నేటి పరిస్థితులను అద్దం పట్టే కథ ఇది - A Short Story

Updated on
నేటి  పరిస్థితులను అద్దం పట్టే కథ ఇది - A Short Story

Contributed by Masthan Vali

చల్లగా గాలి వీస్తోంది, వాతావరణం ఆహ్లాదంగా ఉంది. నేను, మా తమ్ముడు కలిసి అమ్మ తో ఆడుకుంటున్నాము... ఎన్నో కబుర్లు చెప్తోంది, చాలా విషయాలు నేర్పిస్తోంది, ఎంతో ఆసక్తిగా అనిపిస్తోంది. సరిగ్గా అప్పుడు మా ఇంటికి చుట్టాలొచ్చారు. మేము ఎవరా అని చూసాము. వాళ్ళు మనకు చుట్టాలవుతారు అని మొదటి సారి అందర్నీ పరిచయం చేసింది అమ్మ. తర్వాత వాళ్ళతో కాసేపు ఆడుకోమని మమ్మల్ని పంపించింది. మేము గంతులేసుకుంటూ వెళ్ళాము. మా కోసం తెచ్చిన స్వీట్స్, చాక్లెట్స్ అన్ని ఇచ్చారు. భలే సరదాగా అనిపించింది. అమ్మలానే వారందరూ కబుర్లు చెప్తున్నారు. కొన్ని అర్థమయ్యేవి కావు. అప్పుడు అమ్మకేసి చూసేవాళ్ళం,

" ఏంటమ్మా ఏం చెప్తున్నారో తెలీట్లేదు " అని…! " అదేం లేదురా... " అని అమ్మ విడమరిచి చెప్పేది. " ఓస్ ఇంతేనా! " అనిపించేది. తర్వాత అమ్మ కంటే చుట్టాలే బాగా దగ్గరయ్యారు. మాకు కొంతమంది స్నేహితులు ఉండేవారు. వారింటికి కూడా చుట్టాలొచ్చారంట.వారందరు కూడా వాళ్ళ చుట్టాల దగ్గరే ఎక్కువ సేపు ఉండేవారు. అందరం వారి వారి చుట్టాలకి అలవాటు పడిపోయాం. ఎంతలా అంటే, " ఇక మేము వెళ్లొస్తాం " అని ఇంటికొచ్చిన చుట్టాలంటే, "లేదు... వెళ్ళకండి, వెళ్లకండి" అని మారం చేయడం మొదలెట్టాం. మా బాధ తట్టుకోలేక అమ్మ వాళ్ళని ఇంకొన్నాళ్ళు మాతో ఉండమని చెప్పేది. వాళ్ళు మాత్రం పరాయిచోట ఎన్ని రోజులని ఉంటారు. అమ్మను పట్టించుకోకుండా వెళ్లిపోయారు. మేము మాత్రం తక్కువ తిన్నామా... అమ్మ మాట వినకుండా వాళ్ళ వెంట పడ్డాం. పోన్లే పిల్లలని కొన్ని రోజులు వాళ్ళింట్లో ఉండనిచ్చారు. మాకైతే చాలా ఆనందమేసింది. వాళ్ళసలు అమ్మ లా ఉండరు. అంటే, పొద్దున్నే నిద్రలేపటం, స్నానానినికి నీళ్లు పెట్టడం, టిఫిన్ వండటం, మమ్మల్ని అందంగా రెడీ చేయడం లాంటివేం చేసే వారు కాదు. అన్ని మేమే చేసుకోవాల్సొచ్చేది. అయినా ఎందుకో, వాళ్ళ దగ్గరే ఉండేవాళ్ళం.కొత్తలో వాళ్ళిచ్చిన చాకెట్లు, స్వీట్స్ బాగా నచ్చడం వల్లనేమో. అప్పట్లా రోజు ఇవ్వట్లేదు ఇప్పడు, కానీ ఎప్పుడిస్తారో అని ఎదురుచూస్తూ, వాళ్ళు చెప్పే కబుర్లు వింటూ అలానే సమయం గడిపే వాళ్ళం. బోర్ మాత్రం కొట్టేది కాదు. అమ్మను చూడ్డానికి మాత్రం అప్పుడప్పుడు ఇంటికెళ్ళేవాళ్ళం. కొన్నాళ్లకు అది కూడా మానేసాం. చుట్టాలు బాగా అలవాటు పడిపోయారు. అసలు మమ్మల్ని అమ్మ దగ్గరకు పంపించాలన్న ఆలోచన కూడా రాలేదు వాళ్లకి. సర్లెండి, మా అమ్మ దగ్గరకు వెళ్లాలని మాకే లేనప్పుడు వాళ్ళేం చేస్తారు! కొన్నేళ్ల తర్వాత...

" ఒక సారి అమ్మను చూద్దాం రా " తమ్ముడిని అడిగాను. " ఎందుకు రా ఉన్నపలంగా " అన్నాడు వాడు. " ఈ రోజు అమ్మ Birthday కదా " గుర్తుచేసాన్నేను. "ఇన్నేళ్లకు గుర్తొచ్చిందా అమ్మ " అని వాడు నన్ను పట్టించుకోలేదు. " నేను వెళ్తున్నాను, నువ్వు రావడం రాకపోవడం నీ ఇష్టం " అని వాడి కోసం ఎదురు చూడకుండా వచ్చేసాను నేను. నన్ను పెద్దగా పట్టించుకోలేదు వాడు!

