గిరిజనులు అత్యంత పవిత్రంగా భక్తితో జరుపుకునే పండుగ ఈ నాగోబా జాతర. అదిలాబాద్ జిల్లా నుండి సుమారు 40కిలోమీటర్ల దూరంలోని ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్ గ్రామంలో ఈ జాతర ప్రతి సంవత్సరం రమణీయంగా జరుగుతుంది. ఈ జాతరను మేస్త్రం వంశస్తులు నిర్వహిస్తారు. ప్రతి పండుగకు ఇంకా ఒక పుణ్యక్షేత్ర ఆవిర్భావం వెనుక ఒక చారిత్రక గాధ ఉంటుంది. అలాగే ఈ జాతరకు వందల సంవత్సరాల చరిత్ర ఉంది. మేస్త్రం వంశానికి చెందిన రాణి అయిన నాగాయిమోతికి పెళ్ళి జరిగి చాలా సంవత్సరాలు దాటిన గాని సంతానం కలుగలేదు. ప్రతిరోజు నాగరాజును భక్తి శ్రద్ధలతో పూజలు చేసేవారు. ఒకరోజు ఆ రాణి కలలో నాగరాజు ప్రత్యక్షమై నీకు సంతానంగా నేనే రాబోతున్నాను అని చెప్పారట. అనుకున్నట్టుగానే కొన్ని రోజులకు ఆ రాణి గర్భం దాల్చింది. స్వప్నంలో తెలియజేసినట్టు గానే రాణికి ఆ నాగరాజే సర్పం ఆకృతిలో జన్మించారు.


కొంతకాలం గడిచాక ఆ నాగరాజుకి తన సోదరుని కూతురు గౌరితో వివాహం జరిపించింది రాణి. పెళ్ళి తర్వాత సర్పం ఆకృతిలో ఉన్న తన కొడుకు మామూలు మనిషి ఆకృతిలోకి మారుతారని భావించి వాళ్ళిద్దరిని గోదావరి నదిలో స్నానమాచరించడానికి పంపిస్తారు.. అనుకున్నట్టు గానే గోదావరిలో మునిగిన తర్వాత ఆ సర్పం మానవ రూపంలోకి మారతారు. ఆ తర్వాత ఆ వ్యక్తి శాంతంగా తన భార్య గౌరిని ఒక ప్రశ్న అడిగాడు. చనిపోయినా చిరకాలం మనకు విలువనిచ్చే "పేరు ప్రతిష్టలు కావాలా."? లేక బ్రతికున్నప్పుడు ఉపయోగపడే సాంప్రదాయాలు కావాలా.? అని.. గౌరి ఆలస్యం చేయకుండా "నాకు పేరు ప్రతిష్టలు మాత్రమే కావాలి" అని జవాబిస్తుంది. దాంతో ఆ వ్యక్తి తిరిగి పాము ఆకృతిలోకి మారిపోయి అదృశ్యమయ్యారట. కలతచెందిన గౌరి గోదావరిలోకి వెళ్ళి అందులో కలిసిపోతుంది.


ఆ తర్వాత కొన్నాళ్ళకు నాగరాజు మళ్ళి గ్రామస్తులకు ప్రత్యక్షమయ్యి "కొత్తగా వివాహం జరిగిన దంపతులను నా ఆశీర్వాదం కోసం తీసుకురండి, వారికి మంచి జరుగుతుందని చెప్పి కెస్లాపూర్ కొండల్లోకి వెళ్ళిపోయారట". అప్పుడే అక్కడొక గుడిని నిర్మించి అప్పటినుండి నాగోబా జాతరను వైభవంగా జరిపిస్తున్నారని గిరిజనుల కథనం. మేడారం జాతర తర్వాత ఆ స్థాయిలో భక్తులు దర్శించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ జాతరను ప్రభుత్వ పండుగగా ప్రకటించారు. ప్రతి సంవత్సరం పుష్యమాసం అమవాస్య రోజున ప్రారంభం అయ్యే ఈ జాతరకు తెలంగాణ నుండే కాక ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, చతీస్ ఘడ్, మధ్యప్రదేశ్ మొదలైన రాష్ట్రాల నుండి సుమారు 10లక్షల వరకు భక్తులు హాజరవుతారు.
ఇంతటి విశిష్టమైన చరిత్రగల ఈ జాతరని, అక్కడి సాంప్రదాయాలను, సంస్కృతులని ఎంతో అందంగా.. అద్భుతంగా చిత్రీకరించారు జెన్నిఫర్ అల్ఫొన్సె, రాధిక లవు మరియు వారి బృందం. ఆ వీడియోని మీరు క్రింద చూడగలరు..
Witness the vibrant religious and cultural celebrations of Telangana. This video produced by @RadhikaLavu beautifully captures the Nagoba Jatara held at Keslapur in Indervelly mandal, Adilabad district.#NagobaJatara #Gonds#TelanganaTourism #EllanarFilms pic.twitter.com/LZYuMoh1KY
— KTR (@KTRTRS) January 30, 2019