Contributed by Bharadwaj Godavarthi
మరణం, జ్ఞాపకం, ఈ రెండిటి మీద నా అభిప్రాయం మీతో పంచుకోవాలనిపించింది.
మా అమ్మ "మరణించి" సుమారు ఆరు నెలలు అయింది,
తను "తుది శ్వాస" విడిచిన ఆ క్షణం, తన "అస్తికలను" కలిపిన ఆ క్షణం, నా మదిని కలిచివేసిన భావం "ఇంక తన 'జ్ఞాపకం' కాని, తన 'రూపం' కాని నాతో వుండవు అని"
కాని నా చుట్టూ వున్న వాళ్ళు మాత్రం, తను ఒక జ్ఞాపకంగా నాతోనే ఎప్పుడు వుంటుంది అని అన్నారు!!
"నిజమే అనుకున్న",
రోజులు గడుస్తున్నాయి, నెమ్మదిగా కాలంతో పరిగెతడం మొదలు పెట్టా, ప్రతి క్షణాన్ని ఒక జ్ఞాపకంలా మలుచుకొని పరిగెడుతున్న .కాని ఎందుకో, గడిచిన ప్రతి క్షణాన్ని సూక్ష్మంగా పరిశిలిస్తే..నాకు ఆ జ్ఞాపకాలలో 'అమ్మ' కన్నా నా అనే స్వార్ధమే ఎక్కువ కనపడుతోంది.
అప్పుడు అప్పుడు నాన్న అడుగుతూ వుంటారు, "ఏరా, అమ్మ ఎప్పుడైనా కలలోకి వస్తోందా, కనీసం జ్ఞాపకంగా గుర్తుకువస్తోందా?"
ఏం చెప్పాలి!
"లేదు", అంటే నాకు ప్రేమలేదు అనుకుంటారేమో అన్న భయం,
"అవును", అంటే నా మనసాక్షిన్ని మోసం చేసినట్టు అవుతుంది..అందుకే ఒక చిరునవ్వు నవ్వి అక్కడ నుండి తప్పుకునే వాడిని..
ఇలా గడుస్తున్న నాకు ఒక రోజు ఒక బంధువుల ఇంట్లో భోజనం చేయాల్సి వచ్చింది.చాల ప్రేమతో కమ్మని భోజనాన్ని వండి పెట్టారు.చాల ఆకలితో మొదటి ముద్ద పెట్టుకున్న నాకు ఒక అనుభూతి నా మనసును సృశించి వెళ్ళింది.
ఆ అనుభూతి ఆ పదార్ధపు రుచివల్లో, లేక వడ్డించిన వాళ్ళ ప్రేమవల్లో వచ్చింది కాదు
కాని ఆ క్షణం గడిచాక ఆ అనుభూతి పుట్టుక, భావం, రూపం నాతో లేవు????
ఇంకొన్ని రోజులు గడిచాయి..ఎప్పటినుండో ఎదురుచూస్తున్న ఉద్యోగం నాకు వచ్చింది.ఆ ఉద్యోగం వచ్చింది అని తెలిసిన ఆ క్షణం మళ్ళి ఆ రోజు కలిగిన అనుభూతి మళ్ళి నన్ను తాకింది..దీనికి కారణం ఉద్యోగం వళ్ళ వచ్చిన భావోద్వేగం కాదు ఇంకేదో...ఇది కూడా అ క్షణం తరవాత నాతో లేదు.
ఆ ఆనందంలో నాన్నకు ఉద్యోగం విషయం చెప్పడానికి ఇంటికి వెళ్ళాను..ఇంట్లో అడుగుపెడుతున్నపుడు తలుపు తీస్తున్న శబ్దం వినపడింది మళ్ళి అదే అనుభూతి నన్ను తాకింది
అప్పుడు అర్ధం అయింది ఆ అనుభూతి పేరు అమ్మ అని.
ఇప్పటిదాకా మనిషి మరణించిన తరవాత మనకి జ్ఞాపకంగా మనతోనే వుంటారు అని అనుకున్నాను.
కాని, ఇప్పుడు అర్ధం అయింది జ్ఞాపకం అనేది మెదడుకు సంబందించిన ప్రక్రియ...మనం మర్చిపోకూడదు అనుకున్న విషయాలను జ్ఞాపకంగా గుర్తుపెట్టుకుంటాము..
కాని మనషి అనే వాడు మనసుకు సంబందించిన ప్రక్రియ..తను ఎప్పుడు మనకి అనుభూతిగానే ఉంటాడు..అది ఆనందంలో కావచ్చు, దుఖంలో కావచ్చు.
బహుశ అందుకే కాబోలు ఈ క్షణం కూడా అమ్మ నాతో ఒక అనుభూతిగానే వుంది.
ఇరవై అయిదేళ్ళ నా జీవితం చూసుకుంటే గడిచిన ప్రతి క్షణంలోనూ తను వుంది..క్షణమే తను అయినప్పుడు ఇంక జ్ఞాపకం అనే పదానికి చోటు ఏది.
గడవపోయే ప్రతి క్షణంలో గడిచిన క్షణంలో ఉన్నమనషులు మనతో ఉండకపోవచ్చు, కాని వాళ్ళు మనతో పంచుకున్న అనుభూతులు మాత్రం మనతోనే వుంటాయి. మనం ఎక్కడ ఉన్న అవి మన మనసులను తాకుతూనే వుంటాయి.