ఆకలి, ఆత్మాభిమానం. ఒకటి ఉంటే మనిషి బ్రతకడు, ఇంకొకటి లేకపోతే మనిషి బ్రతకలేడు. రెండూ మనిషిని చిన్నాభిన్నం చేసేస్తాయి. వాటి మధ్య నలిగి, తన కలలని, కళలని దూరం చేసుకోవాల్సిన పరిస్థితి కూడా దాపరిస్తుంది మనిషికి. తిండి దొరక్కా ఆకలి, తిండి దొరికినా ఆత్మాభిమానం తో చేసుకునే పని దొరక్కా ఆకలి. అటు ఆత్మ కి వంచన చేయలేక, ఇటు పస్తులుండీ చావలేక మనిషి ఒకానొక దశ లో ఎన్నో దారులున్నా, దారి లేక......దిక్కులున్నా దిక్కులేని వాడు అయిపోతాడు. అటువంటి ఒక బాటసారి కథే ఆకలిరాజ్యం అని మనకందరికీ తెలుసు.

ఐతే ఆకలిరాజ్యం ఏం నేర్పింది ? ఒకవేళ దేశం లో నేడున్న పరిస్థితులలో కనుక ఆకలిరాజ్యం విడుదల ఐతే ? ఒక్క మాట లో చెప్పాలంటే ఆకలిరాజ్యం ఒక అంతం లేని కథ ...... శ్రీ శ్రీ వ్రాసిన మహా ప్రస్థానం ఎన్ని సార్లు చదివినా ఎలా పూర్తిచెయ్యాలేమో, ఆకలిరాజ్యం కథ కి కూడా అంతు ఉండదు. విడుదల (1981 లో ) అయ్యి 38 సంవత్సరాలు వస్తున్నా, ఈ కథ ఏ యుగం లో, ఏ సందర్భం లో, ఏ సంవత్సరం లో వచ్చినా అంతే impact ని ఇచ్చేదేమో !! ఎందుకంటే మనిషి మనుగడ కి ముఖ్య కారణాలు ఆకలి, ఆత్మాభిమానం. ఈరోజు సమాజానికి ఉద్యోగం అనేది ఒక minimum qualification మనిషిని అంచనా వెయ్యడానికి. 2019 వచ్చినా కూడా మనిషి లో మార్పు లేదు , సమాజం లో అంతకన్నా లేదు. 2020 లో దేశాన్ని ఎంతో ఊహించుకున్నాం. కానీ ఒక్క పరిస్థితి కూడా మారలేదు.

నిరుద్యోగం( Unemployment ).... ఈరోజు దేశం లో గత రెండు నెలలుగా పేపర్ లో ఒక వార్త కనిపిస్తుంటుంది. నలభై దశాబ్దాలు (40 years) లో ఎన్నడూ లేని నిరుద్యోగం నేడు భారతదేశం లో ఉంది అని ! వారిలో....... పని చేద్దాం అన్నా ఏ పనీ దొరకని వాళ్ళున్నారు, ఏ పనీ చెయ్యడం ఇష్టంలేని వాళ్లున్నారూ, వాళ్ళకి నచ్చిన పని దొరక్కా వేచిచూసే వాళ్ళూ ఉన్నారు. నోరు ఎత్తితే "ఉద్యోగం పురుష లక్షణం" అని వేదమే చెప్పిందోయ్ అని patriarchal ధోరణి వాళ్ళూ ఉన్నారు. ఒక విద్యార్ధి దశ ఎంత అందం గా ఉంటుందో, అది అయిపోయాక వచ్చే నిరుద్యోగ దశ అంత అంధకారం గా ఉంటుంది, మారుతుంది. మనిషిలో కళా పోషణ లాంటివి ఎప్పుడో అడుగంటిపోయాయి. డబ్బు ..... పరువు...... ఆనందం మాత్రమే తాండవం చేస్తున్నాయి. 2019 వచ్చింది అని బిగ్గరగా అరిచినా ఏ మాత్రం లాభం లేదు.

కానీ మిగిలిన వాళ్ళందరూ ఇష్టంతోనే వివిధ jobs చేస్తున్నారా అంటే ఒక్కరూ సమాధానం ఇవ్వరు. ఆకలిరాజ్యం ..... ఈ పేరు సినిమాకన్నా దేశానికే సరిపోతుందేమో (రాజ్యమంటే kingdom అని అర్థం కదా!). ఒకరికి job లో కొలువు (position) మీద ఆకలి, మరొకరికి డబ్బు మీద ఆకలి. ఒకరికి సమాజం లో పరువు మీద ఆకలి. ఒకరికి అందం మీద ఆకలి, మరొకరికి ఉద్యోగం వస్తే స్వేచ్ఛ వస్తుందన్న ఆకలి. చంద్రమండలం మీదకి, రోదసి లోకి వెళ్లే సన్నాహాలు చేస్తున్న మనిషి ఒకవైపు, దేశం లో పోగవుతున్న పేదరికం ఒకవైపు, డబ్బు వైపు, ఆనందాల వైపు పరిగెత్తే మనిషి ఒక వైపు. పాలపుంత (Milky Way Galaxy) lo కనిపించలేనంత భూమి లో ఉన్న మనిషికి ఎందుకింత ఆకర్షణ ?

