మీకు నచ్చిన గొప్ప వ్యక్తులలో ఒకరు..? అంటే అబ్దుల్ కలాం.. మీకు నచ్చిన గొప్ప సైంటిస్ట్ ఎవరు..? అంటే అబ్దుల్ కలాం.. మీకు నచ్చే రాష్ట్రపతి ఎవరు..? అంటే అబ్దుల్ కలాం.. మీరు ఎవరి మాటల ద్వారా ఎక్కువ స్పూర్తి పొందుతారు..? అంటే అబ్దుల్ కలాం. ఎంత గొప్ప వ్యక్తులకైనా, ఎంతటి మహానుబావులకైనా ఎక్కడో ఒక చోట విమర్శకులుంటారు అది ప్రాంతాన్ని బట్టి గాని, మతాన్ని బట్టి గాని, లేదంటే అభిప్రాయాల బట్టి గాని ఉండొచ్చు కాని అబ్దుల్ కలాం గారికి లేరు అది ఆయన గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం.. మనదేశం లోనే కాదు ఈ ప్రపంచంలోనే అత్యంత గౌరవింపబడే గొప్ప వ్యక్తులలో కలాం గారు ఒకరు. మనకోసం తన సొంత సుఖాలను త్యాగం చేసుకోని ఎంతో సేవ చేసిన కలాం గారిని మనదేశ ప్రజలు ఒక "తండ్రిలా" గౌరవిస్తారు.. ప్రేమిస్తారు. కలాం గారికి తన తల్లి ఆశియమ్మ అంటే అమితమైన గౌరవం. రామేశ్వరంలోని తన ఇంటి హాల్ లో తన తల్లి ఒడిలో పడుకున్నటు వంటి ఫొటో దర్శనమిస్తుంది ఆ ప్రక్కనే తన తల్లికోసం ప్రేమతో రాసిన కావ్యం కనిపిస్తుంటుంది..
ఆ కావ్యం.. (ఒక విజేత ఆత్మ కధ పుస్తక సౌజన్యంతో)
సాగరతరంగాలు, సువర్ణ సైకతాలు, యాత్రీకుల విశ్వాసాలు, రామేశ్వరం మసీదు వీధి అన్నీ కలిసి ఒక్కటైతే మా అమ్మ!
అమ్మా! నన్ను స్వర్గవాత్సల్యంతో చేరవచ్చావు. జీవితం ఒక సవాలుగా ఒక శ్రమగా గడచిన ఆ యుద్ధకాలం మైళ్లకొద్దీ నడక, సూర్యోదయానికి ముందే లేవడం గుడి దగ్గర అయ్యవారు చెప్పిన పాఠాలు అరబ్బు పాఠశాలకు మైళ్లనడక రైల్వే స్టేషన్ రోడ్డుకి ఇసుకదారుల్లో ఎదురీత ఆ దేవాలయ వీధుల్లో వార్తా పత్రికలు సేకరించడం, పంచడం మళ్లా పాఠశాలకి సాయంకాలం, రాత్రి చదువుకి ముందు దుకాణంలో పనిపాట్లు.. ఇది బాలుని వేదన..
అమ్మా! రోజుకి ఐదుసార్లు నీ వందన నమస్కారాలు సర్వేశ్వరుని కృపావీక్షణాలతో జీవితం పవిత్రంగా బలపర్చావు. ఆ పవిత్రతే నీ పిల్లలకు శ్రీరామ రక్ష. నువ్వెప్పుడూ నీకున్న దాంట్లో మంచిదేదో ఎవరికి ఏది అవసరమో చూసి ఇచ్చావు. నీకు ఇవ్వడమే తెలుసు, ఇస్తూనే ఉంటావు..
నా పదేళ్లప్పటి ఆ రోజు.. నాకింకా గుర్తే.. నన్ను నీ వళ్లో పడుకోబెట్టుకున్నావు. నా అన్నలూ, చెల్లళ్లూ ఉడుక్కుంటున్నారు. నిండు పున్నమి రాత్రి, అప్పుడు నాకు తెలిసిందల్లా నువ్వే అమ్మా, నా అమ్మా.. అర్ధరాత్రి నేను కన్నీళ్లతో ఉలిక్కిపడి లేచాను. నీకు నీ బిడ్డ బాధ తెలుసు నీ లాలించే చేతుల ద్వారా మృదువుగా తొలుగుతున్న బాధ నీ ప్రేమ, నీ లాలన, నీ నమ్మకం నాకు బలాన్నిచ్చేయి. ప్రపంచాన్ని నిర్భయంగా ఎదుర్కోవడం నేర్పాయి. సర్వేశ్వరుని శక్తిని నిలిపాయి.
అమ్మా, అంతిమ తీర్పు రోజున మనం కలుస్తాం కదా మరలా.. -అబ్దుల్ కలాం