Contributed By Punnamraju Sahrudai
భగవంతుడా ! నువ్వు ఎక్కడున్నా, నీకు ఈ ఉత్తరం అందుతుందని ఆశించట్లేదు, నమ్ముతున్నాను.
నేను ఈ ఉత్తరం రాయడానికి కారణం, నాదొక ప్రత్యేకమైన విన్నపం. ఇది నేను రోజూ చేసే ప్రార్ధన లాగ కాదు, ఎందుకంటే నేను చాల పెద్ద విషయమే అడగబోతున్నాను. ప్రపంచంలో శాంతి కలిగించమనో, లేక ప్రపంచంలో పేదరికం తగ్గించమనో, లేక ఎవరు ఏది కోరుకున్న తీర్చమనో, లేక నా బాధలు తగ్గించమనో నేను అడగట్లేదు, అడగదల్చుకోలేదు కూడా. కానీ, నేనొక అద్భుతం గురించి అడుగుతున్నాను. నిజం చెప్పాలి అంటే ఇది చాల పెద్ద కోరిక, ముఖ్యమైన కోరిక, నిన్ను ఎప్పుడు అడగని కోరిక. అది ఏంటంటే... నువ్వు ఎవరు? అసలు నిజంగా నువ్వు ఎవరు?
నేను నువ్వు ఎవరో తెలుసుకోవాలని అనుకుంటున్నాను. అసలు నువ్వు ఎలా ఉంటావో తెలుసుకోవాలని అనుకుంటున్నాను. చిన్నప్పటి నుండి ఇప్పటిదాకా చాలామంది నీ గురించి చాలా రకాలుగా చెప్పారు. నువ్వు ఎప్పుడు కనిపిస్తావో చెప్పారు, నువ్వు ఏం చేస్తే కనిపిస్తావో కూడా చెప్పారు. నేను నీ గురించి చాలా కధలు విన్నాను. నేను నిన్ను చాలా సార్లు చాలా విధాలుగా చూశాను కూడా. రామాయణం చదివినప్పుడు రాముడిలా చూశాను, భాగవతంలో కృష్ణుడిలా చూశాను, ఖురాన్ లో అల్లా లా చూశాను, బైబిల్ లో యేసుక్రీస్తు లా చూశాను. ఇలా ఎన్నో పురాణాల్లో ఎన్నో విధాలుగా చూశాను కాని, నీ నిజ రూపాన్ని ఇంతవరకు చూడలేదు స్వామి.
నీ గురించి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకోవడం విన్నాను. ఒకళ్ళు నువ్వు లేవంటారు, ఇంకొకళ్ళు నువ్వు ఉన్నావు అంటారు, ఒకళ్ళు నిన్ను తిడతారు, ఇంకొకళ్ళు నీ అంతటివాడు లేడంటారు. ఏది నిజం? కానీ ఇన్ని చదివినా, ఇన్ని విన్నా, నా మనసులో నీ మీద నమ్మకం మాత్రం అలానే ఉండిపోయింది.. ఎందుకో తెలీదు! నువ్వు నిజంగా ఉన్నావో, లేదో తెలియదు. కానీ, నేను ఇప్పటికి నిన్ను నమ్ముతున్నాను. నేను నువ్వు ఎవరు అని అడుగుతున్నాను అంటే, నీ మీద నమ్మకం లేదు అని అనుకోకు. నా మనసు నిండా నీ మీద నమ్మకం ఉంది, భక్తి ఉంది, నువ్వు నిజమని నమ్ముతున్నాను, నువ్వు ఉన్నావని నమ్ముతున్నాను. నువ్వు ఉన్నావని సాక్ష్యం ఏంటి అని నేను అడగట్లేదు. కేవలం నువ్వు ఎవరో తెలుసుకుందామని అడుగుతున్నాను. పసి పిల్లాడికి తల్లి స్పర్శలా, నీ ఉనికిని నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను. ప్రతి క్షణం ఒక స్నేహితుడిలా నా పక్కనే నువ్వు ఉన్నట్టు నాకనిపించాలని నేను కోరుకుంటున్నాను.
నేను చదివింది కాదు, విన్నది కాదు, పురాణాల వర్ణన కాదు, నీ నిజమైన తత్త్వం, నీ నిజమైన భావం, నీ నిజమైన రూపం, నేను చూడాలని అనుకుంటున్నాను.. నేను సిద్ధంగా ఉన్నాను, నీ సమాధానం కోసం ఎదురుచూస్తున్నాను, నీ కోసం ఎదురుచూస్తున్నాను. నీకు ఈ ఉత్తరం అందుతుందని నమ్ముతూ..