ఫుడ్ ఐటెమ్ ఏదైనా గాని దానిని తయారు చేసే సంస్థల వల్ల దాని రుచి మరింత పెరుగుతుందని మనం బలంగా నమ్ముతాం.. అలా MC Donald's బర్గర్స్, KFC చికెన్ ఇంకా చాలానే ఉన్నాయి. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న ఈ "అల్లూరయ్య స్వీట్స్" కూడా ఓ బ్రాండ్, ఇది మన తెలుగువారికి బాగా పరిచయమే. అల్లూరయ్య స్వీట్స్ గురించి చెప్పాలంటే ప్రత్యేకంగా అక్కడ తయారుచేసే "మైసూర్ పాక్" గురించి చెప్పాలి. ఒక్కసారి దీని రుచి చూస్తే ఇక అల్లూరయ్య స్వీట్స్ లో తప్పా మరెక్కడా ఇంత రుచిగా మైసూర్ పాక్ ఉండదని మైసూర్ పాక్ ప్రియులు చెప్పుకుంటారు.
![](https://cdn.shopify.com/s/files/1/0896/6753/5157/files/5-46_2017-07.jpg)
అల్లూరయ్య స్వీట్స్ ను సుమారు 60 సంవత్సరాల క్రితం యేలేటి అల్లూరయ్య గారు ఒంగోలు ట్రంకురోడ్డులో హిందూస్తాన్ హోటలుకు సమీపంలోని ఓ చిన్న గదిలో దీనిని ప్రారంభించారు. ఆ చిన్న గదిలో నుండే తరతరాలుగా కేవలం ఒంగోలు వాసులకు మాత్రమే కాకుండా దేశ, విదేశాలకు కూడా చేరుకుంటూ భోజన ప్రియుల ప్రేమను ఆత్మీయంగా అందుకుంటున్నారు. ఐతే ఇది కేవలం ఒక సాధారణ చిన్న షాప్ లానే ఉంటుంది. దీనికి బ్రాంచెస్ మరెక్కడా లేవు.
![](https://cdn.shopify.com/s/files/1/0896/6753/5157/files/1-55_2017-07.jpg)
కేవలం రెండు గంటల్లోనే.. ప్రతిరోజు 60 కేజీల మైసూర్ పాక్ వరకు ఇక్కడ తయారుచేస్తారు. ఉదయం 10:30 కు షాపు ఓపెన్ చేస్తే కేవలం మధ్యాహ్నం 1గంటలలోపే 60 కేజీల మైసూర్ పాక్ ఐపోతుంది. ప్రతిరోజు 60కేజీల మైసూర్ పాక్ మాత్రమే చేస్తారు. వినియోగదారులు షాపు తెరిచిన వెంటనే క్యూలో నిలబడి మరి కొనడానికైనా వెనుకాడరు. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అవ్వదానికి ఒక బలమైన కారణం "Mouth Publicity".
![](https://cdn.shopify.com/s/files/1/0896/6753/5157/files/3-51_2017-07.jpg)
మాములుగా ఐతే ఒక మంచి వ్యక్తిని కలిసినప్పుడు అతని వ్యక్తిత్వం గురించి మనకు తెలిసిన వారి దగ్గర చెప్పాలనిపిస్తుంది.. అదే ఒక్కసారి ఈ మైసూర్ పాక్ రుచి చూశాక ఇక ఆగుతారా అంతటి రుచి గురించి చెప్పకుండా ఎలా ఉండగలుగుతారు.. చెప్పడం మాత్రమే కాదు దేశ విదేశాలలో ఉన్న వారి ఆత్మీయులకు కూడా పంపిస్తుండడంతో అల్లూరయ్య స్వీట్స్ కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు.
![](https://cdn.shopify.com/s/files/1/0896/6753/5157/files/4-51_2017-07.jpg)