వంశి పరమేశ్వరిల కులాలు వేరని ఇరు కుటుంబాలు పెళ్ళికి వద్దన్నాయి.. ఐతే ఏం! మా ఇద్దరి పెళ్ళికి ప్రేమనే సాక్ష్యం, ప్రేమనే పెద్ద దిక్కు, అంటూ ప్రేమ చేసిన పెళ్ళి ద్వారా ఒక్కటయ్యారు.. H.K Babu కాలనీ నెల్లూరులో నివాసం ఏర్పరుచుకున్నారు.. పెళ్ళి తర్వాత కొన్నాళ్ళకయినా ఇరు కుటుంబాలు కూడా ఒక్కటవుతాయి అని నమ్మినా వారికి నిరాశే మిగిలింది.. వారిద్దరి ప్రేమకు భౌతికరూపంగా ఇద్దరు ఆడపిల్లలు కలిగారు అంతా సంతోషమైన లోకం. అన్ని మనం అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది, కష్టాలు అనుభవించకుండా మనిషి పుట్టుక ఎలా పూర్తవుతుంది.. పెళ్ళి జరిగి 10సంవత్సరాల వరకు బాగానే గడిచింది మొదట వంశి చేసిన వ్యాపారం బానే కొనసాగినా ఆ తర్వాత విపరీతమైన నష్టాలు రావడంతో కుటుంబం కోసం ఆటో నడపడం మొదలుపెట్టాడు.
వంశికి ఏ చెడు అలవాట్లు లేవు . 2015 అక్టోబర్ 31లో జరిగిణిన రోడ్డు ప్రమాదంతో ఆ కుటుంబ పరిస్థితి చిన్నాభిన్నం అయ్యింది వంశి తలకు బలమైన గాయాలయ్యాయి. ఆ గాయాలతో ఇక నడవలేని స్థితికి వచ్చేశాడు.. బందువులు కాదు కదా తల్లిదండ్రులు సైతం పలుకరించని ఆ కుటుంబానికి అన్నీ తానై ఉన్న వంశి రోడ్డు ప్రమాదంతో బతికున్న శవంగా మిగిలాడు .. తనకున్న చిన్నచితక ఆస్థులన్నీ అమ్మి వంశికి ట్రీట్మెంట్ కొనసాగించినా ఆశించినంత ఫలితం లేదు ఆకరికి వంశి ఎంతో ప్రేమగా కట్టిన తాళిని అమ్మి ట్రీట్మెంట్ అందించింది ఐనా ఏ కొంత మార్పూ లేదు. ఇక అప్పటి నుండి పరమేశ్వరికి వంశి చంటి బిడ్డ అయ్యాడు.. వంశికి జీవితంలో రెండో అమ్మగా పరమేశ్వరి సేవలు చేస్తుంది..ఇంత జరిగిన వంశి కుటుంబం కాని పరమేశ్వరి కుటుంబం వారు కాని ఏ ఒక్కరు కూడా ఈ కుటుంబాన్ని కనీసం పలుకరించడానికి కూడా రాలేదు. ఎప్పుడు ఇంటి పట్టునుండె ఆ ఇల్లాలు కుటుంబాన్ని పోషించుకోడానికి ఫాక్టరీలో రోజుకు 100 రూపాయలకు కూలిగా మారి అటు ఇంటి పనులు, భర్త పిల్లల ఆలన పాలన ఇలా అన్ని పనులు చూసుకుంటూనే కూలి పనులకు వెల్తుంది..
నిన్న మొన్నటి వరకు ఇదే పరిస్థితిలో ఉన్న ఆ కుటుంబాన్ని స్థానిక ఎం.ఎల్.ఏ ఆదుకున్నారు ట్రీట్మెంట్ కు అయ్యే ఖర్చులు ఎం.ఎల్.ఏ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి(వై.ఎస్.ఆర్.సి.పి) ఆర్ధిక సహాయంతో వంశి ఆరోగ్యం కుదుటపడబోతుంది తిరిగి మునపటిలా నడవబోతున్నాడు, ఇంకా మెరుగైనా జీవితం కొరకు లక్ష్మీ మంచు మేముసైతంకు కూడా వెళ్ళబోతుంది.. నేను(శ్రీకాంత్ కాశెట్టి) తనతొ ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు పరమేశ్వరి గారు ఒక మాట అన్నారు "నేను ఇప్పటికి తనని ఒదిలి ఒక్క గంట కూడా ఉండలేను, నాకు నా తల్లిదండ్రులు, నా కన్న పిల్లలు కన్నా నా భర్తే ఎక్కువ నా ప్రాణం వంశి, ఒక వేళ నాకు ఈ పరిస్థితి వచ్చినా వంశి కూడా ఇలానే సేవ చేస్తాడు" ఈ ఒక్క మాటతో నా కళ్లలో నీళ్ళు వచ్చాయి.. నిజంగా పరమేశ్వరి భార్యగా దొరకడం వంశి అదృష్టం..