Contributed By Babu Koilada
ప్రేమకథలను సినిమాలుగా తెరకెక్కించడం చాలా కష్టం. కొన్ని ప్రేమకథలు మనకు చిరకాలం గుర్తుండిపోతాయి. “దేవదాసు“ తీసిన వేదాంతం రాఘవయ్య గారి దగ్గర నుండి “నువ్వు నేను“ సినిమా తీసిన తేజ వరకూ ఎందరో దర్శకులు.. తెలుగు చిత్రసీమలో ఎన్నో ప్రేమకథలకు ప్రాణం పోశారు. అలా సూపర్ డూపర్ ప్రేమకథలను మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి అందించిన పలువురు దర్శకులు కేవలం ఒకే ఒక్క ప్రేమకథా చిత్రంతోనే లెక్కలేనంత పేరు సంపాదించి... ఆ తర్వత పూర్తిగా ఇండస్ట్రీకి దూరమవ్వడం లేదా ఫామ్ కోల్పోవడం బాధాకారం. అలాంటి కొందరు టాలీవుడ్ దర్శకుల గురించి ఈ రోజు మీకోసం.
అశోక్ కుమార్ (అభినందన): ప్రేమ ఎంత మధురం.. ప్రియురాలు అంత కఠినం అంటూ 1980ల్లో తెలుగు సినిమా ఇండస్ట్రీకి “అభినందన“ లాంటి గొప్ప చిత్రాన్ని అందించిన అశోక్ కుమార్.. ఆ తర్వాత అదే స్థాయి లవ్ స్టోరీని ఆయన ఎందుకో తీయలేకపోయారు. తర్వాత అడపా దడపా సినిమాలు తీసినా.. అవేవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.
భరత్ పారేపల్లి (తపస్సు): తళుకుమన్నది కులుకుల తార.. అంటూ ప్రేమికుల గుండెలను 1990ల్లో తట్టి లేపిన.. భరత్ పారేపల్లి “తపస్సు“ సినిమాతో తెచ్చుకున్న పేరు అంతా ఇంతా కాదు. దాసరి గారే స్వయంగా ఈ దర్శకుడి ప్రతిభను అప్పట్లో మెచ్చుకున్నారట. కానీ ఇప్పడు ఈ డైరెక్టర్ ఎక్కడ ఉన్నాడో... ఏం చేస్తున్నాడో కూడా ఎవరికీ తెలీదు.
గొల్లపూడి శ్రీనివాస్ (ప్రేమ పుస్తకం): గొల్లపూడి మారుతీరావు తనయుడు గొల్లపూడి శ్రీనివాస్ దర్శకత్వం వహించిన చిత్రం ప్రేమ పుస్తకం. తమిళ సూపర్ స్టార్ అజిత్ ఈ చిత్రంతోనే సినీ రంగానికి హీరోగా పరిచయమయ్యారు. ఈ చిత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. కానీ ఈ సినిమా షూటింగ్ సమయంలోనే శ్రీనివాస్ అర్థాంతరంగా మరణించడంతో.. ఓ మంచి దర్శకుడిని సినీ పరిశ్రమ కోల్పోయినట్లయింది.
కాశీ విశ్వనాథ్ (నువ్వు లేక నేను లేను): తరుణ్, ఆర్తి అగర్వాల్‌ల కెరీర్‌కు ఎంతో హెల్ప్ అయిన ప్రేమకథా చిత్రం ‘నువ్వు లేక నేను లేను” . సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. 2000ల్లో ఈ చిత్రం ప్రేక్షకులను ఒక్క ఊపు ఊపింది. కానీ ఈ ఒక్క సినిమాతోనే కాశీ విశ్వనాథ్ డైరెక్షన్ కెరీర్ ఆగిపోవడం విషాదం. ప్రస్తుతం ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు.
షిండే (నిన్నే ప్రేమిస్తా): అక్కినేని నాగార్జున, శ్రీకాంత్, సౌందర్య కాంబినేషనులో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో పెద్ద ట్రెండ్ సెట్టర్. మంచి మ్యూజికల్ హిట్ కూడా. కానీ ఈ చిత్రం రిలీజ్ అయ్యాక.. షిండే లాంటి గొప్ప డైరెక్టర్ మరణించడం నిజంగానే పరిశ్రమకు తీరని లోటు.