నేను అమ్మ దగ్గరికి వచ్చేసరికి, అమ్మ ముసలి వయసులో ఉంటుందనుకున్నాను. కానీ తనని చూసి నేను నివ్వెరబోయాను. తను అచ్చం అలానే అందంగా, హుషారుగా, ఆరోగ్యాంగా ఉంది. అక్కడ ఇద్దరు పిల్లలు తనతో ఆడుకుంటున్నారు. సరిగ్గా నేను, తమ్ముడు చిన్నప్పుడు అమ్మతో ఆడుకున్న వయసులో ఉన్నారు వారు. దూరం నుంచే చూస్తున్నాను. కాసేపటికి అక్కడికి ఒక బస్సు వచ్చింది. అందులోంచి కొంతమంది దిగారు. ఎవరా అని చూడసాగాను. తర్వాత అర్థమైంది వాళ్ళు చుట్టాలని. అప్పుడు మా ఇంటికి నడుచుని వచ్చేవారు, ఇప్పుడు ఏకంగా పెద్ద బస్సు లో వచ్చారు. మాలాగే అక్కడున్న పిల్లలిద్దరూ వాళ్లతో ఆడుకున్నారు. వాళ్ళతో బాగా కలిసిపోయారు. చుట్టాలు వెళ్లిపోయే సమయానికి ఆ పిల్లలు కూడా వారితో వెళ్తామని మారాం చేశారు. అమ్మ చిన్నగా నవ్వి, " సరే అలానే వెళ్లి రండి " అని పంపించింది.

ఆమెకు తెలుసు వాళ్ళు మళ్ళీ తిరిగి రారని, కానీ వాళ్ళ ఇష్టం కొద్దీ పంపించింది. ఆ తర్వాత అమ్మ ఒంటరిగా ఉంది. " అంటే మేము వెళ్ళిపోయిన తర్వాత కూడా అమ్మ ఇలానే ఒంటరితనం అనుభవించిందా? ", అని ఆలోచన రాగానే కాస్త బాధ కలిగింది. అమ్మను ఇన్నేళ్లు దూరంగా ఉంచామా అని.! కానీ నా ఆలోచన అబద్ధమని క్షణం గడవకుండానే అర్థమయ్యింది. అక్కడ మరో ఇద్దరు పిలల్లు అమ్మతో కలిసి ఆడుకుంటున్న దృశ్యం కనపడింది నాకు. ఓ గంట తర్వాత, వాళ్లిద్దరూ అచ్చం మా లాగే అక్కడ్నుంచి అమ్మను వదిలేసి వెళ్లిపోయారు. అలా గంట గంట కు అమ్మ దగ్గర్నుంచి కొంత మంది పిల్లలు వెళ్లిపోతున్నారు.

అప్పటికి ఇప్పటికి నేను గమనించిన తేడా ఒకటే, ఆనాడు మేము అమ్మతో కొద్ది రోజుల పాటు ఉండి వెళ్ళిపోయాము. ఈనాడు వీళ్ళు కొద్ది గంటల పాటు ఉంది వెళ్లిపోయారు. అప్పుడు వెళ్లిన నేను ఇన్నేళ్లకు తిరిగొచ్చాను, మరి ఇప్పుడు వెళ్లిన వీరు ఇంకెన్నేళ్లకు అమ్మ దగ్గరికొస్తారు? అసలొస్తారా...? ఇవే ఆలోచనలతో నెమ్మదిగా అమ్మ దగ్గరకు వెళ్ళాను. నన్ను చూసిన వెంటనే అమ్మ, " వచ్చావా... ఎలా ఉన్నావు " అని ఆప్యాయంగా పలకరించింది. ఇన్నేళ్లు నేను తనకు దూరంగా ఉన్నాననే కోపం, బాధ తనలో కాస్తైనా కనిపించలేదు.

" ఎలా ఉన్నావమ్మా? " అని అడిగాను. " నాకేంటి, నిక్షేపంగా ఉన్నాను. దా, ఇలా కూర్చో " అని పక్కన కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్పడం మొదలుపెట్టింది. వాతావరం ఆహ్లాదంగా మారింది. నాకప్పుడు అర్థమయ్యింది, ఇన్నాళ్లు ఒంటరిగా వదిలి తనను నేను బాధ పెట్టాననుకోవడం నా భ్రమ అని! అవును, ఇంత కాలం అమ్మ నన్ను Miss అవ్వడం కాదు, నేనే అమ్మను Miss అయ్యాను. తన కబుర్లను, తను చెప్పే కథలను, తనతో కలిసి ఆడాల్సిన ఆటలను, తన నుంచి నేర్చుకోవాల్సిన విషయాలను, నన్ను నేను పరిణితి చెందిన వ్యక్తిగా మలుచుకునే అవకాశాలను నేను Miss అయ్యాను.

వెంటనే తమ్ముడికి ఈ విషయం చెప్పి తనని కూడా అమ్మ దగ్గరకు తీసుకురావాలి అనిపించింది. కానీ అమ్మను విడిచి వెళ్లబుద్ధి కాలేదు. మనసులో అనుకున్నా, తమ్ముడు కూడా అమ్మ దగ్గరికి వస్తే వాడు కోల్పోయిందేమిటో ఇప్పటికైనా తెలుసుకుంటాడని. వాడికి వినపడిందంటారా...? అమ్మను కలుసుకోడానికి వస్తాడంటారా...?

వాడితో పాటు మీరు కూడా రండి. ఒక్క సారి అమ్మ లాంటి తెలుగు ని కలిసి, తన తో మాట్లాడుదాం. తెలిసి తెలియని వయసులో చుట్టాల్లాంటి ఆంగ్లాన్ని నేర్చుకోవడానికి తెలుగుని వదిలేసి వెళ్ళాం. ఇప్పటికీ ఆలస్యం కాలేదు. అమ్మకు ఓపిక చాలా ఎక్కువ, అస్సలు కోప్పడదు... తన కోసం కాదు, మన కోసం ఒక సారి తనతో మాట్లాడుదాం.