ఆంజనేయ స్వామి వారి దేవాలయాలలో తెలంగాణలో కొండగట్టు దేవాలయం అతి పెద్ద గుడిగా పరిగణిస్తే ఆంధ్రప్రదేశ్ లో నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవాలయం ప్రధాన దేవాలయాలలో ఒకటిగా పూజలందుకుంటున్నారు. నెట్టికంటి అంటే ఒక కన్ను ఉన్న వ్యక్తి అని అర్ధం. ఇక్కడి ఆంజనేయ స్వామి వారి ప్రతిమకు కుడి కన్ను మాత్రమే ఉండడం వల్ల ఈ గుడికి ఈ పేరు వచ్చింది. ఈ గుడి అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణం నుండి 13కిలోమీటర్ల దూరంలో ఉన్నది. పట్టణాలకు కాస్త దూరంగా ఉండడం వల్ల ఈ గుడి, ఆ గుడిని చేరుకునే దారి కూడా అతి ప్రశాంతంగా ఉంటుంది.


ఈ దివ్య క్షేత్రానికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది. విజయనగర సామ్రజ్య చక్రవర్తి ఐన శ్రీ కృష్ణ దేవరాయల వారికి కుహూ అనే గండం వచ్చింది. ఈ గండం వల్ల భవిషత్తులో అధిక ప్రమాదాలు ఏర్పడుతాయని తెలుసుకుంటారు. ఈ గండాన్ని తప్పించడానికి వ్యాసరాయలు విజయనగర సింహాసనాన్ని కొన్ని గంటల పాటు అధిష్టించి వ్యాసరాయలు సూచన మేరకు కృష్ణదేవరాయల వారు ధర్మ ప్రచారం చేశారట. అలా గండం గడిచిన తర్వాత వ్యాసరాయల వారు వెళ్ళిన ప్రతి ఊరిలో ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని ఏర్పాటు చేసేవారట. ఒకరోజు ఆంజనేయ స్వామి వ్యాసరాయల వారి కలలోకి వచ్చి ఈ నెట్టికంటి గ్రామంలో ఎండు వేపపుల్ల చిగురించిన ప్రదేశం నాకు చాలా ఇష్టమైన ప్రదేశమని తన ప్రతిమను అక్కడ ప్రతిష్టించమని చెప్పారట. అలా ఆయన ఆజ్ఞ మీదుగ వ్యాసరాయలు ఈ ప్రాంతంలో ఆంజనేయ స్వామి వారి ప్రతిమను ఏర్పాటుచేశారని ఆలయ చరిత్ర ద్వారా తెలుస్తుంది.


ఈ ఆలయం ప్రతిరోజు పండుగ శోభతో వెలిగిపోతుంది. కేవలం కొన్ని నెలలలో మాత్రమే కాకుండా సంవత్సరమంతా భక్తులు వేల సంఖ్యలో దర్శిస్తుంటారు. సంవత్సరానికి దాదాపు 20కోట్ల ఆదాయం వస్తున్న ఈ కోవెలకు ఒక ప్రత్యేకత ఉంది.. ఇక్కడ ప్రతి సంవత్సరం ఒక చర్మకారుడు స్వామి వారికోసం తయారుచేసిన చెప్పులను కానుకగా సమర్పిస్తారు. రాత్రి సమర్పించిన పాదరక్షలను ఉదయం పరిశీలిస్తే అవి కొన్నినెలలుగా వాడినట్టుగా అరిగిపోయి దుమ్ము పట్టి ఉంటాయి. స్వామి వారు రాత్రి పూట ఆ చెప్పులు వేసుకుని విహారయాత్రకు వెళ్ళివస్తారని భక్తుల నమ్మకం. ఈ వాయుదేవుడిని దర్శించడానికి, పూజించడానికి రాయలసీమ ప్రాంతం నుండే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల నుండి భక్తులు తరలివస్తారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.