Contributed by Sowmya Uriti
గది నిండా నిశబ్ధం. గడియారం ముళ్లు చేసే చిరు చప్పుడు స్పష్టంగా వినపడుతుంది. నడి రాత్రి కావస్తోంది. "తెల్లవారితే కష్టం పలకరిస్తుంది. రాత్రయితే ఆ కష్టాన్ని ఎల ఎదుర్కోవాలనే ఆలోచనలు పలకరిస్తాయి. దిన దిన గండంగా గడిచే ఈ జీవితం మీద విరక్తిగా ఉంది. ఇప్పటి వరకు ఎలాగోలా లాక్కొచ్చాను. ఇక నా తరం కాదు. నా కష్టాలకి ముగింపు పలకలేను నా జీవితానికి తప్ప," నిర్ణయించేసుకున్నాడు సారధి. కళ్ళు మూతలు పడ్డాయి. గుండె బరువెక్కింది. శరీరం తేలికపడింది. "ఏదో కొత్త లోకం లోకి అడుగు పెడుతున్నట్టుంది. భయంకరంగా పొగలు కక్కుతూ రక్తపు పరవళ్ళు తొక్కుతున్న నది అది. వైతరణా ఇది? అంటే నేను..." ఒక్క క్షణం ఆలోచించేలోపే ఇద్దరు యమ భటులు అతడిని నరక ద్వారము దాటించి అతడి లానే అక్కడికి చేరుకున్న కొన్ని వేల మంది వేచి ఉన్న చోట అతడిని విడిచిపెట్టి వెళ్ళారు. కొద్ది క్షణాలలో అందరిని సంసిద్ధంగా ఉండమని ఓ ప్రకటన వినిపించింది. మరి కొద్ది క్షణాలలో నరకలోకాధిపతియైన యముడు చిత్రగుప్తుని సమేతంగా విచ్చేశారు. ఆ లోకానికి చేరుకున్న ఒక్కొక్కరినీ పరిశీలించి వారి పాపపుణ్యములను తర్కించి ధర్మ నిష్పత్తి ఎక్కువున్న వారిని స్వర్గలోకపు ద్వారం వైపు దారి చుపుతున్నాడు యమధర్మరాజు. పాపపు పాళ్ళు ఎక్కువున్న వారి కొరకు శిక్షల చిట్టాలను తయారు చేస్తున్నాడు చిత్రగుప్తుడు. "నాకు తెలిసి నేను స్వర్గద్వారానికే చేరతాను నేనేం పాపాలు చేయలేదుగా..."పెద్దగా మోగిన గంట శబ్ధానికి తేరుకొని యముని ముందుకి చేరాడు అతడు. పరీక్షగా చూసి అతడి పుస్తకాన్ని పరిశీలించమని చిత్రగుప్తునికి ఆదేశించాడు యమధర్మరాజు. పరిశీలనానంతరం విషయం తన ప్రభువుకు అందజేశాడు చిత్రగుప్తుడు. వెంటనే "శిక్షార్హుడైన ఇతడిని శిక్షాస్థలానికి తరలించండి" అని ఆదేశం జారీ చేయబడింది భటులకు.
