మునీర అనే 12ఏళ్ళ పాప పాతబస్తీలో నివాసముంటుంది. ఎంత వద్దని బ్రతిమలాడిన 60సంవత్సరాల ఒక దున్నపోతు లాంటి అరబ్ షేక్ కి ఇచ్చి తల్లిదండ్రులు పెళ్లిచేశారు. వాడు ఒక స్టార్ హోటల్ లో రెండు నెలల పాటు ఆ అమ్మాయితో గడిపి నేను వెళ్ళాక నీకు వీసా ఏర్పాట్లు చూస్తానని చెప్పి దుబాయ్ కి వెళ్ళిపోయాడు. రెండు నెలల రాక్షసత్వానికి ఆ పాప గర్భం దాల్చింది. ఇది పరిస్థితి అని ఆ షేక్ కి ఫోన్ చేసి చెప్తే "తలాక్" అని మూడుసార్లు చెప్పి ఒదిలించుకున్నాడు. ఇప్పుడు ఆ పాప తన చంటి పాపను ఎత్తుకుని ఇళ్ళల్లో పనిచేసుకుంటు బతుకుతుంది.
సైరా భానుకి పెళ్ళై15 సంవత్సరాలైంది. వారిద్దరికి ఇద్దరు పిల్లలు. ఇన్నాళ్ళ వివాహ జీవితంలో తన కంటి నీరు భూమి మీద పడని రోజు అంటు లేదు. భర్త మానసికంగా శారీరకంగా హింసించేవాడు. ప్రాణానికి ప్రమాదం అని డాక్టర్లు చెప్పినా ఎన్నో సార్లు బలవంతంగా అబర్షన్ చేయించేవాడు. తను మాత్రం "తల్లిదండ్రుల మీద ఆధారపడకూడదు, నా పిల్లల భవిషత్తు నాశనం అవుతుంది, ఇంకా భర్తలేని మహిళ అంటే సమాజంలో పరిస్థితి దారుణంగా ఉంటుంది" అని భర్త పెట్టే కష్టాలను ఓర్చుకునేది. కాని ఒకరోజు భర్త కోపంలో తలాక్ అని మూడుసార్లు పేపర్ మీద రాసి తనకు పంపించాడు. పోరాడినంత వరకు పోరాడి ఇక చేసేదేమీ లేక ఆ మహిళ భారత దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఒక్క తన జీవితంలోనే కాదు మొత్తం ముస్లిం న్యాయవ్యవస్థ లోనే "త్రిపుల్ తలాక్" దారుణమైన విధానం అని దీనిని దేశంలో నిషేదించాలని సుప్రీం కోర్టులో కన్నీటితో వేడుకుంది. ఈ సంఘటన దేశమంతా సంచలనం సృష్టిస్తుంది. సుప్రీం కోర్టు కూడా "త్రిపుల్ తలాక్" మీద ప్రజలలో విస్తృతమైన చర్చ జరగాలని సూచించింది. భారత కేంద్ర ప్రభుత్వం, ఇతర రాజకీయ పార్టీలు కూడా ఈ దుర్మార్గమైన చర్యను నిషేదించాలనే ఆలోచనలో ఉన్నాయని తెలుస్తుంది. అసలు ఈ "త్రిపుల్ తలాక్" అనేది ఎంత దారుణమో ఒకసారి మనం పరిశీలిద్దాం..
ఒకప్పుడు హిందూ సమాజంలో భర్త చనిపోతే భార్యను కూడా అదే భర్త చితిమంటలలో వేసి సజీవ దహనం చేసి 'సతీ సహగమనం' అని పేరు పెట్టారు. బాల్య వివాహలు కూడా జరిగేవి. చిన్న పిల్లలను ముసలి వారికి ఇచ్చి పెళ్ళి చేసేవారు. ఇలాంటి అనాగరికమైన విధానాలు ఏ మతంలో జరిగిన అవి ముమ్మాటికి తప్పే..! ఒక మనిషి ఏ రకంగా ఉంటాడో ఇంకో మనిషి కూడా అంతే ఉంటాడు. ముస్లింలకు ఏ శరీరం ఉంటుందో మిగిలిన మనుషులకు అంతే ఉంటుంది. భారత న్యాయ శాస్త్రంలో కూడా కులాలను, మతాలను పరిగణలోకి తీసుకోకుండా నేరాలకు శిక్షలు వేస్తుంది. మానభంగానికి అందరికి ఒకే శిక్ష, హత్య, దొంగతనాలకు భారత శిక్షస్మృతికి తగ్గట్టుగానే శిక్షలు. అంతేగాని మతాలకు తగ్గట్టుగా ఏ శిక్షలు ఉండవు. మరి ఈ పవిత్రమైన వివాహ వ్యవస్థలోనే ఎందుకు..? ఎందుకు తలాక్ అని ఒకే మాటలో విడాకులు అమలు జరుగుతున్నాయి?!
ప్రపంచంలో పాకిస్థాన్ తో సహా 22 ముస్లిం దేశాలు ఈ దుర్మార్గమైన 'తలాక్' వ్యవస్థను నిషేదించాయి. కాని ఇంకా మన దేశంలోనే ఎందుకు..? సుప్రీం కోర్టు సూచన మేరకు ఈ మధ్య ఓ స్వచ్చంద సంస్థ ముస్లిం మహిళల ద్వారా చేసిన సర్వేలో "దాదాపు 90% మహిళలు ఈ దుర్మార్గమైన వ్యవస్థను నిషేదించాలని ఓట్ చేశారు". వివాహం అనేది ఒక దైవ కార్యం అత్యంత పవిత్రమైనది. కోపంలో, అనుమానం, అపోహలతోనో వాటిని ఒకే వ్యక్తి దృష్టితో అలోచించి త్రిపుల్ తలాక్ అని ఒక్కమాట చెప్పి వివాహ బంధాన్ని తుంచడం ఒక అనాగరిక చర్య.! నమ్మి కొండంత ఆశతో, ప్రేమతో వచ్చిన మహిళను ఇలా మోసం చేయడం ఒక దారుణమైన చర్య.
Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.