Contributed By Saikumar Devendla
ప్రియమైన కవి గారికి? నమస్కారం రచయిత గారు.! గుర్తున్నానా..? ఎందుకు ఉండను.? ఉంటా ఉంటా.! ఎందుకంటే నేను లేనిది నువ్వు లేవు కదా! rubik's cube కన్నా ఘోరంగా వాడుకుంటావుగా సామి నువ్వు..!
నీకు బాధ వస్తే భావాన్ని అవుతాను, నీకు ఆనందం వస్తే పొంగి పోతాను, నీకు కన్నీళ్ళు వస్తే కర్చీఫ్ అవుతాను, నీకు కోపం వస్తే గుణపాఠం అవుతాను. ఇంతకి గుర్తొచ్చానా లేదా.?? వేలు ఎత్తుతే వరుసలో ఉంటాను. అయ్యో రామ నేనండి.. "నీ అక్షరాన్ని..!"
నన్ను చాలా మంది వాడుకొని వదిలేసారు ఏ ఖాళీ దొరికిన సమయాన గుర్తొస్తానో వాళ్లకి కానీ నువ్వు మాత్రం నీ సమయాన్ని నా కోసమే కేటాయిస్తావు.
నన్ను భలే చూపిస్తావు సామి జనాలకి నాలో అంత శక్తి ఉందని నాకే తెలియదు ఉన్నది 56 అక్షరాలే మాత్రమే..!
నన్ను కలిపి పదాల్ని చేసావు, ప్రాణం పోసావు, కొత్త రూపాన్ని ఇచ్చావు, కొందరి ఇంట్లో దీపాన్ని చేసావు..!
దూరంగా ఉండే అక్షరాలని దగ్గర చేర్చి, అందంగా పేర్చి, విశాలమైన ఆకాశం లాగా వర్ణించి, మనల్ని ఉత్తేజపరిచి, నేను ఏమి చేయలేదు అన్నట్లు అమాయకుడిలాగా, చిన్న పిల్ల వాడి లాగా, ముసి ముసి నవ్వులతో మనల్ని పిండి, గుండెని గులాబీగా చేస్తావు. నువ్వు నడిచొచ్చే ఆరు అడుగుల గ్రంథాలయం నా దృష్టిలో.! నువ్వు నన్ను క్రమంలో పెట్టడం చూసి జనాలు ఆశ్చర్యపోతారు, ఆలోచిస్తారు, గ్రహిస్తారు, గుర్తుపెట్టుకుంటారు..!
నన్ను రోజుకి ఒక్కసారి కూడా పలకరించడమే కష్టమైన రోజుల్లో, అవలీలగా గంటకి వందసార్లు పలుకరిస్తావు.. నాకు బాగా నచ్చే విషయం ఏంటంటే చాలా రోజుల నుండి చెప్దాం అనుకున్నా. కానీ కుదరలేదు. నువ్వు రాసే ప్రతి పదం, పరమార్ధం. ఇతరులకి గాయం అవకుండా, ఒక్కోసారి అవతుంది కానీ, వెంటనే మందు పూస్తావు..!
ఈ రోజుల్లో నన్ను అందరూ వాడరాని చోట వాడుతున్నారు. నన్ను అనరాని మాటలు అంటారు. ఎన్నో రాత్రులు ఒంటరిగా ఉన్నాను, ఎన్నో రాత్రులు ఏడ్చాను, వద్దులే మళ్ళీ నిన్ను కన్నెర్ర చేయడం నాకు ఇష్టంలేదు. నిన్ను ఒకటే అడుగుతున్నాను కాదనకు నా ఒంట్లో రగిలిన వేడిని ఆవిరి చేసి అక్షరాలుగా అందంగా పరిచి రాయిని కదిలించేలా, శత్రువులని కూడా ఓడించేలా, రావణాసురుడిని కూడా వణికించేలా చేయాలి పదాలకి ప్రాణం పోసి అక్షరాలతో❤ ఇదే నేను కోరేది నా కోసం డబ్బు ఖర్చు పెట్టమనను..! అక్షరాల్ని వరసలో పెట్ట మంటాను..! ఇట్లు, నీ కోసం ఎదురు చూసే, నీ అక్షరాల్ని..!