నిశ్చేష్టుడైన అతడు, "యమధర్మరాజా! నా జీవితంలో నేను పుణ్యం చేసుండకపోవచ్చు కాని పాపం మాత్రం చేయలేదు. నాకెందుకు శిక్ష? మీరు మరొక్కసారి పరిశీలించి చూడండి నేను ఎటువంటి తప్పు త్రోవలూ పట్టలేదు," యమునితో మొర పెట్టుకుంటున్నాడు. "అవును నువ్వు జీవించి ఉన్నంత కాలం ఏ పాపపు దారినా నడవలేదు కాని ఆ జీవితాన్ని అర్ధాంతరంగా అంతం చేసుకొని ఆ దారిలోకే వెళ్ళావు," అన్నాడు యముడు. "అది పాపమెలా అవుతుంది ప్రభూ! ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని, కష్టాలను ఓర్చుకొని, అన్ని పరిస్థితులకు తలొంచి అలసి సొలసి నిస్సత్తువై ఉన్న నా దేహానికి నేను ఇచ్చిన విముక్తి. నా జీవితంలో కష్టాలు కడలైతే సుఖాలు సూన్యం. కష్టపడ్డాను. ఫలితం ఆశించాను. ఆశ నెరవేరలేదు. కాలం కలిసొస్తుందని ఎదురు చూశాను. ఎదురు చూపులే మిగిలాయి. సహనం కోల్పోయాను. తనువు చాలించాను," ఆక్రందనగా అన్నాడు అతడు. "నీ తొందరపాటు వలన మరికొద్ది రోజులలో నీ చేజిక్కబోయే అదృష్టాన్ని చేజార్చుకున్నావు. నువ్వు జీవించి ఉంటే నీ భవిష్యత్తు ఎలా ఉండబోయేదో చూడు," అతడి జీవిత పుస్తకంలోని ఓ పుటను చూపించాడు యముడు. అతడు కోరుకున్న బంగారు భవిష్యత్తు అది. అతడి కష్టానికి ఫలితం అది. సంపద, సంతోషం, సంతృప్తులతో సంపూర్ణంగా ఉన్న జీవితం అది. అది చూసి అతడి కల్లల్లో ఆనందం. అది ఎంతోసేపు నిలవలేదు. పుస్తకంలో ఆ పుటను మార్చి మరో పుటను చూపించాడు యముడు. దీన వదనాలతో, దుర్భరావస్థలో, నిరాశా జీవులయ్యారు అతడి కుటుంబసభ్యులు. అతడి కల్లల్లో కన్నీరు ధారలయ్యాయి.
"నీవు వేసిన తప్పటడుగు వల్ల నీ కూడా ఉన్న వారి జీవితాలు తారుమారయ్యాయి. నీ మరణం వారి బ్రతుకులను ప్రశ్నార్ధకం చేసింది. వయసుకు మించిన భారంతో నీ పిల్లలు, శక్తికి మించిన శ్రమతో నీ భార్య, కష్టం చెప్పుకుంటే హితం చేయక హేలన చేసే సమాజంతో సహవాసం చేయలేక, ఎదుటివారి ఎత్తిపొడుపు మాటలకు ఎదురెల్లలేక మానసికంగా, ఆర్ధికంగా ఎలా కృంగిపోతున్నారో చూడు. కష్టసుఖాలలో కుటుంబసభ్యులు భాగం పంచుకోవాలి కానీ నువ్వు నీ బాధ్యత నుండి తప్పించుకొని ఆ భారం వారిపై వేసేందుకు నా యమపాశాన్ని నీ ఇంటికి ఆహ్వానించావు. నీ సమస్యకి సరైన పరిష్కారం అలోచించక ఆత్మహత్య చేసుకున్నావు. సమస్య ఎదైనా ఆత్మహత్య పరిష్కారం కాదు. సుగమ్యంగా సాగుతున్న నీ వాళ్ళ జీవితాలను అగమ్యగోచరంగా మార్చిన నీకు శిక్ష పడాల్సిందే. ఇదే నా నిర్ణయం," బిగ్గరగా చెప్పాడు యమధర్మరాజు. మారు మాట్లాడలేక యమభటుల వెంట వెళ్ళాడు అతడు. తన ఎత్తుకు మించిన అగ్ని జ్వాలలలో అతడిని నెట్టేశారు ఆ యమభటులు. ఒళ్ళంతా మండిపోతుంది. అసహనంగా ఉంది. నోట మాట రావట్లేదు. ఆ బాధని భరించలేక అటూ ఇటూ దొర్లాడు. మంచం పై నుండి కింద పడి మెలుకువ వచ్చింది అతడికి. గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఒళ్ళంతా చెమటలు. లేచి కాసేపు అలాగే కూర్చుండిపోయాడు అతడు. తన టేబుల్ పై ఉన్న స్లీపింగ్ పిల్స్ డస్ట్బిన్ లో వేశాడు. దేవుని పటం ముందు నిలబడి అనుకున్నాడు "ఎంతటి కష్టమొచ్చినా ఇకపై నేనలాంటి పని చేయ తలచను. నరకంలో విధించే శిక్షలకు భయపడి కాదు, నా వాళ్ల భవితకు భరోసానిచ్చేందుకు."