ఇటీవల కేంద్ర సాహిత్య అకాడమీ ప్రకటించిన అవార్డుల్లో మన తెలుగు విభాగంలో ‘మెర్సీ మార్గరెట్’ గారు రాసిన ‘ మాటల మడుగు’ అనే కవితా సంపుటికి ‘యువ పురస్కార్” అవార్డుని ప్రకటించడం జరిగింది. అసలు సాహిత్యనేపథ్యం లేని మధ్య తరగతి కుటుంబానికి చెందిన మెర్సీ మార్గరెట్ గారు ఫేస్బుక్ లో కవితలు రాయడంతో ప్రారంభించి, పూర్తిస్థాయి కవిగా మారి, ‘మాటల మడుగు’ అనే పుస్తకాన్ని రచించి కేంద్రస్థాయి అవార్డు అందుకోవడం అంటే ఆసక్తికరమైన విషయమే కదా మరి. కొంత lengthy అయినా తప్పక చదవగలరని మనవి. తెలుగును అభిమానించే వారందరికీ, కవితలు ఇప్పుడిప్పుడే మొదలెడుతున్న చాలా మందికి స్ఫూర్తి నింపాలన్న సదుద్దేశంతో ఈ ఇంటర్వ్యూ..
సంజిత్: హలో మేడం! అవార్డు సాధించినందుకు congratulations. మెర్సీ మార్గరెట్ : థాంక్యు అండి. (నవ్వుతూ)
అవార్డు వచ్చిన సక్సెస్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు? అవునండి..కానీ అవార్డుతో పాటు బాధ్యతా పెరిగింది. నా మొదటి పుస్తకానికే అవార్డు రావడం తో తర్వాత రాయబోయే పుస్తకం అంచనాలను అందుకుంటుందో లేదో అన్న భయం కుడా మొదలైంది. రాస్తానన్న నమ్మకం అయితే ఉంది.
అసలు మీ నేపథ్యం ఏంటీ?మీరు చదువుకోసం చాల కష్టపడాల్సి వచ్చిందని విన్నాను.... మాది హైదరబాదు లోనే గాంధీ నగర్ దగ్గర రంగా నగర్. మాది మధ్యతరగతి కుటుంబం. నా tenth class పూర్తయ్యే నాటికి మా నాన్న అనారోగ్య కారణాల వాళ్ళ రిటైర్ అయ్యారు. ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉండేవి కాబట్టి ఒకవైపు ఇంటర్మీడియట్ చేస్తూనే ఒక tupperware containers తయారు చేసే కంపెనీ లో మెషిన్ ఆపరేటర్ గా పనిచేయాల్సివచ్చేది. ఇంటర్ తర్వాత ఇంట్లో ట్యూషన్లు చెప్తూ డిగ్రీ పూర్తిచేసాను. ఆ తర్వాత ఒకవైపు p.g. చేస్తూ ఒక కాలేజీ లో పార్ట్ టైం లెక్చరర్ గా, సాయంత్రం అక్షరజ్యోతి వాలంటీర్ గా, బ్రిడ్జి స్కూల్ లో, స్టూడెంట్స్ కి ట్యూషన్లు చెప్తూ క్షణం తీరికుండేది కాదు.
మరి రచయిత అవ్వాలన్న ఆలోచన ఎలా వచ్చింది? నేను 7th క్లాసు లో ఉన్నప్పుడు గోపీ గారికి తెలుగులో కేంద్రసాహిత్య అకాడెమీ అవార్డు వచ్చింది. అప్పుడు, దూరదర్శన్ లో ఒక కార్యక్రమంలో, ఆయన “నానీలు” చదివి వినిపించారు. అప్పుడు నేను కుడా ఇలా రాయగాలనన్పించింది. 9th, 10th క్లాసుల్లో రెండు కథలు రాసి ఈనాడు పత్రికకు పంపించాను. అవి పబ్లిష్ అవలేదనుకోండి. ఆ తర్వాత ఒత్తిడి నుండి బయటపడడానికి కవితలు రాసేదాన్ని. అలా ఒక 40 కవితలు రాసి మా తెలుగు లెక్చరర్ కు చూపెడితే ఆయన ఇలానే రాస్తూ ఉండమని ప్రోత్సాహించారు. అలా కవిత్వం నా ఆత్మ భాష అయింది. అలా చదవడం,రాయడం నా జీవితం లో భాగం అయింది.
