ప్రజలు తప్పులు చేస్తే వారిని సరైన విధంగా శిక్షించడానికి, లేదంటే ఆ తప్పులు అరికట్టడానికి న్యాయవ్యవస్థ, పోలీస్ వ్యవస్థ ఉంది. మరి పోలీసులే తప్పు చేస్తే.? సాధారణ పౌరులు వారిని వేలెత్తి చూపగలరా.? ఒక వేళ చూపితే దాని పర్యవసానం ఎలా ఉంటుందో కూడా ఊహించగలం. తప్పు ఎవరు చేసిన అది తప్పే శిక్ష అందరికి ఒకేలా ఉంటుంది అని రాజ్యంగం చెబుతున్నా గాని కొంతమంది పోలీసులు తప్పుచేస్తే మనలో చూసి చూడనట్టు ఒదిలేస్తున్నాం ఎందుకు వాళ్ళతో తలనొప్పి అని. కాని అంజద్ ఉల్హా ఖాన్ అందరిలా ఆగిపోలేదు.
అంజద్ ఖాన్ ఓ పొలిటీషియన్. మన హైదరాబాద్ లోనే ఉంటున్నారు. మన హైదరాబాద్ మొదటి అతి పెద్ద సమస్య ట్రాఫిక్. రూల్స్ అందరూ పాటించాలి ముఖ్యంగా రూల్స్ పాటించేలా చూసేవారు కూడా ఖచ్చితంగా పాటించాలి అనే సందేశంతో ఓ గొప్ప ఉద్యమాన్ని సోషల్ మీడియా వేదికగా చేస్తున్నారు. రోడ్డు మీద ఎక్కడైనా పోలీస్ వారు హెల్మెట్ లేకున్నా, ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నా, సిగ్నల్స్ బ్రేక్ చేసినా గాని వారి నెంబర్ ప్లేట్, ఆ ఏరియా అడ్రస్ మెన్షన్ చేస్తు అప్పటికప్పుడు ట్విట్టర్ లో డి.జి.పి అనురాగ్ శర్మ గారిని, కే.టి.ఆర్ గారిని ట్యాగ్ చేస్తు పోస్ట్ చేస్తున్నారు.
ఈ పద్దతి ప్రజలకు విపరీతంగా నచ్చడంతో వారు కూడా అంజద్ ఖాన్ గారికి రూల్స్ పాటించని పోలీసుల ఫోటోలను పంపిస్తున్నారు వాటిని కూడా పోస్ట్ చేయడం మొదలుపెట్టారు. లైసెన్స్ లేని వారికి, రూల్స్ పాటించని వారికి ఎలా శిక్షలు వేయాలి.? ఎంత ఫైన్ కట్టించాలి అని ఆలోచిస్తూ ఆ రూల్స్ ఆ ఫైన్ మాకు వర్తించదు అనే భావనలోనే కొంతమంది పోలీసులున్నారు. అలాంటి వారి తప్పులను ఇలా పబ్లిక్ గా పోస్ట్ చేస్తూ వారు కూడా సొసైటీలో భాగమే అని తెలియజేయడమనేది చాలా గొప్ప పద్దతి.