అనగనాగ ఆఫీస్ , ఆ ఆఫీస్ లో విష్ణు అనే ఒక ఉద్యోగి. లోకం లో పని చేసే వాళ్ళు కొందరు అయితే పని నటించే వాళ్ళు ఇంకొందరు. అదృష్టం కొద్ది మనోడు మొదటి రకం , కానీ దురదృష్టం ఏంటి అంటే చుట్టూ పని చేసే చాలా మంది రెండో రకం. మొహమాటం వలలో పడి విష్ణు నా పని నేను చూస్కుంటా , మిగతా వాళ్ళ గురించి నాకెందుకు అనే పద్దతిలోనే రెండు ఏళ్ళు నెట్టుకొచ్చేసాడు. ఏ ఇబ్బంది రానంత వరకు అది మంచి పద్ధతే . అన్ని ప్రశాంతంగా నడుస్తున్నాయి అనే టైం లో పై ఆఫీసర్ నాగేశ్వర రావు నుండి ఆ ఇబ్బంది రానె వచ్చింది.
అప్పటిదాకా ఒక్క మాట కూడా మాట్లాడని రావు గారు సడన్ గా టార్గెట్ చేయడం స్టార్ట్ చేసాడు. విష్ణు కి అర్ధం కాలేదు అలా అని మరి తెలివి తక్కువ వాడు కాదు కదా , ఇటీవలే విష్ణు కి వచ్చిన ప్రమోషన్ అయినా కావచ్చు లేదా రెండు ఏళ్ళు అవ్వడం తో బయటికి వెళ్ళిపోతాడు అనే భయం కూడా కావచ్చు. మన మదిలో ఆలోచనలే అంతు చిక్కనివి , అర్ధం కానివి , ఇంకా వేరే వాళ్ళ మది లో ఆలోచనలు ఎలా చెప్పగలం
ప్రతిసారి లానే పోతేపోనీ , నా పని నేను చేసుకుంటే చాలు అనే ధోరణి లోనే ఉన్నాడు విష్ణు. కానీ ఆ మౌనాన్ని అహంకారం అనుకుని పగ పెంచేసుకున్నాడు. సహా ఉద్యోగులలో ఎవరు తప్పు చేసిన అది నా మీదకి డైవర్ట్ చేసి మానసికంగా ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేసాడు. ఇవన్నీ అలవాటు లేని విష్ణు చాలా డిస్టర్బ్ అయ్యాడు. ఆరోగ్యం పాడైంది. ప్రశాంతమైన నిద్ర కూడా గందరగోళంగా మారింది . తప్పు చేసి పడిన నింద బరువుగా ఉన్న నీకున్న కారణం వాడుకుని మోయచ్చు. ఏ తప్పు చేయని మనిషి మీద వేసే నింద కొండంత బరువైనది , అది ప్రతి నిమిషం కిందకి తొక్కుతూనే ఉంటుంది. సహించలేము కానీ తప్పట్లేదు.
"మారడానికి ఉద్యోగాలు , అవకాశాలు చాలానే ఉన్నాయ్ , కానీ ఇపుడున్న ఉద్యోగం , వాడు సంపాదించుకున్న ప్రమోషన్ , అలవాటు అయినా వాతావరణం ఇవన్నీ వదిలేసి మారాలన్న ఆలోచనకి కారణం ఎవరు ? వాడి అహాన్ని తీర్చడానికి , వాడి పెట్టిన బాధలకి తలవంచి వెళ్తే , మళ్లీ ఇదే పరిస్థితి జీవితం లో వస్తే ఇలానే పారిపోవాలా ? నా తప్పు లేకున్నా తప్పుకోవాల్సిన అవసరం నాకేంటి ? నీ స్వార్ధం కోసం వేరే వాళ్ళని బాధ పెట్టె హక్కు నీకుందా ? "
వాడ్ని మార్చాలనుకోడం అవివేకం , కానీ నేను మారకపోడం అంత కంటే దారుణం. సమస్య వచ్చిన ప్రతీసారి పారిపోతే , ఆ సమస్య వెంట పడుతూనే ఉంటుంది , నుంచుని ఎదుర్కొని చూడు , ఈరోజు నేర్చుకోకపోయినా , ఏదోక రోజు నేర్చుకుంటావ్ , మనిషిలా స్థాయి , ఓర్పు లో ఒక మెట్టు పైకి ఎక్కుతావ్.
ఇంకొక రెండు నెలలు అక్కడే ఉన్నాడు విష్ణు , ప్రతిరోజు మానసిక బాధ , వేసే నిందలు పడుతూనే ఉన్నాయ్. కానీ ఈసారి విష్ణు పనికి వాడి గొంతు తోడు అయ్యింది. ప్రతి రోజు దాని గళం పెరుగుతూ వచ్చింది. రెండు నెలల తరువాత కావాల్సినవి అన్ని దగ్గర పెట్టుకుని , రావు గారు పై ఆఫీసర్ రామ్ మోహన్ గారితో మీటింగ్ పెట్టాడు విష్ణు. చేసిన పని , దానికి సాక్ష్యాలు , రావు గారు అన్న మాటలు వాటి రికార్డింగ్లు అన్ని ముందు పెట్టేసాడు. చూసారు , పరిశీలించారు. ఆ తరువాత రోజు రావు గారు ఆఫీస్ లో కనపడలేదు, తీసేసారో, మానేశాడో తెలీదు . ఆ తరువాత నెల ఒక మంచి కంపెనీ లో జాబ్ వచ్చింది , అపుడు మనస్ఫూర్తిగా వెళ్లగలిగాడు విష్ణు . అధికారపు అహంకారం ఎప్పటికి శాశ్వతం కాదు , అధికారాన్ని మంచికి ఉపోయోగిస్తే మంచి , చెడుకి ఉపోయిగిస్తే చెడు.
మౌనం ప్రశాంతమే , కానీ చేతకానితనం కాదు. ఆగ్రహం వస్తే ప్రళయమై ముంచేసే శక్తి కూడా ఉంది దానికి. కానీ విష్ణు కి అర్ధం అయింది ఏంటంటే జీవితం లో ఎదగాలంటే ఎన్నో బాధలు పడాలి , అనుభవమే అందమైనది అర్ధవంతమైనది. అవన్నీ మంచి బాధలే , లోకాన్ని తెలియజేస్తాయి.
భయంకరమైన వాన లేనిదే అందమైన ఇంద్రధనుస్సు వస్తుందా ? రాయి తో కొట్టి కొట్టి సాన పెట్టకుండానే పదునైన గొడ్డలి తయారవుతుందా?
నువ్వు జీవితం లో ఎన్ని బాధలు పడిన , అవి నిన్ను ఒక మంచి చోటుకి తీస్కుని వెళ్ళడానికే , ఏది శాశ్వతం కాదు అన్ని మన మంచికే.