కూతురు అంటే బరువు కాదు బ్రతుకు అని నిరుపిస్తుంది బిందుప్రియ.. బిందుప్రియది కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని మొండికుంట అనే ఒక గ్రామం. అమ్మ నాన్నకు కలిగిన ముగ్గురు ఆడపిల్లల సంతానంలో తను ఒకరు. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం వారిది. తండ్రి మేడేపల్లి రాజేష్ మొదట ఇంటింటికి తిరిగి తన కులవృత్తిని చేసేవారు. కష్టపడి తమ ఖర్చులు తగ్గించుకుని ఒక్కో రూపాయి పోగుచేసి మేడిపల్లి రాజేష్ ఒక చిన్నపాటి సెలూన్ ని ఆ గ్రామంలో ప్రారంభించారు.

కొంతకాలం వరకు వారు ఊహించినట్టే వారి జీవితం గడిచింది. కాని ఒకరోజు రాజేష్ సెలూన్ లో పనిచేస్తుండగా అకస్మాత్తుగా కళ్ళుతిరిగి పడిపోయాడు. హాస్పిటల్ కి తీసుకుపోగా అక్కడ తేలింది ఏంటంటే రాజేష్ కి ప్రమాదకరమైన వ్యాధి బ్రేయిన్ ట్యూమర్ సోకిందని. ఆరోగ్యం బాగోలేక నాన్న పనికి వెళ్ళకపోవడంతో వారి కుటుంబం కష్టాలలో మునిగిపోయింది. నాన్న మందుల ఖర్చులు కాదు కదా వారు తినటానికి తిండి కూడా దొరకని పరిస్థితికి దిగజారిపోయింది ఆ కుటుంబం. సమస్యలపై తలవంచడం కాదు వాటిపై తలయెత్తి పోరాటం చేసినప్పుడే ఆ సమస్యలను దాటగలమని బలంగా నమ్మి 8వ తరగతి చదువుతున్న రాజేష్ కూతురు తండ్రి చేస్తున్న పనినే తను చేయాలని నిశ్ఛయించుకుంది.

పెద్దవారే కటింగ్, షేవింగ్ చేయడానికి కాస్త తడబడతారు మరి 8వ తరగతి చదువుతున్న బిందుప్రియ ఎలా చేయగలుగుతుందని అందరూ భయపడ్డారు కాని బిందుప్రియ నేర్పరి తనాన్ని చూసి ఆశ్ఛర్యపోయి గ్రామస్థులందరూ బిందుప్రియ సెలూన్ లోనే చేసుకునేవారు. కుటుంబానికి ఆర్ధికంగా అండగా ఉంటూనే, తండ్రి ఆరోగ్యానికి మందులు సమకూర్చింది బిందు. అంతేకాకుండా స్నేహితులు, మాష్టారు సహాయంతో పనిచేసుకుంటునే చదువుకుంటుంది(ప్రస్తుతం బిందు 9వ తరగతి చదువుకుంటుంది). అలా అత్యంత దయనీయ పరిస్థితులలో ఉన్న కుటుంబానికి ఆసరాగా నిలిచింది. ప్రస్తుతం ఆరోగ్యం కుదుటపడడంతో తండ్రి షాపుకు వస్తున్నారు.. ఐనా గాని పూర్తిగా మెరుగయ్యేంత వరకు నాన్నకు సహాయంగా ఉండాలనుకుంటుంది బిందుప్రియ. బ్రతిమలాడే వారిపై సమాజం జాలి చూపిస్తుంది కాని సమస్యలపై ఎదురు తిరిగి పోరాడే వారికి గౌరవం ఇస్తుంది. బిందు ప్రియ చేస్తున్న పోరాటాన్ని గుర్తించి కాకినాడ శ్రీ పీఠం వారం బిందుని యూత్ ఐకాన్ గా ఎంపిక చేసి 25వేల నగదు ప్రోత్సాహాన్ని అందించారు. ఆ తర్వాత శాంతా బయోటిక్ ఎండి. వరప్రసాద్ గారు సంవత్సరానికి లక్ష రూపాయల చొప్పున పదేళ్ళపాటు పదిలక్షల ఆర్ధిక సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు.

మన భారతదేశాన్ని ఒక మహిళగా పోలుస్తారు.. భారత్ మాతాకి జై అని గట్టిగా నినదిస్తారు.. దేవత అంటూ కీర్తిస్తారు.. కాని అందులో చాలామంది వాస్తవ ప్రపంచంలో మహిళకు అండగా ఉండరు. పుట్టిన పసికందు నుండి ముసలితనం వచ్చేంత వరకు మన దేశంలోని అధిక శాతం మహిళలు వివక్షను ఎదుర్కుంటున్నారు. నిజానికి కూతురు, కొడుకు అనే తేడాలు, చిన్న చూపు అనేవి మొదట మన ఇంటి నుండే మొదలవుతున్నాయి. కొడుకుకి ఒక రకమైన భోజనం, కొడుకుకి ఒక రకమైన చదువు, బట్టలు, ఖర్చు, ప్రేమ అని అన్నిట్లో తేడాలు చూపిస్తూ తల్లిదండ్రలే చిన్నతనం నుండి వారిలో ఆత్మనూన్యత భావాన్ని ఏర్పరుస్తున్నారు. "ఇక మా బ్రతుకింతే, ఇది మా కర్మ, మేము ఆడపిల్లగా పుట్టడమే మేము చేసుకున్న పాపం.." అంటూ చాలామంది మహిళలు ఇప్పటికి వారిని వారు కించ పరుచుకుంటూ వారిలో ఉన్న అద్భుత శక్తిని గుర్తించలేక ఇంకొకరి దయాదక్షిణ్యాల మీద బ్రతుకుతున్నారు.. మనసును, శరీరాన్ని హింసకు గురిచేసుకుంటున్నారు.! పిల్లలను ఆడ మగ అనే తేడా లేకుండా సరిగ్గా పెంచగలిగితే ఎవ్వరైనా అత్యున్నత స్థాయికి అభివృద్ధి చెందగలరు.. ఆపద సమయంలో తల్లిదండ్రులకు కొండంత అండగా నిలబడగలరు.. అని నమ్మడానికి బిందుప్రియ లాంటి ఎందరో మహిళలు గొప్ప ఉదాహరణలు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.