రవిబాబు (నచ్చావులే): అల్లరి చిత్రంతో కెరీర్ ప్రారంభించాక.. రవిబాబు అమ్మాయిలు అబ్బాయిలు, సోగ్గాడు, మనసారా, నువ్విలా లాంటి ప్రేమకథలు ఎన్నింటినో ఆయన తెరకెక్కించారు. కానీ ‘నచ్చావులే‘ సినిమా తనకు తీసుకొచ్చిన పేరు .. ఇంకే సినిమా కూడా తీసుకురాలేదు. ఆ స్థాయి సినిమాను మళ్లీ ఈయన తీస్తారో లేదో కూడా తెలియదు.
శ్రీను వైట్ల (ఆనందం): ‘నీకోసం‘ అనే ప్రేమకథా చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన శ్రీనువైట్లకు.. ‘ఆనందం‘ సినిమా ఇచ్చిన సూపర్ సక్సెస్ ఏ చిత్రం కూడా ఇవ్వలేదు. తర్వాత ఎక్కువగా యాక్షన్ కామెడీ సినిమాలనే తీసిన శ్రీను వైట్ల.. ‘ఆనందం‘ లాంటి సినిమా మళ్లీ తీస్తారో లేదో ఆయనకే తెలియాలి. తెలుగు ప్రేమకథా చిత్రాలలో ‘ఆనందం‘ చిత్రానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది
రసూల్ (ఒకరికొకరు): శ్రీరామ్ హీరోగా నటించిన ‘ఒకరికొకరు‘ ఎంత పెద్ద హిట్ చిత్రమో తెలియంది కాదు. ప్రేమకథా చిత్రాలలో ఈ సినిమాకి.. ఇప్పటికీ తనకు ఉండాల్సిన ప్రత్యేకత ఉంటుంది. అయితే ఈ సినిమా విడుదలయ్యాక.. ఆయన నుండి అదే స్థాయి సినిమాను మనం మళ్లీ చూడలేదు. స్వతహాగా సినిమాటోగ్రాఫర్ అయినా రసూల్.. ప్రస్తుతం దర్శకత్వాన్ని పక్కన పెట్టి..ఆ పనిలోనే బిజీగా ఉన్నారు.
ఎస్.జె.సూర్య (ఖుషీ) ‘ఖుషీ‘ చిత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఎంత పెద్ద హిట్టో మనకు తెలియంది కాదు. ఈ వైవిధ్యమైన ప్రేమ కథా చిత్రానికి దర్శకత్వం వహించిన ఎస్.జె.సూర్య తర్వాత అదే స్థాయి సినిమాని తీయలేకపోవడం గమనార్హం. భవిష్యత్తులో ఆయన నుండి ఈ స్థాయి ప్రేమకథ చిత్రాన్ని ఎక్స్‌పెక్ట్ చేయగలమో లేదో కూడా చెప్పలేం.
ఆనంద్ రంగా (ఓయ్) సిద్ధార్థ్, షామిలీ జంటగా నటించిన ‘ఓయ్’ చిత్రం.. బ్లాక్ బస్టర్ చిత్రం కాకపోయినా.. ఒక కల్ట్ స్టేటస్ పొందిన ప్రేమ కథా చిత్రాలలో ఒకటి. అయితే ఇంత మంచి సినిమాను తీసిన ఆనంద్ రంగా.. ఆ తర్వాత పెద్దగా సినిమాలుగా తీయకపోవడం ఆశ్చర్యమే
కరుణాకరన్(తొలిప్రేమ) తన మొదటి సినిమా తోనే cult classic లెవెల్ ప్రేమకథ ని తీసిన కరుణాకరన్. ఆ తరువాత, డార్లింగ్, ఉల్లాసంగా ఉత్సాహంగా లాంటి సినిమాలు తీసినా, తొలిప్రేమ లాంటి సినిమా ఆయననుండి ఇంకోటి ఎప్పుడొస్తుందా అని ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాం.
ఇంకా చాలామందే ఉండుంటారు. మేము మర్చిపోయినవి మీకు గుర్తున్నవి ఉంటె చెప్పేయండి మరి.