల్లిపాయ దోస వద్దు, మసాలా దోస ఉంటే తెస్తారా?

సత్య: (ఆఖరికి దోశ లో కూడా సిమిలారిటీ లేదు కదరా అనుకుని) ఒకే అండి.. తెస్తాను..

(అని చెప్పి, దోశ బండి బాబాయి కి ఆర్డర్ చెప్పి, ఏదో ఆలోచిస్తూ ఉండగా.. ఈ అమ్మాయికి నా పేరు సత్య అని ఎలా తెలుసు అని ఒక ప్రశ్న మెదిలింది.. దోశ వేడిగా ఉన్న పట్టించుకోకుండా.. వెంటనే ఈ ప్రశ్న తనని అడిగేయాలి అని స్వప్న దగ్గరికి వచ్చి తన చేతికి దోశ ఇచ్చి.. తింటున్న మధ్య లో)

సత్య: స్వప్న గారు.. నా పేరు సత్య అని మీకెలా తెలుసండి..

స్వప్న: మీకు నా పేరు స్వప్న అని ఎలా తెలిసిందో.. అలా....

సత్య: అంటే ఎదురింట్లో కొత్తగా దిగారు కదా ఎవరయ్యి ఉంటారా అనే ఆతృత తో తెలుసుకున్న అంతే..

స్వప్న: అవునా.. నేను ఎదురింటి అతను కదా.. పేరు తెలిసిపెట్టుకుంటే.. మంచిది అని తెలుసుకున్న అంతే..

సత్య: సరే, నిజం చెప్పేస్తా.. ఎందుకంటే లాగడానికి ఇది సీరియల్ కాదు.. అంత టైం కూడా లేదు. 3 నెలలు గా చుట్టూ ప్రపంచాన్ని పట్టించుకోకుండా పరిగెత్తే నన్ను.. కాసేపు ఆపి నిన్ను కాసేపు చూసేలా చేసావ్. అది నీ చెవులకు ఉన్న జుంకాల మాయో, లేదా నీ ముక్కు కి ఉన్న ముక్కుపుడక మహిమో నాకు తెలీదు కానీ.. నిన్ను కాసేపు చూస్తే.. ప్రపంచం ఆగి.. నీకోసం ఒక రాకుమారి ఉందిలే మిత్రమా... ముందు సాగిపో రేపో మాపో కలుద్దువు కానీ అని ధైర్యం చెప్తున్నట్టు ఉంటుంది.
కొన్ని సార్లు ఒక రోజులో నిన్ను చూసే క్షణం కోసం... మిగిలిన 23 గంటల 59నిమిషాల 59 సెకన్లు, ఎదురుచూస్తున్నా ఏమో అనిపిస్తుంది తెలుసా. నాకు కార్ ఉంది. కానీ నీ ఇష్టాయిష్టాలు తెలుసుకుని.. నీకు నాకు సెట్ అవుతుందా లేదో అర్థం చేసుకుందాం అని నీతో నడిచాను. నువ్వేమో నాకు sunset ఇష్టం అని మొదటి ప్రశ్న కే నిరాశని పరిచయం చేసావ్

స్వప్న: మరి నువ్వు.. నాకు కాఫీ ఇష్టం అని ఉసూరు మనిపించలేదా..

సత్య: ఏంటి..?

స్వప్న: అంటే... మూడు నెలల్లో నువ్వు నాకు తెలియకుండానే నన్ను చూస్తున్న అనుకుంటున్నావా ఏంటి? నాకు తెలుసు నువ్వు నన్ను చూస్తున్నావ్ అని.. కానీ అదెప్పుడు బయటపెట్టలేదు. నువ్వే ఎలాగోలా పరిచయం చేస్కుంటావని, కొన్ని రోజులు ఇలానే బాగుంది కదా అనుకుని ఊరుకున్నాను.. నువ్వు నన్ను చూడటానికి 23 గంటల 59 నిమిషాల 59 సెకన్లు ఎదురుచూసే వాడివి.. కానీ నేను నీకు కనిపించడానికి 23 గంటల 59 నిమిషాల 59 సెకన్లు ప్రయాణం చేసేదాన్ని. నీతో రేపో మాపో మెల్లగా మాట్లాడడం అనుకునేలోపు ఈ పని పడింది. పోన్లే ఇది కూడా మంచికే అయ్యింది.. ఇలా అయినా మాట్లాడుకుంటున్నాం.
నిజానికి నువ్వు అక్కడ పదండి అని లగేజ్ తీసుకున్న వెంటనే, క్యాబ్ బుక్ అయ్యింది.. నేనే cancel చేశా.. మొత్తానికి నువ్వు మాట్లాడతావేమో అని... తీరా చూస్తే.. నీకు ఏం సినిమాలు ఇష్టం.. పొద్దున్న ఇష్టమా రాత్రి ఇష్టమా అని.. ఆకాశం ఇష్టమా భూమి ఇష్టమా? వాటిని అసలు conversation అంటారా? పోనీ ఎమన్నా సిమిలారిటీ ఉందా అంటే లేదు. కాఫీ ఇష్టం అంటా దొరగారికి..

