"నిజంగా ప్రపంచంలోని అన్ని పనుల కన్నా వ్యవసాయంలో ఉన్నంత ఆనందం, తృప్తి మరే వృత్తిలో లేదనిపిస్తుంది".. భూమిని పొలంగా మార్చడం, దున్నడం, మొక్కలను నాటడం, ప్రాణంగా పెంచడం, పంట పండించి సాటి మనుషులకు ఆహరం అందించడం.. ఇది ఒక వ్యాపారంలా సాగినా కూడా ఇందులో అనిర్వచనీయమైన గొప్ప ఆనందం ఉంటుంది, రైతుగా సంఘంలో గౌరవం కూడా ఎంతో ఉంటుంది.. ఇంతటి అనుభూతిని తాను అనుభవించాలనే తపనతో మన క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు వ్యవసాయాన్ని చేస్తున్నారు. ఔను.. పది, ఇరవై ఎకరాలలో కాదు ఏకంగా 126 ఎకరాలలో చేస్తున్నారు. సాధారణంగా వ్యవసాయమంటే ఇష్టముంటే మహా ఐతే కొన్ని ఎకరాలలో చేస్తారు ఏమో, కాని రాయుడు 126 ఎకరాలలో చేస్తున్నారంటే ఆయన వ్యవసాయంలో ఎంత నిష్ణాతుడై, రాటుదేలారు అనే విషయాన్ని మనం సింపుల్ గా అర్ధం చేసుకోవచ్చు.
వ్యవసాయమంటే చాలా ప్రేమ.. మన తెలుగువాడైన రాయుడుకి చిన్నప్పటి నుండి క్రికెట్ అంటే చాలా ఇష్టం అది అందరికి తెలిసిందే, క్రికెట్ తరువాత అంతటి ఇష్టం వ్యవసాయం మీద ఉండేది. గంటల తరబడి ప్రాక్టీస్ చేసి ఇంటికొచ్చాక ఇక తన మనసు వ్యవసాయం మీదకు మళ్ళేది. అగ్రికల్చర్ కు సంబంధించిన బుక్స్ చదవడం, యూ ట్యూబ్ లో వీడియోలు చూడడం, రైతులతో మాట్లాడడం, ఇంకా క్రికెట్ మ్యాచ్ ల కోసం విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడి పొలలాను పరిశీలించడం, వారితో మాట్లాడి అక్కడి పద్దతులను తెలుసుకోవడం చేసేవారు.. ఎప్పుడైనా కొంత సమయం దొరికితే చాలు మిత్రుల పొలాలకు వెళ్ళి ఆనందంగా గడిపేవారు.. మన క్రికేటర్స్ లో చాలామంది బ్రాండేడ్ కంపెనీలకు ఎండర్స్ చేయడం, రెస్టారెంట్ బిజినెస్ చేయడం లాంటివి చేస్తుంటారు కాని అంబటి రాయుడు మాత్రం కష్టపడి సంపాదించినదంతా భూమిని కొనుగోలు చేయడానికే ఉపయోగించాడు. అలా మన తెలంగాణ సిరిసిల్ల రాజన్న జిల్లాలో 78 ఎకరాలు, గంభీరావ్‌పేట మండలంలో శ్రీగాధ గ్రామం దగ్గర 48 ఎకరాలు కొనుగోలు చేశారు.
రాయుడు వ్యవసాయ పద్దతులు: ఏ జాబ్ లో ఐనా, బిజినెస్ ఐనా పరిస్థితులకు తగ్గట్టు అప్ డేట్ అవుతూ ఉండాలి. ఈ క్రమంలో మన సి.ఏం కే.సి.ఆర్ గారి ఫామ్ హౌజ్ కు కొన్నిసార్లు వెళ్ళి అక్కడ ఎంతో అమూల్యమైన వ్యవసాయ పద్దతులను తెలుసుకున్నారు. వ్యవసాయానికి ప్రాణం "నీరు" ఆ నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలని వాటర్ షెడ్ మేనేజ్ మెంట్ ద్వారా డ్రిప్ట్ సిస్టమ్ పెట్టించారు. 5 ఎకరాల పాలీహౌస్ లో గులాబీ తోట, 78 ఎకరాలలో దానిమ్మ తోట, 10 ఎకరాలలో బస్మతి కన్నా డిమాండ్ ఉన్న వరిని, ఇక మిగిలిన భూమిలో రకరకాల పంటలను పండిస్తున్నారు.
మన వ్యవసాయం: విపరీతంగా పెస్టిసైడ్స్ వాడడం మంచిది కాదని ఇప్పుడు మళ్ళి ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు రైతులు అడుగులు వేస్తున్నారు అది చాలా మంచి పద్దతి కాని అన్ని రకాల పంటలను పూర్తిగా సేంద్రీయ ఎరువులతో చేయాలనుకుంటే మాత్రం నష్టం తప్పదు అని రాయుడు అభిప్రాయం. మన రైతులు పంటను పండించడం వరకు మాత్రమే పూర్తిగా ఆలోచిస్తున్నారు కాని పండించిన పంటను ఎలా మార్కెటింగ్ చేసుకోవాలో తెలియక ఎంతో నష్టపోతున్నారు. ఆన్ లైన్ లో వస్తువులు అమ్మినట్టే పంటను కూడా ఆన్ లైన్ లో అమ్మకాలు జరగాలి. ఇందుకు అనుగూణంగా ప్రతి మండలంలో ప్రత్యేకంగా ఆన్ లైన్ మార్కెట్ కోసం ఒక కార్యాలయాన్ని స్టార్ట్ చేస్తే రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రాయుడి ఆలోచన.
క్రికెట్ మ్యాచ్ లు, ప్రాక్టిస్ అంటూ ఎంతో బిజీగా ఉన్నా కూడా తన భార్య విద్య గారు ఈ వ్యవసాయానికి సంబంధించిన అన్ని బాధ్యతలు చూసుకుంటారు. జీవన ప్రయాణంలో భాగస్వామి మాత్రమే కాదు, కష్ట సుఖలలో, పనులలో కూడా భార్య విద్య గారు పాలు పంచుకుంటారు.
మన భారతదేశం గర్వించదగ్గ ఒక గొప్ప క్రికెటర్ క్రికెట్ కు సంబంధించిన సూచనలు కాకుండా వ్యవసాయం గురించి చెబుతుంటే నాతో పాటు మీకు కూడా కొంత ఆశ్చర్యంగా, చాలా ఆనందంగా ఉండి ఉంటుంది కదూ.. మొదట చెప్పిందే మళ్ళి చెబుతున్నాను వ్యవసాయంలో ఉన్నంత తృప్తి, ఆనందం మరెందులోను ఉండదండి. ఇప్పటికి మన యూత్ లో చాలామందికి వ్యవసాయం చేయాలని ఎంతో తపన ఉంది, గవర్నమెంట్ టీ హబ్ ద్వారా ఎంతో మంది ఆలోచనలకు సహాయాన్ని అందిస్తున్నట్టే వ్యవసాయం చేయాలనుకునే యువతుకు సరైన విధంగా గైడెన్స్ ఇస్తూ, ప్రోత్సాహం అందిస్తే యూత్ కి మాత్రమే కాదు సమజానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.