మనకు తెలిసిన వారిలో ఎవరైనా పోలీస్ కోచింగ్ తీసుకుంటున్నా, పోలీస్ ఆఫీసర్ గా సలెక్ట్ ఐనా, లేదంటే పోలీస్ ఆఫీసర్ గా జాబ్ చేస్తున్నారంటే టక్కున ఏమనుకుంటున్నాం..? "ఇంకేటి.. పోలీస్ ఆఫీసర్ అంటే నడిచే ఏ.టి.ఏం మిషన్ లాంటోడు.. భయపెట్టో, బ్లాక్ మేయిలో చేసో డబ్బు గుంజొచ్చు అనే అనుకుంటున్నాం." నిజానికి ఇలా అనుకోవడంలో వింత ఏముంది.? 100లో ఎక్కువ శాతం మనకు ఇలాగే కదా కనిపించేది.. కాని "ఆ పోలీస్ ఆఫీసర్ మాత్రం సంఘంలో నేరాలను, ఎవ్వరికి బెదరకుండా, దేనికి లొంగకుండా నిజాయితీగా అరికడుతున్నాడు.." అని మనం ఎంతమందిని చూసి అనుకుంటున్నాం.? అలా అనుకునే అతి తక్కువ మంది ఆఫీసర్లలో హైదరాబాద్ డ్రగ్స్ మాఫియా సంఘటనలో బెండు తీస్తున్న అకున్ సబర్వాల్ గారు ఒకరు.
ఇంతకు ఎవరీ అకున్ సబర్వాల్...? అకున్ సబర్వాల్ గారిది పంజాబ్ లోని పాటియాల. అకున్ నాన్న గారు ఆర్మీ ఆఫీసర్. సూర్యుడు వేరు సూర్యుడి నుండి వచ్చే వెలుగు కిరణాలు వేరు కాదు అన్నట్టు అకున్ గారికి నాన్నలోని దేశ భక్తి లక్షణాలు అదే స్థాయిలో వచ్చాయి.. భవిషత్తులో ఏ ఉద్యోగం చేసినా గాని సమజానికి దేశానికి సేవ చేయాలనే ఆశయంతో ఆయన పెరిగారు. నిజానికి అకున్ గారు డెంటిస్ట్. ఆ తర్వాత దేశం కోసం సేవ చేయాలనే ఉద్దేశంతో సివిల్స్ రాశారు. అనుకున్నట్టు గానే 2001లో ఐ.పి.ఎస్ ఆఫీసర్ గా సెలెక్ట్ ఐయ్యారు.
ట్రాక్ రికార్డ్: అకున్ సబర్వాల్ గారు ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ శాఖలో పనిచేసినా గాని అనుకున్నది సాధించడం, అధికారులు అప్పజెప్పిన టార్గెట్ కన్నా ఎక్కువ రీచ్ అవ్వడం అనేది ఆయన రొటీన్ వర్క్.!
1. మొదట అస్సాం రాష్ట్రంలో విధులు నిర్వహించి తీవ్రవాదులపై తీవ్రంగా పోరాడారు.
2. తర్వాత 2004లో మన ఆంధ్రప్రదేశ్ కు వచ్చారు. ఆరోజుల్లో ఫాక్ష్యనిజం రాజ్యం ఏలేది. అకున్ గారు ప్రాణాలకు తెగించి ఫాక్ష్యనిజాన్ని అంతమొందించడంలో కీలక పాత్ర పోషించారు.
3. ఆ తర్వాత వరంగల్ జిల్లాకు వచ్చి శాంతికి విఘాతంగా మారిన నక్సలిజాన్ని రూపుమాపడంలో కృషి చేశారు.
4. ఇక విశాఖపట్నంలో ఎస్పిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కెరీర్ లోనే భీకరమైన ఛాలెంజ్ తీసుకున్నారు. మరెప్పుడు లేనంతగా విశాఖ ఏజెన్సి ప్రాంతంలోని మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఏకంగా 28సార్లు ఎదురు కాల్పులు జరిగాయి. ఆయన హయాంలోనే నక్సల్స్ ప్రాబల్యాన్ని పూర్తిగా అరికట్ట గలిగారు.
5. ప్రస్తుతం Excise and Enforcement అధికారిగా పనిచేస్తూ మన తెలంగాణలో నాటుసార, డ్రగ్స్ ఇతర మాదక ద్రవ్యాలను నిర్మూలించే ఉద్యమంలో పాల్గొంటున్నారు.
అకున్ గారు ఏ విభాగంలో ఉన్నా బెస్ట్ అనిపించుకుని నేరాలను అరికట్టారు.. మేం హీరోలం, మేం తోపు, మా వెనుక ఫాన్స్ ఉన్నారు అంటూ ప్రగల్భాలు పలికి డ్రగ్స్ కేసులో ఇరుకున్న వారికి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. టాలీవుడ్ అని మాత్రమే కాకుండా రాష్ట్రంలో మరెక్కడా కూడా నాటుసారా, డ్రగ్స్ లాంటి మాదక ద్ర్రవ్యాల వాడకాన్ని పూర్తిగా నిర్మూలించబోతున్నారు.
అనుబంధం: అకున్ సబర్వాల్ గారు స్మితా సబర్వాల్ గారు భార్య, భర్తలుగా ఎంత అనుబంధంగా ఉంటారో వృత్తి పరంగా కూడా అంతే నిజాయితీగా ఉంటారు. స్మితా సబర్వాల్ గారి పనితీరు గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు మనందరికి తన శక్తి తెలుసు. స్మిత సబర్వాల్, అకున్ సబర్వాల్ గారి పనితీరును గుర్తించే మన సి.ఏం కే.సి.ఆర్ గారు తెలంగాణలోని కొన్ని అతి ముఖ్య సమస్యలపై పోరాడేందుకు వీలుగా వీరిద్దరిని నియమించారు. ఒకరు ఐ.ఏ.ఎస్, మరొకరు ఐ.పి.ఎస్ ఇలా ఉన్నత రంగంలో ఉంటూ మన రాష్ట్రంలో నేరాలను అరికడుతూ, పటిష్టమైన పథకాలతో అభివృద్దికి కారణాలు అవుతున్నారు.