ప్రపంచ వ్యాప్తంగా సుమారు 4 కోట్ల మంది అంధులు ఉంటే కేవలం మన దేశంలోనే ఒక కోటి ఇరవై లక్షలమంది ఉన్నారు. ప్రపంచ జనాభాలో ఎక్కువ భాగమైన మనకు ఇంత శాతం అంధులను కలిగి ఉండడం మన మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఇప్పుడు నేత్రదానం గురుంచి మాట్లాడుకుంటున్న మనలో చాలామందికి దీని మీద అవగాహన అటుంచి అసలు పట్టించుకునే వారే ఉండరు. ఎందుకంటే కంటి విలువ మనలో చాలామందికి పూర్తిగా తెలియదు మనదాక వచ్చేదాకా.
గోవిందరాజులు గారు విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి విద్యుత్ సహకార సంఘంలో స్టెనో గ్రాఫర్ గా ఉద్యోగం చేస్తున్నారు. తన కూతురు ప్రియాంక క్లాస్ మేట్ కు కార్నియా లోపం ఎదురయ్యింది. ఎంతోమంది డాక్టర్లకు చూపించినా గాని ఫలితం లేకపోయింది. తనకు ఈ అద్భుతమైన ప్రపంచాన్ని చూసే భాగ్యం పోయింది. ఓ డాక్టర్ ఆ పాపను పరిశీలిస్తే మళ్ళి ఆశ చిగురించింది. ఎవరైనా కార్నియా దానం చేస్తే కనుక పాప తిరిగి ఈ ప్రపంచాన్ని చూడగలుగుతుందని అభయం ఇచ్చారట. ఇప్పుడే అసలు సమస్య మొదలయ్యింది.
కార్నియా డోనర్ కోసం చాలా చోట్ల వెతికారు.. హాస్పిటల్స్ లో, ఐ బ్యాంక్ లలో తెలిసిన వారి దగ్గర ఇలా ప్రతిచోటా వెతికారు. కాని లాభం లేదు. ఆశ పూర్తిగా నిర్వీర్యం అవుతున్న సమయంలోనే ఒక డోనర్ దొరకడంతో ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. ఆపరేషన్ సక్సెస్ కావడంతో అక్కడితోనే గోవిందరాజులు గారు ఆగిపోలేదు ఆ పాప ఎదుర్కున్న పరిస్థితి మరెవ్వరికీ ఎదురుకాకూడదని నేత్రదాన ఉద్యమం మొదలుపెట్టారు..
పట్టణాలలో అంటే ప్రజలు నేత్రదానానికి ముందుకు వస్తారు, కాని పల్లెలో అంటే రకరకాల మూఢ నమ్మకాలతో వెనుకడుగువేస్తారు. ముందు ప్రజలలో అవగాహన కల్పించాలి అని గోవిందరాజులు గారు ఉద్యోగం చేస్తూనే పల్లె ప్రజలను మోటివేట్ చేయడం మొదలుపెట్టారు. మొదట అన్నిరకాల అవమానాలు, అపోహలు ఎదురయ్యాయి.
గోవిందరాజులు గారు ఇప్పటికీ 35 సార్లు రక్తదానం చేశారు. ఆయన వ్యక్తిత్వాన్ని అర్ధం చేసుకోవడానికి ఈ చిన్ని ఉదాహరణ చాలు. ఈ ప్రయాణంలో ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా గాని నేత్రదాన ఉద్యమానికి అనుకూలంగా మార్చుకున్నారు. అలా దాదాపు 10 సంవత్సరాల కాలంలో సుమారు 75 గ్రామాలలో పర్యటించి నేత్రదానం మీద పరిపూర్ణ అవగాహన కల్పించి 82,000 మంది నేత్రదానానికి హామీ పత్రాల మీద సంతకం చేశారు. పది సంవత్సరాలలో ఇప్పటికీ 620 కార్నియా ఆపరేషన్లు దిగ్విజయంగా పూర్తిచేశారు.