అలా మొదలైంది... ఒక ప్రేమ కథ!

Updated on
అలా మొదలైంది... ఒక ప్రేమ కథ!
(Article contributed by Ram Vamsikrishna, an IIT Bombay post graduate currently working in Bangalore.) ఆకాశం లొ చుక్కల్ని చూస్తుంటే తోక చుక్క రాలింది "దేవుడు గానీ సంక్రాంతి కి ముగ్గుల పోటీ కొస్తే మేమందరం బలాదూర్ ! ఎంత అందం గా గీసాడు ఆకాశం కాన్వాస్ మీద ! ఆ రాలే తోక చుక్క నేను నీతో ఉండటానికి వస్తున్నా అని చెప్పడానికే”, ఆమె అనుకుంది. "కోట్ల నక్షత్రాలు , పాల పుంతలు ఇవన్నీ శూన్యం నుంచే వచ్చాయ్. బిగ్ బాంగ్ థియరీ , స్ట్రింగ్ థియరీ , థియరీ ఏదైనా దేవుడున్నాడని నేను నమ్మను . అయినా ఈ అనంత విశ్వం లో మనమెంత? గడ్డి మేటు లొ గుండు సూదంత !” అతడు అనుకున్నాడు. బస్సు హారన్ విన్నారు "ఇది కేవలం తప్పుకొమనే పిలుపు కాదు, నేను వెళ్తున్నా ఆశల్ని, కోరికల్నీ మోసుకుంటూ, సమానత్వం గురించి దండోర వేస్తూ అనే వెక్కిరింత.. ఎందుకంటే దానికి ముసలి ముతక రాజు పేద ప్రాంతం భేధం తెలీదు గనక !", ఆమె అనుకుంది. “ఇది మానవ మేధస్సు కి మచ్చు తునక... నడిచాడు , గుర్రాల్ని తోలాడు, నొప్పి పుడుతుందని చక్రం కనిపెట్టాడు, ఆవిరి తో నడిపించాడు, మోటారు కనిపెట్టాడు .. ఇవి ప్రగతి రధ చక్రాలే , కానీ వాటి కిందే పడి నలిగిపొతున్నాడు !", అతడు అనుకున్నాడు. ఆకాశం లొ ఎగురుతున్న పక్షిని చూసారు "డార్విన్ చెప్పింది నిజమే ! Evolution. అది ఎగిరే విధానం, శరీర నిర్మాణం తరతరాలుగా మారుతూ వచ్చింది. పిచ్చొల్లే పక్షి లాగా ఎగురుదాం అని కలలు కంటారు, ఇది మనిషి వల్ల కాదు !" అతడు అనుకున్నాడు . "ఎగరాలనే సంకల్పం బలం గా ఉండాలే గానీ, ఎవరైనా పక్షుల్లాగా ఎగరగలం. ఆశల్లొ, ఆలొచనల్లొ , ఆనందం లో , ప్రేమ లో !" ఆమె అనుకుంది. అతను ఆమె ని చూసాడు, ఆమె అతన్ని చూసింది. ఇద్దరి మెదడులు పని చెయ్యటం మానేసాయి, మనసులు పని చెయ్యటం మొదలు పెట్టాయ్. "ఇదేంటి ఇంత అందం గా ఉంది…!" " ఏమున్నాడ్రా బాబూ …!" "*@*(6@4****%%^^&&" "%&*(^^%&*(((*&^^^66^^^&*(((" ఇక ఆ ఆలొచనలకి అర్ధం, రూపం లేదు. అతనికి ఆమె అమాయకత్వం నచ్చింది, ఆమె కి అతని ఆలోచన నచ్చింది. మనసుల్ని మెలిపెట్టే గుండెల్ని తాకే మరో ప్రేమ కథ అలా మొదలైంది...