Contributed by తరణి తెంపల్లె
The aim of art is to represent not the outward appearance of things, but their inward significance. - Aristotle
వ్యాపారధోరణులు ఎక్కువని కొంతమంది వాదించినా, సినిమా అనేది ఒక గొప్ప కళారూపమే. వాణిజ్య విలువలతో కూడిన వినోదాత్మక చిత్రాలు (commercial movies) వేరు, ఆలోచింపజేసే కళాత్మక చిత్రాలు (art films) వేరు అనే అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తపరుస్తూ ఉంటారు. కానీ ఆ రెండింటి మధ్యా వ్యత్యాసాన్ని తగ్గించే 'చిత్ర'కారులు కూడా అరుదుగా కనిపిస్తూ ఉంటారు. తెరపై ఎన్నో కళాఖండాలను ఆవిష్కరించి, కొన్ని తరాలపాటు గుర్తుండిపోయే చిత్రాలను మనకందించిన మణిరత్నం అలాంటి 'చిత్ర'కారుల్లో అతి ముఖ్యుడని నా అభిప్రాయం. చాలా ఏళ్ళ తరువాత 'దళపతి' సినిమా మళ్ళీ చూశాక, ఆ సినిమాలో అతి ముఖ్యమైన సందర్భంలో వచ్చే 'ఆడ జన్మకు ఎన్ని శోకాలో..' పాట చూశాక మణిరత్నంగారి గొప్పతనం కళ్ళకు కట్టినట్టు కనిపించింది. ఆ పాటలో నేను గమనించిన కొన్ని విషయాలను మీతో పంచుకోవడం కోసమే ఈ వ్యాసం. (Spoiler alert: చిత్ర కథకు సంబంధించిన కొన్ని కీలక అంశాలు ఈ వ్యాసంలో ప్రస్తావించడం జరిగింది)
'దళపతి' సినిమా నేపథ్యం:
మహాభారతంలో కర్ణుడి ఇతివృత్తాన్ని తీసుకుని, దానికొక విభిన్న రూపం కల్పించి తీసిన చిత్రం దళపతి. కర్ణుడే కథానాయకుడనే దృక్కోణంలో సినిమా ముందుకు సాగుతుంది. ఒక అనాధగా పెరిగిన 'సూర్య' (రజనీకాంత్), దుర్యోధనుడిలాంటి 'దేవరాజు'తో (మమ్ముట్టి) ఎందుకు చేతులు కలపవలసివచ్చింది? చట్టరీత్యా 'నేరం'గా చెలామణి అవుతున్న వారి చర్యలు, న్యాయపరంగా మంచివా, చెడ్డవా? అనే ప్రశ్నలు సినిమాలోని వివిధ సందర్భాల్లో మనలో ఆలోచనలు రేకెత్తిస్తాయి.
'ఆడ జన్మకు..' పాట నేపథ్యం:
దేవరాజు చేసే పనులు శిక్షార్హం అని భావించే కలెక్టర్ 'అర్జున్' (అరవింద్ స్వామి) సూర్యకి శత్రువు అవుతాడు. ఆ శత్రువు తల్లే తన తల్లి అని సూర్య తెలుసుకోవడం చిత్రంలో ఒక కీలక సన్నివేశం. ఆ సన్నివేశం రజనీకాంత్ నటనాశక్తికి అతిగొప్ప ఉదాహరణ.
ఈ సన్నివేశం తరువాత వచ్చే పాటే 'ఆడ జన్మకు..'
ఈ పాట చిత్రీకరించిన విధానం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. వెతికితే ప్రతి ఫ్రేములోనూ ఒక లోతైన అర్థం కనిపిస్తుంది. మణిరత్నం దర్శకత్వ ప్రతిభకు తోడు ఇళయరాజా కూర్చిన అద్భుతమైన సంగీతం, సంతోష్ శివన్ కెమెరా నైపుణ్యం కలిసి ఒక దృశ్యకావ్యమే తెరపై ఆవిష్కృతం అయ్యింది. ఆ పాట చిత్రీకరించిన విధానం చూసినపుడు నా మదిలో కొన్ని ప్రశ్నలు మెదిలాయి:
1. ఈ పాటను చిత్రీకరించడానికి గుడినే ఎందుకు ఎంచుకోవలసివచ్చింది? 2. పాట సాగుతున్నంతసేపూ ముఖ్యనటులు కనిపించే సమయంలో కెమెరా ముందు జనం అడ్డుపడుతూ ముందుకు సాగుతూ ఉన్నారు ఎందుకు? 3. దేవాలయం పక్కన కోనేరు దగ్గర నుండి పాట మొదలయి దేవాలయం లోపల ముగుస్తుంది. ఎందుకు? ఈ ప్రశ్నల ఆధారంగా పాటని 2-3 సార్లు శ్రద్ధగా గమనిస్తే నేను గుర్తించిన కొన్ని అంశాలపై క్రింది విశ్లేషణ.
విశ్లేషణ:
1. దృశ్యం: అర్జున్ తల్లే తన తల్లి అని తెలుసుకున్నాక ఆవిడని చూడడానికి గుడికి వస్తాడు సూర్య. కోనేరు దగ్గర ఉన్న ఆవిడని పైనుంచి కిందకు చూస్తాడు. ఆవిడ గుడివైపు మెట్లు ఎక్కుతూ పైకి వస్తారు.