"ఆకలి ఊదే నాదస్వరానికి ఆడకతప్పదు మనిషి" అని అంటాడు రంగా (ఈ సినిమాలో కమలహాసన్) అనే ఒక సాధారణమైన మనిషి. నిజమే ! మనమందరం ఒక్కొక్కరూ ఒక్కో రకమైన ఆకలి తో రకరకాల నాదస్వరాలకి నాట్యం చేస్తున్నాం. పొగరూ, జాతి, మతం, పరువు, సమాజం, డబ్బు ఇవన్నీ ఎన్ని ఉన్నా వాటికి ఎదోకరకం గా మూలం ఆకలి. (మహా ప్రస్థానం లో శ్రీశ్రీ గారు అన్నట్టు )"నేను సైతం భువన భవనపు బావుటానై పైకిలేస్తాను" అని ఎంత మందికి ఉంటుంది, ఉంది నేడు ? అలా ఉండాలన్నా నేటి సమాజం మనకి కలలు గనే పరిస్థితులనే ఇవ్వలేదు.

రంగా తో పాటూ ఉన్న ఇద్దరు మిత్రులు. ఒకడు పగటి కళలు కంటూ ఉంటాడు. మరొకడు ఎలాగైనా రోజు గడిపేయాలని చూస్తూ ఉంటాడు. కానీ వారిలో ఉన్న రంగా ఒక్కడే నిత్యాన్వేషి. ఆకలి తో, బాధతో, జీవితం ఎటు పోతుందో అని తెలియనప్పుడు, ఆనందం వచ్చినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు శ్రీశ్రీ కవితలను తనకి కనబడని సమాజం మీద ప్రయోగిస్తూ అన్వేషణ సాగిస్తూ ఉంటాడు. రంగా లానే ఎందరో నేడు ఎన్నో కలలతో కనిపించని భవిష్యత్తు వైపు తెలిసీ తెలియని దారుల్లో నడక సాగిస్తున్నారు.

అతను ఇష్టానికి, ఆశ కి తేడా తెలుసు. అందానికి, సౌందర్యానికి తేడా తెలుసు. డబ్బుకి కొలువుకి తేడా తెలుసు. కళ కి బొమ్మ కి తేడా తెలుసు. దేశభక్తి కి దేశం లో భక్తి కి తేడా తెలుసు. ఆకలికి అలుసు కి తేడా తెలుసు. అతనికి తెలియనివి నిస్ప్రుహ, భయం, మోసం, దుఃఖం మాత్రమే.


సినిమాలో మనకి రంగా లో ఇముడి ఉన్న అన్ని అంశాలూ కనిపిస్తాయి. రోజురోజుకీ నిరుద్యోగం తో అతన్ని నడిపించేది ఒక్కటే "Hope". వస్తున్నా యొస్తున్నాయ్..... జగన్నాథ రథ చక్రాలొస్తున్నాయ్ అని అతనిలో, అతని చుట్టూ ఉన్న వారిలో నిట్టూర్పు ని, విషాదాన్ని, నిస్పృహని దరిచేరనివ్వదు. "Hope" అనేది మనిషిలో ఉండాల్సిన ముఖ్యమైన అంశం, ఆయుధం కూడా.

ఈ సినిమా చివరిలో రంగా ఒక మాట అంటాడు. B.Sc Biochemistry చదివి అకౌంటెంట్ ఉద్యోగం ఎందుకు చెయ్యాలి అని. 1981 లో సినిమా వచ్చినా, ఈరోజు చుస్తే B.Tech graduates లో ఎందరో అలంటి వాళ్ళు కనిపిస్తారు మనకి. ఆకలిరాజ్యం!!.... అంతటా ఆకలిరాజ్యం!! ఈ తప్పు ఒకరిది అని వేలు ఎత్తి చూపించడానికి కూడా నేడు అవకాశం లేదు. ప్రతీ ఒక్కరూ దీనికి ఎదోరకం గా కారకులే !

ఇంటర్వ్యూ లో రంగా యొక్క పోకడ చూసి నువ్వు కమ్యూనిస్ట్ వా అని అడిగినప్పుడు, అతని మాటలే సూటిగా సమాధానం చెప్తాయి వాళ్ళకి. ఎక్కడా తలవంచడు, ఎక్కడా తనని తాను వంచించుకోడు. అలంటి రంగా లు ఎంత మంది ఉన్నారు మన దేశం లో ? దేశం లో అలాంటివాళ్ళు ఒక్కడున్నా చాలుకదా అనిపిస్తుంటుంది సినిమా చేస్తున్నంతసేపూ.

1981 లో పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకి తెలీదు కానీ, 2019 లో మాత్రం దారుణమైన స్థితి లో ఉన్నాయ్ అని మాత్రం చెప్పచ్చు. ఒక మహాప్రస్తానం పుస్తకాన్ని చదివిన తర్వాత వచ్చే అనుభవం ఎవరూ చెప్పలేరు. మనస్సు కుదిపేసినట్టు, ముక్కలుచేసినట్టు, శ్రీశ్రీ గారే ముందు కూర్చుని కొండంత ప్రేరణ ఇస్తున్నట్టు ఎలా ఉంటుందో, ఆకలిరాజ్యం తో K.Balachander గారు, ఆత్రేయ గారు అదే impact ఇస్తారు. ఇది ఎవరికీ తెలియని కథ కాదు, చూడని కథ కాదు ....... అందరం గుర్తుంచుకోవాల్సిన కథ.
శ్రీశ్రీ గారు చెప్పినట్టు, ప్రమిదలో చమురు త్రాగుతూ, చీకటి లో పలు దిక్కులు చూస్తున్న దీపం లా, నడిసముద్రపు నావ రీతిగ సంచరిస్తూ, సంచలిస్తూ దిగులు పడుతున్నవాడిలా ఎక్కడో లక్షల్లో ఒకడివై వెళ్ళిపోకు! లక్షల్లో ఒకడివి గా ! నీది, నాది అందరిదీ ఒకటే కథ. కానీ screenplay లు మారుతుంటాయి అంతే. మళ్ళీ ఒక్క మాట - ఆకలిరాజ్యం నేడు విడుదల అయ్యుంటే మరి ???
