ఎక్కువ సమయం మనం దేని గురించి ఆలోచిస్తామో అదే మనం. మనకు రెగ్యులర్ గా ఓ వంద ఆలోచనలు వస్తే 95 మనకున్న పాజిటివ్ క్వాలిటీస్ ని కాక 5 లోపాల గురించి మాత్రమే ఆలోచించి బాధపడితే 95 గొప్ప క్వాలిటీస్ ని కోల్పోతాము. కట్టా సింహాచలం గారు.. పేద కుటుంబం నుండి వచ్చి ఐఏఎస్ ఆఫీసర్ గా ఎవరెస్ట్ శిఖరంలాంటి లక్ష్యాన్ని అందుకున్న వ్యక్తి. ఆయనకు చూపు లేకపోవడానికి గల ప్రధాన కారణం పేదరికం, సింహాచలం గారు తల్లి కడుపులో ఉండగా ఆర్ధిక కారణాల వల్ల సరైన పౌష్టికాహారం తీసుకోలేకపోవడం వల్ల పుట్టుకతోనే అంధత్వం లభించింది. పేదరికం, అంధత్వం ఈ రెండు అప్పుడప్పుడు స్పీడ్ బ్రేకర్ గా మార్గంలో ఎదురుపడినా, మార్గాన్ని మాత్రం పూర్తిగా మూసివేయలేదు. ఇదే నా అడ్డంకి, వీటివల్ల ఈ జన్మలో నేను అనుకున్నది చెయ్యలేను అని మాత్రం సింహాచలం గారు అనుకోలేదు.
దేశాన్ని మార్చడానికి ఏ కోర్స్ ఉత్తమమైనది.? తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలం,గూడపల్లి గ్రామానికి చెందిన సింహాచలం గారి అమ్మ నాన్నలకు ఐదుగురు పిల్లలు, పేదరికం, గ్రామంలో దూరపు చూపు అంతంత మాత్రమే. ఐన గాని ఊహతెలిసిన నాటి నుండి పెద్ద లక్ష్యాలు, పెద్ద ఆలోచనలే. చిన్నతనంలో డాక్టర్ అవ్వాలని అనుకున్నారు. కొన్ని కారణాల వల్ల అది సాధ్యపడదు అని అంగీకరించారు. ఇంటర్మీడియట్ లో హెచ్.ఈ.సి, తర్వాత బిఎ, బీఈడీ చేస్తున్న కాలంలో పదిమందికి సహాయం చేయాలన్న నీ మనస్తత్వానికి ఐఏఎస్ ఐతే సరిగ్గా సరిపోతుందని ఆంధ్ర యూనివర్సిటీలోని ఓ ప్రొఫెసర్ చెప్పడంతో సివిల్స్ సర్వీస్ వైపుగా ప్రయాణం మొదలయ్యింది.
ఐఏఎస్ గా సెలెక్ట్ అయ్యేంతవరకు: 2012లో మొదటిసారి అటెంప్ట్ ఇచ్చారు కానీ సాధ్యపడలేదు, 2014లో రెండొవసారి రాసినప్పుడు సివిల్ సర్వీస్ కు ఎంపికయ్యి ఇండియన్ ట్రేడ్ సర్వీసెస్ లో అసిస్టెంట్ డైరెక్ట్ జనరల్ ఫారెన్ ట్రేడ్ గా సంవత్సరం పాటు ఉద్యోగం చేస్తూనే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కోసం ప్రిపేర్ అయ్యారు. మళ్ళీ 2015లో అటెంప్ట్ ఇచ్చారు, ఈసారి ఇండియన్ రెవిన్యూ సర్వీసెస్ కు సెలెక్ట్ అయ్యారు. 2016లో కూడా రాశారు కానీ ఐఆర్ ఎస్ రావడంతో మరలా ప్రిపేర్ అయ్యారు. ఐతే 2018లో రాసిన పరీక్షలో నెగ్గి తన చిరకాల స్వప్నమైన ఐఏఎస్ ను చేరుకున్నారు.
కట్టా సింహాచలం గారు ముస్సోరిలో శిక్షణ పూర్తిచేసుకుని ప్రస్తుతం విజయనగరం జిల్లాకు అసిస్టెంట్ కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్నారు. ఒకప్పుడు 'కలెక్టర్' అంటే ఎవరో తెలియని ఆ కుటుంబంలో ఇప్పుడు సింహాచలం గారు కలెక్టర్ అవ్వడం ఆ కుటుంబ ఆనందానికి అవధులు లేవు. అమ్మ నాన్నలు, నాగబాబు అనే దగ్గరి బంధువు, ఉపాధ్యాయులు, స్నేహితులు, తనను ఇలా తయారుచేసిన ప్రతి ఒక్క సంఘటన పట్ల సింహాచలం గారు కృతజ్ఞతతో ఉన్నారు. శారీరక బలహీనతలు కానీ, సామాజిక బలహీనతలు కానీ, ఆర్ధిక బలహీనతలు కానీ ఇవన్నీ ఈరోజు రావాల్సింది రేపటికి వాయిదా వేస్తుందేమో కానీ మనమనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏమాత్రమూ ఆటంకం కాదని సింహాచలం గారు తన జీవితం ద్వారా తెలుసుకున్న సత్యం ద్వారా చెబుతారు.