భావం: తన తల్లికి తనంటే ఇష్టంలేక కాలువలో విసిరిపారేసింది అని అప్పటిదాకా అనుకుంటాడు సూర్య. అందువల్ల అతని మనసులో ఆవిడ స్థానం చాలా కిందిస్థాయిలో ఉంటుంది. కాళ్లు కడుక్కోడానికి, పాపాలు కడుక్కోడానికీ ఉన్న కోనేరు, అపవిత్రతను దూరం చేసేందుకు చిహ్నంగా భావించవచ్చు. ఆవిడ అటునుండి మెట్లు ఎక్కి పైకి రావడం, సూర్య మనసులో నిజం తెలుసుకున్నాక ఆవిడపై మెల్లిగా పెరుగుతున్న గౌరవభావానికి ప్రతీకగా చూడవచ్చు. అయినప్పటికీ అతని కళ్ళల్లో అయిష్టత ఇంకా గోచరిస్తూనే ఉంటుంది.
2. దృశ్యం: సూర్య ప్రదక్షిణలు చేస్తున్న తన తల్లిని ఆవిడకి తెలియకుండా గమనిస్తూ ఉంటాడు. అలా గమనిస్తున్నంతసేపూ జనాలు వారిద్దరి మధ్య నుంచి సాగిపోతూ ఉంటారు.


భావం: తన తల్లిని చూసే సమయంలో నిరంతరం సాగిపోతూ ఉన్న జనం, సూర్య మనసులో ఉన్న అలజడికి ప్రతీక. అతడి మనసులో ఆవిడ స్వభావం గురించి సాగుతున్న సంఘర్షణని చూపించడానికి కెమెరా ముందు నుంచి జనాలు నడుస్తూ కలిగిస్తున్న ఆటంకాలు (visual disturbances) ఒక చిహ్నం. పాట సాగుతున్న కొద్దీ క్రమక్రమంగా ఆ ఆటంకాలు తగ్గుతూ ఉండడం గమనించవచ్చు.
3. దృశ్యం: తన తల్లిని దగ్గరనుండీ చూస్తాడు సూర్య. నిజం ఇంకా తెలియని ఆవిడ సూర్యని దాటుకుని గుడిలోకి ప్రవేశించేందుకు ముందుకు నడుస్తూ ఉంటుంది.


భావం: సూర్య మనసులో సంఘర్షణలు కొద్దికొద్దిగా తగ్గి ఆవిడపట్ల గౌరవం పెరుగుతూ ఉంటుంది. పవిత్రతకు చిహ్నమైన గుడిలో ప్రవేశించడం, ఆవిడని సూర్య ఉన్నతురాలుగా భావిస్తున్నాడు అన్నదానికి ప్రతీక. అతడి మోహంలో అంతకుముందు కనిపించిన అయిష్టత అంతా పోయి ఆరాధనాభావం కలగడం గమనించవచ్చు.
4. దృశ్యం: దేవుడికి దండం పెడుతూ బాధతో కన్నీరు కారుస్తున్న తన తల్లిని చూసి సూర్య భావోద్వేగానికి లోనవుతాడు. ఆవిడ వెళిపోయాక గుడిలోకి ప్రవేశిస్తాడు.


భావం: సినిమాలో అంతకుముందు ఒక సన్నివేశంలో దేవుడికి దండంపెట్టుకోడానికి నిరాకరిస్తాడు సూర్య. అతడు పెరిగిన వాతావరణం కారణంగా, అతడి మనసులో నాటుకుపోయిన నమ్మకాల కారణంగా ఎప్పుడూ దూకుడు స్వభావం కలిగి ఉంటాడు. కానీ నిజాలు తెలుసుకున్న తరువాత అతడి తల్లి పడ్డ ఆవేదనను తెలుసుకుని చలించిపోతాడు. ఆవిడ కన్నీళ్లు చూసి భావోద్వేగానికి లోనవ్వడం, ఆ తరువాత గుడిలోకి ప్రవేశించడంతో తన తల్లి స్థానంలో ఆవిడని పూర్తిగా అంగీకరించినట్లుగా భావించవచ్చు. అతడి మనసులో సంఘర్షణ ముగిసినట్టే ఇక కళ్ళముందు ఆవిడ తప్ప జనాలు ఎవ్వరూ ఆటంకం కలిగించరు.

వెళ్లిపోయేముందు తన తల్లి తలలోనుండి రాలిన ఒక చిన్న పువ్వుని చేతిలో తీసుకుని భక్తిభావంతో మోకాళ్లపై కూర్చుని, ఆమెను దైవంగా భావించడంతో పాట ముగుస్తుంది.
ఈ పాట చిత్రీకరణ కోసం సాంకేతికవర్గం ఎంత కృషి చేశారో, తమ నటనాకౌశలంతో అంతకు సంపూర్ణ న్యాయం చేశారు నటీనటులు రజనీకాంత్ గారు, శ్రీవిద్య గారు. సినీచరిత్రలో నిలిచిపోయే ఒక దృశ్యకావ్యాన్ని మనకందించారు.