మరి మీరు పేస్ బుక్ ద్వారా కవితాలోకానికి పరిచయమంటారు? హ హ (నవ్వుతూ). అవును. ‘మనసు పలికే మౌన గీతం’ అని ఒక పేజి స్టార్ట్ చేసి అందులో కవితలు రాయడం మొదలుపెట్టాను.అసలు అప్పుడవి కవితలా, కాదా కూడా తెలిసేవి కావు. తర్వాత తర్వాత Google లో ఆర్టికల్స్, youtube లో poetry workshops బాగా చూసేదాన్ని. అలా అవగాహన పెంచుకొని రాయడం మొదలు పెట్టాను. మొదట్లో ప్రేమ, విరహం లాంటి వాటిపై రాసేదాన్ని . అవగాహన పెరిగిన కొద్దీ సామాజిక అంశాలపై రాయడం ప్రారంభించాను. ఫేస్బుక్ వేదికగా కొన్ని Fentos,కవి సంగమం లాంటి గ్రూప్స్ లో 2 వాక్యాల్లో కవితలు రాసుకునే వాళ్ళం. అందులో కొంతమంది కవులు సలహాలు ఇవ్వడం, వాటిని పాటించడం, అలా పట్టు పెరిగింది. facebook చాలా నేర్పించింది లెండి. Thanks to Zukerberg.
చాలా అంటే ...? వివక్ష అనేది మనుషుల మెదడు లో ఎలా పూనుకుపాయిందో, కవితలో క్వాలిటీ కంటే దానికి వచ్చిన ప్రచారానికి ఎలా ప్రాముఖ్యతనిస్తారో, ఇలా ఎన్నోపాఠాలు. ఒక రకంగా Facebook is the index of mind అనొచ్చు.
వివక్షనా, కొంచెం విపులంగా చెప్తారా.... నా పేరు చూసిన ఎవరికైనా నా సామాజికవర్గం, నా మతం తెలిసిపోతుంది. కేవలం నా పేరు చూసి నా కవితలను పట్టించుకోని వాళ్ళు చాల మంది. దీన్ని టెస్ట్ చేయడానికి, నేనొక అచ్చమైన తెలుగు పేరుతో ఒక ఎకౌంటు create చేసాను. ఇక్కడ ఎవరైతే నా కవితలను పట్టించుకోరో, వాళ్ళే ఆ FB account కి requests పంపడం, నేను ఆ పేరుతో ప్రచురించిన కవితలపై వ్యాసాలూ రాయడం లాంటివి చేసేవాళ్ళు. ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే.వివక్ష అనేది మెదడులో నుంచే మొదలవుతుంది. అది బయటికి కనబడకపోవచ్చు, కానీ, ఉంటుంది . ఇంకా రాను రాను మనిషి మెదడు పురోగమనానికి బదులు తిరోగామిస్తుందేమో అనిపిస్తుంది .. నాకు అవార్డు రాకముందు ఎవరు పట్టించుకోలేదు కానీ అవార్డు వచ్చిన తర్వాత నాకు ఫ్రెండ్ రిక్వెస్టులు పెరిగాయ్. అంటే క్వాలిటీ కంటే ప్రచారం ఉంటేనే పట్టించుకున్నట్టుగా.
Facebook నుండి ‘మాటల మడుగు’ బుక్ వరకు మీ ప్రయాణం ఎలా జరిగింది?? మమ్మల్ని కొంతమంది ఇంటర్నెట్ కవులు అనే వాళ్ళు. అందుకే పత్రికలలో కవితలు రాయాలన్పించింది.అలా ఆంధ్రజ్యోతి “వివిధ” లో ఒక కవిత ప్రచురిచితమయింది. తర్వాత అలా చాలా అయ్యాయి. 2013 లో నేనొక workshop conduct చేసాను. అప్పుడు కొంతమంది, ఒక బుక్ కూడా పబ్లిష్ చేయకుండా workshop conduct చేసింది అనడం వాళ్ళ నా ఫేస్బుక్ కవితలు కొన్నింటిని , అలాగే మరికొన్ని కవితలు కలిపి ‘మాటల మడుగు’ గా పుస్తకం గా మారింది.
మాటల మడుగు లో ఎన్ని కవితలుంటాయి ? బుక్ ఈజీ గానే పబ్లిష్ అయిందా? మాటల మడుగు లో 52 కవితలుంటాయి. ఒక వందేళ్ళ తర్వాత చదివినా నా కవితలు మనసుకు హత్హుకునేలా ఉండాలని రాయడానికి ప్రయత్నించాను. 2013 వరకే అన్ని ‘ముందు మాట’లు వచ్చినా perfection కోసం ప్రయత్నించడం వల్ల మళ్ళీ మళ్ళీ రాస్తూ, పూర్తి అవడానికి 2015 వరకు time పట్టింది. విశాలాంధ్ర వాళ్ళు ‘కవిత్వం అచ్చేసి దండగ’ అన్నారు. ఇక ఎవరు కవిత్వాలు పబ్లిష్ చేయడానికి ముందుకు రాకపోవడంతో, నా భర్త సురేష్ సహకారం తో మేమే పబ్లిష్ చేసుకోవాల్సి వచ్చింది. ఈ విషయంలో నా భర్త సహకారం మరవలేనిది.
