Contributed By Gireesh Raman
FATHER SERIOUS START IMMEDIATELY ఉత్తరం నుంచి ఓ ఉత్తరం వొచ్చింది. అప్పటికి ఇంకా నైరుతి నిద్ర లేవలేదు, తూర్పు తీరుపై ఇవ్వనే లేదు, ఆగ్నేయం అగ్గి ముట్టనేలేదు, వాయువ్యం వాయువు .. పశ్చిమ పచ్చికలను పిలువనేలేదు, ఈ సైన్యం మళ్ళి నెత్తుటి మడుగులో తడిచిందా ! దక్షిణం నుండి మరో దేశ దక్షణమా ?
కొన్ని ఉత్తరాలు ఉద్వేగాలు, కొన్ని అక్షరాలు ఉద్రిక్తమైన భావోద్వేగాలు. ఆ పల్చటి కాగితం ముక్క నా గొంతు కోసింది, గొంతుక నుండి మొదలుకొని అరికాలి వరకు నెత్తుటితో తడిపేసింది. మా ఊరి నుండి హిమాలయాల దాక, దారి పొడుగున రక్తపు ధారాలే. నేను బయటకి బాగానే వున్నాను, బలంగానే నిలబడ్డాను , కానీ లోపల నేలకు పడ్డాను. కోలుకున్నట్లు వున్నా, లోన కుప్పకూలిపోయాను. మేడిపండైపోయాను.
కొన్ని సందర్భాల్లో అంతేనేమో, శరీరం లో ప్రతి కణం స్పర్శ తెలుస్తది, రక్తం పోటెక్కుతది, అరచెయ్యి కన్నీళ్లు పెడుతుంది, పిడికెడంత గుండె - నిమిషానికి తొమ్మిది పదులు పిడుగులా పేలుతాది. బొటనవేలు గోరులో సూన్యం కనిపిస్తాది, కన్నీటిలో ఊగుతున్న ప్రపంచం చిటికెనవేలు గోరంత అనిపిస్తాది.
మా నాన్న ఎడమ భుజంపై నేను కూర్చున్నాను, కుడి భుజంపై తారలు సేదతీరాయి. ఆయన మెలితిప్పిన మీసం ఓ తల్వార్, ఆయన ఎద షాలిమార్. ఆయన టోపి పెట్టుకున్న తుపాకీ, క్షవరం చేయించుకున్న సింహం. మా నాన్న ఓ పెను తుఫాను, భారత జవాను.
నిన్న రాత్రి క్యాంపు లో జరిగిన పేలుడికి వోచిన ప్రకంపనలకు మా ఇంటి గోడకు ఉన్న దేవుడి పటాలు రాలిపోయాయి, కొత్త దేవుడికి స్థానం ఇచ్చాయి. ఆ ఉదయం ఓ పేరంటంలో మా అమ్మ ముత్తైదువు ఆ పూట ఆమె కట్టిన రాణీ రంగు పట్టుచీర, ఉతుకు తరువాత దండెం నుండి బొట్టు బొట్టుగా రంగు వదులుతుంది. ఆ చీర నుండి రాలుతున్న రంగు నీళ్ళని మట్టి తీసుకుంది. ఆ రేతిరికి ఈదురు గాలులు మొదలయ్యాయి, ఇక ఆకాశవాణి కట్టేసి, తలుపులకి గొళ్ళెం వేసి, కొవ్వొత్తి వెలుగులో అక్క అమ్మ నవారు మంచం అల్లుతుంటే, చూస్తూ నిద్రలోకి వెళ్ళాను. మధ్య రేతిరి ఇంటి ముందు సప్పుడైంది, ఆ సమయం లో ఉరుములు మెరుపులు తప్ప ఎవరు రారు. కానీ ఓ టెలిగ్రామ్ వొచ్చింది.
