జగతిని రక్షించే జీవనది ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి పరవళ్ళతో చేరుకోవాలి లేదంటే ప్రాణి మనుగడే ప్రశ్నార్దకమవుతుంది. జీవనదులు మాత్రమే కాదు మన సాంస్కృతిక కళలు ఒకతరం నుండి మరో తరానికి ప్రయాణం సాగించాలి.. కళలు మనిషి మనసుకు స్వాంతన చేకూర్చి మన ఉన్నతికి కారణమవుతాయి. సంగీతం, నాట్యం, పేయింటింగ్ మొదలైన వాటిని నేర్చుకోవాలని ఉన్నా డబ్బు లేకపోవడం ఒక సమస్య ఐతే టాలెంట్ ఉన్నా ఆ టాలెంట్ నీ ప్రేక్షకుల ముందు ప్రదర్శించలేకపోవడం(ఆడిటోరియమ్ లకు రెంట్ చెల్లించలేక) మరొక సమస్య. ఈ రెండు సమస్యలను అధిగమించడానికి స్వతహాగ నాట్యకారిణీలు ఐన ఆనంద, ప్రియ గారు "ఆనంద ప్రియ" అనే సంస్థను ఏర్పాటు చేశారు.
నాకిప్పటికి అర్ధం కాదు భారతీయులందరూ పరాయి వాళ్ళ కబంధ హస్తాల నుండి విముక్తులైనా గాని ఇప్పటికి ప్రతి ఒక్క రంగంలోను వెనుకబడి ఉన్నాము. ప్రతి నాట్య ప్రదర్శణకు, సంగీత కచేరికి ఈ నాయకులు కళా పోషకులులా ఠీవిగా వస్తుంటారు కాని తీరా సహాయం విషయంలో, కళను, కళాకారుల విషయంలో మాత్రం అంతటి హీరోయిజాన్ని చూపించలేరు. ప్రభుత్వం, నాయకులు ముందుకు రాకుంటే ఏంటి మనమే మన వారసత్వాన్ని కొనసాగిద్దామని ఆనంద, ప్రియ గారు కళను విస్తరింపజేస్తున్నారు. తమ దగ్గరికి వచ్చిన వారికి మాత్రమే కాదు వివిధ గ్రామాల వద్దకు చేరుకుని అమితాసక్తిని చూపించే పిల్లలను చేరదీసి కళలలో మంచి ప్రావీణ్యం సిద్ధించేలా కృషిచేస్తున్నారు.
కళ ద్వారా డబ్బు సంపాధించుకోవాలనుకుంటే నాట్యంలో ప్రావీణ్యురాలైన ఆనంద ప్రియ గార్లు ప్రదర్శణల ద్వారానో, శిక్షణ ద్వారానో ఎంతైనా సంపాధించేవారు కాని వారి తాపత్రయం వేరు కాబట్టే ఈరోజు తమలాంటి వారిని ఎంతోమందిని సమజానికి అందించే మహా యజ్ఞాన్ని చేస్తున్నారు. ఈ రకమైన ఆలోచనతో "ఆనందప్రియ" సంస్థను స్థాపించిననాటి నుండి ఇప్పటి వరకు కూడా ఎంతోమంది నాట్య, సంగీత, నాటక కళాకారులు తమను చేరుకుంటున్నారు.. తమ వంతుగా ఉచితంగ శిక్షణ, వేదికలను కల్పిస్తూ తమదైన శైళిలో తమవంతు బాధ్యతను నెరవేరుస్తున్నారు.