అవార్డు వస్తుందని ఊహించారా? మీ కవితల ప్రత్యేకత ఏమనుకుంటున్నారు? పోటి ఇవ్వగలమని మాత్రం అన్పించేది. పోయిన సారి కూడా అప్లై చేసాను. ఇక ప్రత్యేకత అంటారా ? నా కవితల పై పెద్దగా ఎవరి ప్రభావం ఉండకపోవడం అనుకుంటా.
అన్ని సాహితీ ప్రక్రియలుండగా కవిత్వాన్ని ఎంచుకోవడానికి కారణం ? కవిత్వం నేరుగా గుండెల్లో నుంచి వస్తుంది. మిగతా ప్రక్రియలు కథ గానీ, వ్యాసం గానీ సృజనాత్మకత ఉపయోగిస్తే కొంతవరకు కృతిమంగా అయిపోవచ్చు. కవిత్వం మన భావోద్వేగాలకు సంబంధించింది. మన మనసుకు అద్దం లాంటిది కవిత్వం. అందుకే కవిత్వం ఆత్మభాష అని నమ్ముతాను నేను. కవిత్వం ఒంటరితనాన్ని తెలుపుతుంది, సమాజం లో జరిగే దుర్మార్గాలపై ఆక్రోశాన్ని వెల్లగక్కుతుంది . చివరిగా కొన్ని ప్రశ్నలు..... మీకు బాగా ఇష్టమైన కవితలు.... కొప్పర్తి గారి ‘విశాద మోహనం’ మాటల మడుగు గురించి ఒక్క మాట ఒక్క మాటలో చెప్పలేనిది కవితకుండే మూడు లక్షణాలు పాఠకుణ్ణి కదిలిస్తుంది. తక్కువ పదాల్లో ఎక్కువ భావాన్ని చెప్పగలదు. అన్నింటికంటే, కవిత్వం అనిర్వచనీయం.
తెలుగు భాష పాఠకులు తగుతున్నారనే దానిపై అభిప్రాయం.. నిజమే. తల్లిదండ్రులు పిల్లలకు తెలుగు రాకపోతే గర్వపడడం మానేసి పిల్లలకు తెలుగు నేర్పించాలి, ప్రాథమిక విద్య అంతా ఖచ్చితంగా తెలుగులోనే ఉండాలి.
చివరిగా facebook లో కవితలు రాసేవారికి మీరిచ్చే సలహా... రాయడం ఆపొద్దు. కానీ, ముందు ఏ పత్రికలోనైనా ప్రచురించి ఫేస్బుక్ లో ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేయండి. Thank you Madam! You can follow her page HERE!
The below poem is “Maatala madugu” from the award winning book “Maatala madugu”
ఒకప్పుడు నోటి నిండా మాటలుండేవి మాటలకు మొలకల వేళ్ళుండేవి పచ్చగా మొలకెత్తేందుకు అవి సారవంతమైన నేలలు వెతికేవి
ఒకప్పుడు నోటినిండా మాటలుండేవి మాటలన్నీ శిల్పాలుగా మారేందుకు ఒకదాన్నొకటి పెనవేసుకుని, అంటిపెట్టుకుని ఉలి మొన స్పర్శ కోసం సిద్ధమై శిల్పాలవడానికి ఆత్రంగా ఉవ్విలూరేవి
ఒకప్పుడు నోటినిండా మాటలుండేవి మాటలన్నిటి కాళ్ళకి ఘల్లున మ్రోగే మువ్వలుండేవి మువ్వలన్నీ సంతోషంగా నృత్యం చేస్తూ మాటలకు విలువ పెంచేవి
అవును ఒకప్పుడు నోటి నిండా మాటలుండేవి మాటలకు రుచుండేది మసక కన్నుల్ని వెలిగించే నిప్పు రవ్వలుండేవి చెమట చుక్కల్ని కౌగలించుకునే చేతులుండేవి కడుపు నింపే ధాన్యపు గింజల్లా ఉండేవి
కాని ఇప్పుడేమయ్యిందో నోటినిండా మాటలున్నాయి మాటలన్నీ గాలికి తేలిపోయే తాలులా వరిపోట్టులా ఉన్నాయి
మాటల్ని తోడుకునే నాలుక చివరనుండి గొంతుకపై కొన్ని చేతుల ఉరి కాపలాకాస్తుంది మాటలన్నీ గవ్వలై మట్టి పెళ్లలై కాళ్ళు చేతులు విరిగిన బొమ్మలై నిస్తేజంగా ఉన్నాయి
ఇప్పుడూ నోటినిండా మాటలున్నాయి మాటలన్నీ ఆ పహారాకి ఘనీభవించి గడ్డకట్టి మంచు శిలలై , మౌన తపస్సు చేస్తున్నాయి
ఎవరైనా సహాయానికి రండి నాతోపాటు ఆ చేతుల్ని నరికి మంటజేసి మాటల్ని కరిగించడానికి మళ్ళీ ఆ మాటల్ని ప్రాణమూర్తుల్ని చేయడానికి