నేను క్యాంపుకు చేరుకున్నాను అక్కడ ఓ శిఖరం నుండి కిందికి చూసాను, ఆ ఎత్తైన దేవదారు వృక్షాలు నాకు ఏదో చెప్తున్నాయి, వాటిని దాటాక, మంచు కప్పేసిన ఆ ప్రదేశం మధ్యలో, ఓ బులుగు రంగు వైద్య శిబిరం వుంది గాయ పడిన వారికి అందులో వైద్యం చేస్తున్నారు. కొంచం దిగువున యుద్ధం ముగిసాక చప్పుడు చెయ్యకుండా పడి వున్నా రణరంగం వుంది, రక్తంతో తడిచివుంది. తెల్లని మంచు ఆ నెత్తురు త్రాగి, ఎర్రగా మారింది. ఎన్నో దేహాలు చెల్లాచెదురుగా పడివున్నాయి. ఆ దృశ్యానికి, నా నెత్తిలో నెత్తురు నురుజెక్కింది.
ఒక ఆయనెవరొచ్చి కిందకి తీసుకెళ్లాడు. ఆ యెర్రని చోటు దెగ్గరికి తీసుకుపోయి, ఏంటో ఇబ్బందిగా ఒక మాట అన్నాడు - " వీటిలో మీ నాన్నగారి శేవమేదో గురుతుపట్టాలి " ఆ నిమిషమే నేను చచ్చిపోయాను. మోకాళ్ళ మీదకి పడిపోయాను. రక్తంలో ముద్దైన ఆ మంచుని గట్టిగ నా చేతిలో నొక్కాను, అది నెత్తురు కక్కింది.
నా మోర ఎవరికి చెప్పను? ముక్కలైన శవలకా???? ఆడ విరిగి పడున్న చేతులకా? మరకలు పూసుకున్న చొక్కాలకా? మసి పూసుకొని చలనం లేకుండా పడున్న మొఖాలకా? ఇంకా తడిగా వున్నా గాయాలకా? కాలుతున్న బూట్లకా? చల్లారిపోయింది బుడిదకా? నెలకి రాలున్న నక్షత్రాలకా? నాలా ఏడుస్తున్న ఇంకొకడికా?
ఆ గుంపులో అంత వెతికాను, ఎక్కడ నాన్న ఆచూకీ లేదు. అలా నడుస్తూ ఉండగా, నా కాలికి ఏదో తగిలింది. మంచులో కప్పుకుపోయింది, తొక్కిసలాటలో కూరుకుపోయింది. చేతులతో తడిమి చూసాను, అదొక చెయ్యి, విరిగి పడున్న చెయ్యి. తుడిచి చూసాను, ఆ చేతి వెళికున్న బంగారపు ఉంగరం మెరుస్తుంది, దాని మీద మా అమ్మ పేరు రాసుంది.
చాలా సేపు నిశబ్ధంగా పడున్న, నా పెదవులు అదురుతున్నాయి, చెవులు వాటంతట ఆవే కదులుతున్నవి. ఒక యుద్ధం చేసే శబ్దం తాలూకు పరిణామం, నిశ్శబ్దం! ఓ తండ్రి లేని కొడుకు జీవితం! నాన్న లేని జీవితం, నేను లేని శరీరం.
చిన్నప్పుడు, ఆయన నా చెయ్యి పట్టుకొని నడిపించాడు. ఇప్పుడు ఆయన చెయ్యి పట్టుకొని నేను వెన్నకి నడుస్తున్నాను. నా సంతకం అడిగారు, ఏదో రాసాను, నా సంతకం కాదస్సలు అది, రాసేప్పుడు చెయ్యి వణుకుతూనే ఉందే.
నేను ఇప్పుడు ఇంటికెలా వెళ్ళను? అమ్మ కి ఏమని చెప్పను? అక్కని ఎలా ఓదార్చాలి? అస్సలు నేనేమైపోవాలి?
ఆ యెర్ర బారిన భూమి నుండి, నొప్పులతో ఆరుస్తున్న వైద్య శిబిరం నుండి, నా అడుగులను సేకరిస్తున్న మంచు పొరల నుండి, నిఠారుగా నిల్చొని మౌనం పాటిస్తున్న దేవదారు వృక్షాల నుంచి, బయటకి వస్తూ, శిఖరం నుండి వెనుకకు తిరిగి కిందకి చూసాను, నాకా దృశ్యం జాతీయ జెండాలా కనిపించింది !