"హలో అమ్మమ్మ గారు, ఎలా ఉన్నారు ? వంట అయ్యిందా లేదా పొయ్యి మీద మాడబెట్టి, మీరు కొత్తగా కొనుక్కున్న స్మార్టు ఫోను లో బిజీ గా ఉన్నారా ?"
అమ్మమ్మ : "ఏడిసావ్ లేరా, ఈ టైం లో ఫోన్ చేశావేంటి ? ఇప్పుడు మీకు రాత్రి అయ్యుంటుందేమో కదా... "
సుందర్ : "ఏం లేదు అమ్మమ్మ..... ఈ తెల్ల వాళ్ళ మధ్య నల్లగా తాత గారి కలర్ లో పుట్టిన నాకు మొదటి జీతం అందింది. నీకు కిండిల్ కొన్నా, ఇంక ఏ పుస్తకం ఇనా ఆ షెల్ఫు లో పెట్టడం మాని అందులో చదువుకో"
అమ్మమ్మ : "తాత ని ఏమైనా అన్నావంటే నీ తాట తీస్తా. ఐనా నన్ను అడక్కుండా ఎవడు కొనమన్నాడు నిన్ను ?"
సుందర్ : "అబ్బా ఏవండీ సీతా మహా లక్ష్మీ M .A గారూ, కాలం తో పాటు మనమూ అప్డేట్ అవ్వాలి. ఎప్పుడు చూసినా ఆ పాత కాగితం పుస్తకాలే చదువుతారా ? ఆ కాలం లోనే M. A చేసావ్, ఇంకా అలా ఉంటె ఎలా అమ్మమ్మా నువ్వు ? ఏముంది ఆ మాములు కాగితపు పుస్తకాల్లో ?"
అమ్మమ్మ : "ఏరా వెధవ, తమరు టెన్త్ రాసేటప్పుడు బారిస్టర్ పార్వతీశం గురించి తెగ చెప్పేవాడివి ? ఏది దాన్ని ఇప్పుడు కిండిల్ లో చదువు చూద్దాం ?!?"
నోట్లో పప్పన్నం నమలకుండా అలా ఎల్లబెట్టుకొని, వేమన పద్య రత్నాకరం లోని పద్యాలు తెగ వినేవాడివి ? మర్చిపోయావా ?
తెలియని ఏ విషయానికైనా పెద్దబాలశిక్ష పుస్తకం తెరిచి చూసేవాడివి...... అవన్నీ గతం గతః అని విడిచిపెట్టేశావా?
సుందర్ : "అబ్బా అమ్మమ్మా...... మొదలెట్టావా ..... "
అమ్మమ్మ : "నోర్ముయ్ ...... వెధవ .... వెధవ "
సుందర్ : "పుస్తకం ఏ రూపం లో ఉన్నా, అందులోని అందులోని భావం అర్ధమైతే చాలు కదా , ఈ మాత్రం దానికి ఏదో చెప్తావ్ ..... "
అమ్మమ్మ : "ఆపరా ...... ముయ్ నోరు. ఈ లాజిక్ లేని తెలివి నీ మేనేజర్ దగ్గర చూపించు. ఈ అమ్మమ్మ దగ్గర కాదు. ఇప్పుడు నువ్వు "సముద్రం" మీద రాయబడిన ఒక పుస్తకం కోన్నావనుకో , అది తెరవగానే నీకు సముద్రపు గాలి తగలాలి. ఎప్పుడైతే నీకు సముద్రపు గాలి తగిలి, నువ్వు సముద్రపు ఒడ్డున నడుస్తావో అప్పుడే నీకు ఆ పుస్తకం రుచించినట్టు.
గురజాడ అప్పారావు గారు రాసిన కన్యాశుల్కం పుస్తకం తెరవగానే....... రోజ్ వుడ్ కుర్చీ వేసుకొని, నేత కోటు వెస్కొని, పట్టు పంచె కట్టుకొని ఆజానుబాహుడై ఆయనే చెప్తున్నట్టు ఉంటుంది. అలంటి ఫీలింగు నీకు ఏ అమజాను కిండిల్ లోనో, ఒక చిన్నపాటి తెర మీదనో ఎలా లభ్యమవుతుంది ? అదంతా వదిలేయ్.....
ఒక పుస్తకం తెరవగానే దాన్ని కాలాన్ని బట్టి పాపేరుకు పట్టి ఉన్న వాసన నీకు ఆ స్క్రీన్ మీద వస్తుందా ?"
వెధవ తెలివి నా దగ్గర చుపిస్తున్నావ్ కానీ ఒకటి చెప్తా వింటావా ?" "హా ఏంటీ ....? చెప్పు..... "
అమ్మమ్మ : "స్వీట్ షాప్ లో సున్నుండలు బాలేదని, నేను చేసిన సున్నుండలు మాత్రమే ఎందుకు పట్టుకెళ్ళావ్ దేశం కానీ దేశానికి ?"
సుందర్ : "ఏముంది, నువ్వు వాళ్లకన్నా బాగా చేస్తావు కాబట్టి!"
అమ్మమ్మ : "నీ మొహం. తిరగలి లో రెండు రాళ్ళ మధ్య నలిగిన మిణువులకి, మిక్సీ లో వేసేసిన మిణువులకి తేడా అది. తిరగలి లో వేసినప్పుడే వాటి రుచి అద్భుతం గా ఉంటుంది."
"అర్ధమయ్యింది అమ్మమ్మా అర్ధమయ్యింది. పుస్తకాలే చదువుతా . అదే నువ్వు చెప్పినట్టే పేపరు పుస్తకాలే చదువుతా..... ఆ రోజుల్లోనే M.A చేసావ్, కొన్ని మంచి ఇంగ్లీష్ పుస్తకాలుంటే చెప్పరాదు ?"
చెప్తా చెప్తా, నాకేం కర్మ...... ఈ సారి వచ్చినప్పుడు పచ్చళ్ళు, సున్నుండలూ మోసుకెళ్ళకుండా నా షెల్ఫ్ లోని పుస్తకాలు కొన్ని పట్టుకెళ్ళు.
సుందర్ : "వద్దు అమ్మమ్మ, ఆ షెల్ఫ్ అలాగే ఉండని. నాకు అసలు చిన్నప్పటినుండీ పుస్తకాలు చదవాలన్న ఆలోచన వచ్చిందే ఆ షెల్ఫు ని చూసి."
అమ్మమ్మ : హహ్హహ్హ......