చెన్నైలో ఒక ఫుడ్ బ్యాంక్ అప్పుడే స్టార్ట్ చేశారు దాని వల్ల పేదవారికి, రోడ్డు పక్కన ఉండే ఎంతోమందికి ఆకలి తీరుతుంది. అరే ఈ ఐడియా చాలా బాగుందే.. మన హైదరాబాద్ లో కూడా ఇలాంటిది స్టార్ట్ చేస్తే బాగుంటుందని మహ్మద్ అజీజ్ తన మిత్రులతో ఆలోచనను పంచుకున్నాడు. వారు కూడా సమాజానికి ఏదైనా మంచి చేయాలని ఆశయంతో ఉన్నారు దాంతో అబ్దుల్, దిలీప్, ఇక్బాల్, సత్య కలిసి ఈ ఫుడ్ బ్యాంక్ ను స్టార్ట్ చేశారు. అక్టోబర్ 22 2015లో దీనిని ప్రారంభించినప్పుడు మొదట అజీజ్ అమ్మ గారు 34 మందికి ఆహారాన్ని ఇంట్లో వండి అందించారు. ఈ ఫుడ్ బ్యాంక్ ప్రత్యేకత ఏమిటంటే ఇందులోని చాలా మంది వాలెంటీర్స్ వారి ఇంట్లో నుండి చేసిన భోజనాన్నే అందించడానికి ఇష్టపడతారు.
అది ఎక్కడైనా, ఎప్పుడైనా కాని ఏదైనా ఒక్కడితోనే మొదలవుతుంది.. ఆ తరువాత ఒక యుద్ధంలా, మహా యజ్ఞంలా అందరి సహాయంతో విస్తరించబడుతుంది. అజీజ్(9160508054) మిత్రులు మొదట ఫుడ్ బ్యాంక్ ను స్టార్ట్ చేసినప్పుడు ఇందులో కేవలం 10లోపు వాలెంటీర్లు మాత్రమే ఉండేవారు, కాని ఇప్పుడు వారి సంఖ్య 130కి చేరుకుంది. హైదరాబాద్ లోని దాదాపు ప్రతిచోట వీరి సైనికులున్నారు. ఆదివారం వచ్చిందంటే చాలు ప్రతి వారం దాదాపు 800 మందికి పైగా వీరు భోజనాన్ని అందిస్తారు. ఇందులో కూడా ఒకసారి వీరు రికార్డ్ సృష్టించారు, ఈ సంవత్సరం మే 28 World Hunger Day నాడు హైదరాబాద్ లోని 9,000 మందికి ఒకేరోజు భోజనాన్ని అందించారు.
ఏ మతమైన మానవ సేవనే మాధవ సేవ అంటుంది అందుకు తగ్గట్టుగానే ఈ ఫుడ్ బ్యాంక్ వారు కూడా కుల, మతాలకు అతీతంగా అన్ని మతాల పండుగల రోజు నాడు ఇంకా స్వాంతంత్ర సమరయోధుల పుట్టినరోజు కూడా ఆహారాన్ని పేదలకు అందిస్తారు. మొదట ఇంటి నుండి భోజనం తీసుకొచ్చినా కూడా ఇప్పుడు హోటళ్ళలోని మిగిలిపోయిన ఆహారం వేస్ట్ కాకూడదని దానిని కూడా ఇవ్వడం మొదలుపెట్టారు. ఒక మంచిపని చేస్తే దానిని చూసి స్పూర్తి పొంది మనవంతు సహాయాన్ని అందివ్వడానికి చాలామంది ముందుకువస్తారు. ఈ ఫుడ్ బ్యాంక్ నిర్వహణ చూసి చాలామంది సహాయం చేయడానికి మనీ రూపంలో ఇద్దామని ముందుకు వచ్చినా కాని వీరు తీసుకోరు. దానికి బదులు ఫుడ్ రూపంలో ఇస్తే మాత్రమే తీసుకుంటారు.