ఎంత ఆలస్యమైనా గాని న్యాయం ఎన్నటికి గెలిచి తీరుతుంది. నిజమే కాని అప్పటి వరకు పోరాడాలంటే ఎంత ఓపిక కావాలి.! దేశ న్యాయ వ్యవస్థ మీద ఎంత నమ్మకం ఉండాలి.! గెలిచేంత వరకు పోరాడాలంటే ఎంత ధైర్యం కావాలి.!
అసలేం ఏం జరిగింది.? రాజేశ్వరి గారి భర్త పార్వతీశం గారు వైజాగ్ జూనియార్ కాలేజ్ లో ప్రిన్సిపాల్ గా పనిచేసేవారు. అప్పటి మేనేజ్ మెంట్ లోని కొంతమంది ఉద్యోగుల ప్రవర్తన నచ్చక కొంతకాలం దూరంగా ఉన్నారు. అతనిని మరింత ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో పార్వతీశం గారిని పై అధికారులు కుట్రపూరితంగా 1982లో ఉద్యోగం నుండి తొలగించారు. అదే సంవత్సరం కావాలనే నాపై పగ తీర్చుకోవడానికే ఇలా చేశారని చెప్పి పార్వతీశం గారు కోర్టులో కేస్ వేశారు. ఆ తర్వాత 1986లో పార్వతీశం గారి ఆరోపనలలో నిజం ఉందని తెలిసి కోర్టు పార్వతీశం గారికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. కాకపోతే అప్పటికే పార్వతీశం గారికి రిటైర్మెంట్ వయసు దాటిపోయింది. రిటైర్మెంట్ తర్వాత వచ్చే బెనిఫిట్స్ కోసం కోర్టు తీర్పు ఇచ్చినా కాని తర్వాత కొన్ని కారణాలు చూపుతూ బెనిఫిట్స్ పై స్టే విధించింది. ఇక అప్పటినుండి రావాల్సిన ప్రభుత్వ పెన్షన్, బెనిఫిట్స్ కోసం న్యాయంగా పోరాడడం మొదలుపెట్టారు.
1984 నుండి వైజాగ్ జిల్లా కోర్టులో ఆ కేస్ పెండింగ్ లోనే ఉంది. బ్రతికున్నన్నాళ్ళు పార్వతీశం, రాజేశ్వరి గారు కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. 2004లో పార్వతీశం గారు మనస్తాపం, ఆరోగ్య కారణాలతో చనిపోయారు. అప్పుడే ఆ పోరాటాన్ని భార్య రాజేశ్వరి గారు ఒంటి చెత్తో తన భుజాలపై వేసుకున్నారు. 34 ఏళ్ల ఈ సుదీర్ఘ పోరాటంలో తన కళ్ళ ముందే పుట్టిన వారు పెరిగి లాయర్లు ఐన వారు కూడా ఉన్నారు.. కాని తన ప్రయాణం మాత్రం ఆగలేదు. రోజులు, నెలలు, సంవత్సరాలు, దశాబ్ధాల తరబడి ఆ కోర్టు ఇచ్చే న్యాయం కోసం ఎదురుచూశారు.
జ్యోతిర్మయి గారి రాక... ఈ కేసు గురించి జిల్లా జడ్జ్ జ్యోతిర్మయి గారికి తెలిసింది. 30 ఏళ్ళకు పైగా 86 సంవత్సరాల వయసు గల రాజేశ్వరి గారి న్యాయ పోరాటం చూసి చలించిపోయారు. ఆ బాధనంతా చేతలలో చూపించారు. పార్వతీశం గారికి వచ్చే పెన్షన్, ఇతర బెనిఫిట్స్ గురించి సంబంధిత అధికారులను పిలిపించి కేవలం ఒకే ఒక్క రోజుల్లో పరిష్కరించారు. ఇన్నేళ్ళ పాటు కోర్టు చేసిన ఆలస్యానికి వారందరి తరుపున జడ్జ్ జ్యోతిర్మయి గారు రాజేశ్వరి పాదాలకు నమస్కరించి వినమ్రంగా క్షమాపన కోరారు. "ఇలాంటి ఫలితం, ఇలాంటి రోజొకటి ఈ జీవితంలో వస్తుందనుకోలేదమ్మా.." అని ఆ గెలుపు క్షణాన రాజేశ్వరి గారు ఉద్విగ్నతకు లోనయ్యారు.
Image Source: Sakshi