ప్రపంచ దేశాలతో పోలిస్తే ఒక్క భారతదేశంలోనే అత్యధికంగా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. భారతదేశంలో ప్రతి ఒక్క నిమిషానికి కూడా ఎదో ఒక ప్రమాదం జరిగి ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడుతున్నాడు. గడచిన 10 సంవత్సరాలలో యాక్సిడెంట్స్ వల్ల అత్యధిక మరణాలు మన తెలుగురాష్ట్రల్లోనే సంభవించాయి. సుమారు 1,37,109 మరణాలతో రెండు తెలుగురాష్ట్రాలే దేశంలో ముందువరుసలో ఉన్నాయి. ఇన్ని ప్రమాదాలు జరగడానికి ఒక కారణం నిర్లక్ష్యమైతే, మరో కారణం త్వరగా హాస్పిటల్ కు తీసుకువెళ్ళలేకపోవడం. ఇందుకోసమే భారతదేశంలో మొదటిసారి ఎయిర్ అంబులెన్స్ సర్వీసులను ప్రారంభించింది "వింగ్స్ ఏవియేషన్ సంస్థ".
మన హైదరాబాద్ ట్రాఫిక్ గురుంచి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. మెట్రో రైళ్లు తిరుగుతున్నా గాని పరిస్థితులలో ఊహించినంత మార్పు రాలేదు. అంతేకాక ట్రాఫిక్ లో అంబులెన్స్ వెళ్తున్నా గాని దానికి దారివ్వని నగరవాసులను కొంతమందిని చూస్తున్నాం. మరికొన్ని సందర్భాలలో ఐతే దారివ్వడానికి సైతం దారి ఉండదు. ఇలాంటి రకరకాల సమస్యలు అంబులెన్స్ సిబ్బందికి ఎదురవుతున్నాయి. ఎయిర్ అంబులెన్స్ కు మాత్రం ఇలాంటి ఇబ్బందులు లేవు. హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుండి ఈ హెలికాప్టర్ సేవలు 24గంటలు అందుబాటులో ఉంటాయి. ఈ ఎయిర్ అంబులెన్స్ కు కాల్ చేసిన 30 నిమిషాలకే సిబ్బంది అక్కడికి చేరుకొని గంటకు 500కిలో మీటర్ల వేగంతో(పరిస్థితిని బట్టి) హాస్పిటళ్లకు చేరుస్తుంది.
రోడ్డు ప్రమాదం, ఇతర ప్రమాదాల్లో తీవ్రంగా గాయాల పాలైన వారిని త్వరగా హాస్పిటల్ కు తీసుకువెళ్తే ప్రాణాలు కాపాడవచ్చు, ఇక్కడ ఒక్కొక్క సెకను కీలకమే. ఈ ఎయిర్ అంబులెన్స్ కోసం అగస్టా వెస్ట్ ల్యాన్డ్ 109సి ని ఉపయోగిస్తున్నారు. మామూలు 108 అంబులెన్స్ సర్వీస్ లో ఉండే అన్ని సాధుపాయాలు కూడా ఇందులో ఉంటాయి. హెలికాప్టర్ లో ఏరో మెడికల్ ట్రాన్స్ పోర్టేషన్ సర్టిఫైడ్ డాక్టర్స్ ఉంటారు. మెడికల్ కిట్, వెంటిలేటర్, మల్టీ పారామీటర్ మొదలైనవన్నీ బాధితుల కోసం అందుబాటులో ఉంటాయి.
ప్రస్తుతం ఈ సర్వీస్ గంటకు 1.60,000 లక్షలు ఉంది. ప్రాణం ముందు ఈ డబ్బు తక్కువే కావచ్చు కాని పేద మధ్య తరగతి వారికి మాత్రం ప్రాణం ముందు డబ్బే ఖరీదైనది. సత్యం రామలింగరాజు గారు మొదట108 సర్వీస్ ను ప్రారంభించినప్పుడు ప్రభుత్వం దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని నడిపిస్తుంది. కొన్ని అత్యవసర పరిస్థితులలో ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి నడిపిస్తే ఎంతో బాగుంటుంది.