Contributed By Sai Ram Nedunuri
ప్రసాద్ ఐమాక్స్ లో అర్థరాత్రి పన్నెండింటి ఆట అయిపోయే టైం అయిందనుకుంటా.. శనివారం అవడం వలన రోజు కంటే ఎన్.టి.ఆర్ పార్క్ దారిలో జనాలు ఎక్కువ మంది కనిపిస్తున్నారు.. బండి మీద వెళ్తున్నా సరే వేసుకున్న పోలీస్ చొక్కా మందం వలన ఎప్పుడూ ఉబ్బరిస్తూనే ఉంటుంది.. చొక్కా పైన గుండి తీసి.. చల్ల గాలిని ఆస్వాదించడానికి బండి ని ఎన్.టి.ఆర్ పార్క్ గేట్ ముందు ఆపాను.. ఘర్షణ సినిమా లో వెంకటేష్ ని చూసి, దూకుడు సినిమా లో మహేష్ బాబు ని చూసి పోలీస్ అంటే ఇలా ఉండాలి అనుకుంటూ చేసేది హోం గార్డ్ ఉద్యోగం అయినా సరే.. కళ్ళకి రేబాన్ గ్లాసులు కొన్నాను.. నడపడానికి Royal En-field బండి కొందామనుకుంటే.. మా నాన్న నేను చేస్తున్నది DSP ఉద్యోగం కాదని గుర్తుచేసి ప్రభుత్వం ఇచ్చిన hero Honda passion బండి మీదనే నేను Hero లాగా కనిపిస్తానని సర్దిచెప్పాడు.. ఎలాగో అదృష్టం వలన ఆరడుగులు ఉంటాను కాబట్టి.. ఆరు అడుగుల వెడల్పు ఉన్న Royal En-field లేకపోయినా పర్లేదులే అనుకుని సర్దుకున్నాను..
ఎన్.టి.ఆర్ పార్క్ గేట్ ముందు బండి ఆపి రోజు లాగే జేబులో ఉన్న bubble gum తీసి నోట్లో వేసుకున్నాను.. సినిమాలో చూడడానికి బావున్నా, నలుగురికి మంచి చేసే పోలీసోడికి చెడ్డ అలవాట్లు ఉండకూడదని Cigarette అలవాటు మానేసాను.. రోడ్డు కి అవతల వైపు Ice Cream బండి దగ్గర మాత్రం బాగా సందడిగా ఉంది. పక్కనే ఒక ఫ్యామిలీ Car ఆపుకుని ఉన్నారు. అందులోనుంచి దిగిన చిన్న పిల్లాడు మారాం చేస్తున్నాడు.. రోడ్డు మధ్యలో నుంచి టూరిస్ట్ బస్ లు, సినిమా కి వచ్చిన జనాల కార్లు ఎక్కువ వెళ్తుండడంతో అటువైపు వాళ్ళు ఎం మాట్లాడుతున్నారో అస్సలు వినిపించట్లేద. పక్కనే ఒక ప్రేమ జంట అర్థరాత్రి వెన్నెలలో కూర్చుని ఉన్నారు.. ఇద్దరు అమ్మాయిలు హిందీ లో మాట్లాడుకుంటూ Ice cream తింటున్నారు. ఇంతలో నెక్లస్ రోడ్డు నుంచి బండి మీద ఒకడు చాలా వేగంగా వస్తున్నాడు.. ఈ టైంలో ఇది రోజు ఉండెదేలే అనుకుంటూ ఉండగా.. అమ్మ నుంచి ఫోన్ వచ్చింది..
"ఇంటికి వచ్చేటప్పటికి ఎంత టైం అవుతుంది.. అన్నం తిన్నావా..?" రోడ్డుకి అవతల వైపు బండి మీద వచ్చిన వాడు.. ఆ అమ్మాయిల పక్కన బండి ఆపి.. ఏదో అంటున్నాడు.. అమ్మ ఫోన్ లో.. "పోలీస్ అనే ధైర్యంలో ఎవరితోనూ గొడవ పెట్టుకోవద్దు అర్థరాత్రి పూట.. అర్థమైందా..? నాన్నగారు కూడా తొందరగా వచ్చేయమంటున్నారు ఇంటికి.." రోడ్డుకి అవతల వైపు ఆ ఇద్దరు అమ్మాయిలలో ఒక అమ్మాయి, బండి మీద ఉన్నవాడిని కొట్టబోయింది.. వాడు ఆ అమ్మాయి చేయిని పట్టుకుని.. చున్నీ లాగడానికి ప్రయత్నిస్తున్నాడు.. "అమ్మ.. నేను తర్వాత ఫోన్ చేస్తా.. నువ్వు ఫోన్ పెట్టేయి.." అని ఫోన్ పెట్టేసి.. అవతలి వైపుకు వెళ్ళడానికి ప్రయత్నించాను.. కానీ మధ్యలో బస్ లు అడ్డం వస్తున్నాయి.. అవతలి వైపు ఎం జరుగుతోందో కూడా సరిగ్గా కనిపించట్లేదు.. "ఎన్ని చట్టాలు వచ్చినా మారారు ఈ వెధవలు అని అనుకుంటూ.. రోడ్డు దాటడానికి ప్రయత్నించి. మొత్తానికి అవతలి వైపుకి చేరుకున్నాను.. నేను వెళ్ళేటప్పటికి ఆ బండి మీద ఉన్నవాడు రోడ్డు మీద పడి ఉన్నాడు.. ఎవరు కొట్టారా అని చుట్టూరా చూసాను.. "థాంక్ యూ భయ్యా.." అని ఆ అమ్మాయిలు Ice Cream అమ్మే అబ్బాయికి చెప్తున్నారు.. "ఏ లోగ్ ఐసే ఈచ్ సుంతే మేడం.. కీత్నే భీ కేస్ బనాదో.. ఏ లోగ్ నహి సుధర్తే.. ఇన్ లోగో కో సబక్ సిఖానే కె లియే పోలీస్-వోలిస్ జరూరత్ నహి హై మేడం.. బస్ హమారే హాత్ బస్ హై.." అని అన్నాడు. ఆ తర్వాత ఆ అమ్మాయిలని జాగ్రత్తగా క్యాబ్ ఎక్కించి.. వాడి నంబర్ రాసుకుని.. డ్రైవర్ తాగి లేడని సరిచూసుకుని.. పంపించేశాను..
Ice Cream అతను అన్న మాటలు నా మెదడులో తిరుగుతూ ఉన్నాయి.. నిజమే కదా.. అమ్మాయిలని కాపాడడానికి పోలీస్ రావక్కర్లేదు.. వాళ్ళని కాపాడాలనే మంచితనం మనలో ఉంటే చాలు.. కాపాడే బలం మనకు లేకపోయినా ఏదో ఒక దారిలో కాపాడగలం కదా.. ఆ మాటకొస్తే అమ్మాయిలనే కాదు.. ఎదుటి వ్యక్తి ఆపదలో ఉన్నప్పుడు కాపాడాలనే ఆలోచన ఉంటే చాలు.. ఆచరించడానికి ఏదో ఒక మార్గం దొరుకుతుంది..
అతనికి ఎందుకో సెల్యూట్ చేద్దామనుకున్నాను.. కానీ షేక్ హ్యాండ్ ఇచ్చి.. ఇంటికి ఫోన్ చేసి.. "అమ్మ.. నేను ఇంటికి వస్తున్నా.. నాకిష్టమైన ఆలుగడ్డ ఫ్రై చేశావు కదా" అని అడిగి ఇంటికి బయల్దేరా..