సత్య: వెయిట్. అంటే నువ్వు కూడా.. నాతో మాట్లాడాలి అని ఎదురుచూస్తున్నావా?

స్వప్న: కాదు, నువ్వు మాట్లాడతావని ఎదురుచూస్తున్న..

సత్య: అదేలే ఏదో ఒకటి.. ఈ ముక్క ముందే తెలుసుంటే.. మూడు నెలలు వేస్ట్ చేసేవాడ్ని కాదు కదా..

స్వప్న: అలా ఎందుకు ఆలోచిస్తావ్.. ఈ మూమెంట్ విలువ మూడు నెలల ఖర్చు అనుకోవచ్చు గా.. కానీ మన మధ్య కామన్ పాయింటే ఏం తట్టట్లేదు.

.

సత్య: అలా ఎందుకు అనుకుంటావ్.. నీ సూర్యోదయం ఇష్టం, నాకు సూర్యాస్తమయం ఇష్టం. కానీ సూర్యుడు కామన్. నీకు టీ ఇష్టం, నాకు కాఫీ ఇష్టం కానీ తాగడం కామన్ .. నీకు ఖుషి ఇష్టం నాకు తొలిప్రేమ ఇష్టం కానీ పవన్ కళ్యాణ్ కామన్. నీకు భూమి ఇష్టం నాకు ఆకాశం ఇష్టం కానీ ట్రావెలింగ్ కామన్. వెతికితే ఇలా కామన్ పాయింట్స్ చాలానే దొరుకుతాయి కలవాలి అనుకోవాలే కానీ, కారణాలు బోలెడు. అనేసరికి ఇద్దరు నవ్వుకున్నారు.

(అంతలో bus వచ్చేసింది.. ఆ నవ్వులు ఇంకొంచెం సేపు ఉంటే బాగుండు అనిపించింది ఇద్దరికీ)

స్వప్న: ప్రస్తుతానికి ఫ్రెండ్స్ అవ్వడానికి ఈ కామన్ పాయింట్స్ చాలులే .. మిగితావి తరువాత ఆలోచిద్దాం ( అని బస్ ఎక్కబోతూ.. ఇంటి కీస్ సత్య చేతికి ఇచ్చింది.. )

స్వప్న: ఇల్లు జాగ్రత్త.. చాలా ఇష్టంగా డిజైన్ చేసుకున్నా.. ఇది ఎవరికీ ఇవ్వాలో తేలిక నాతోనే తీసుకునివెళదాం అనుకున్న.. కానీ, ఇప్పుడు నీకు ఇద్దాం అనిపిస్తోంది.

సత్య: అవునా నేను చూస్కుంటాలే.. అని తనకి వీడుకోలు చెప్పేసాడు..

ఇక అక్కడనుండి, ఇంటికి వచ్చి.. మొబైల్ చూసేసరికి insta లో స్వప్న నుండి రిక్వెస్ట్ ఉంది. సత్య accept చేసి, స్వప్న కి తన వాట్సాప్ నెంబర్ షేర్ చేసాడు. ఇక ఎప్పటిలానే సూర్యోదయాన్ని చూస్తూ కాఫీ తాగీ.. సూర్యాస్తమయానికి స్వప్న రూమ్ కి వెళ్లి, అక్కడ టీ తాగుతూ.. తనకి ఫోటో పంపడం అలవాటు చేసుకున్నాడు. స్వప్న కి కూడా చెన్నై ఫిల్టర్ కాఫీ నచ్చడం మొదలయ్యింది. అలా వాళ్ళ ప్రయాణం మాధాపూర్ 100 ఫీట్ రోడ్ సాక్షిగా .. ఒకరి ఇష్టాలు ఒకరు అర్థం చేస్కుంటూ... ఇప్పుడే మొదలయ్యింది.