ముఖ్యమంత్రి గారి ఫేవరెట్:
ఇప్పటి మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు నాటి 1985 కాలంలో సిద్ధిపేట ప్రాంతానికి ఎమ్. ఎల్. ఏ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడంటే అంకాపూర్ చికెన్ స్టార్ హోటల్స్ లో సైతం దొరుకుతున్నాయి కాని అప్పటి పరిస్థితులు వేరు కదా.. ఆయనకు ఎప్పుడు తినాలనిపించినా సిద్ధిపేట నుండి నిజామాబాద్ లోని అంకాపూర్ కు కార్ లో ప్రయాణం చేసి మరి అంకాపూర్ చికెన్ ను ఆస్వాదించేవారు. ఎమ్. ఎల్. ఏ అంటే తన పట్ల వారి పద్దతులు మారే అవకాశం ఉందని "నేను జర్నలిస్ట్" అని అంకాపూర్ వాస్తవ్యులకు చెప్పేవారట.
అంకాపూర్ మసాలా:
ప్రతి ఊరిలో నాటు కోడి దొరుకుతుంది, అద్భుతంగా వండి వడ్డించే వంట మనుషులు కూడా ఉంటారు. కాని అంకాపూర్ చికెన్ కు మిగిలిన సాధారణ చికెన్ కర్రీని వేరుచేసేది మాత్రం అప్పటికప్పుడు తాజాగా రోట్లో దంచిన అల్లం వెల్లుల్లి, ధనియాల పొడి, అన్ని దినుసులను సమంగా రంగరించడానికి కల్వంలో దంచిన పల్లీల పొడి, ఎండు కొబ్బరి సాజీరా, లవంగాలు మొదలైన వాటితో ఈ మసాలను తయారుచేస్తారు. ఈ మసాలా నాటుకోడికి పట్టించడంతో ఈ రెండింటి కాంబినేషన్ లో నుండి అంకాపూర్ చికెన్ బ్రాన్డ్ దేశమంతటికీ చేరుకుంది.
అంకాపూర్ బ్రాన్డ్:
నిజామాబాద్ జిల్లా లోని అంకాపూర్ గ్రామం విత్తనాల ఉత్పత్తిలో గొప్ప ప్రగతిని సాధించింది. అలాగే చికెన్ విషయంలోనూ.. అంకాపూర్ కు ఇంతటి బ్రాన్డ్ గుర్తింపు రావడానికి గల ప్రధాన కారణం పెద్ద రామాగౌడ్ గారు. రామా గౌడ్ గారు దీనిని 40 సంవత్సరాల క్రితం ఈ రుచిని అక్కడి గ్రామస్థులకు పరిచయం చేశారు. ఆ రుచి గ్రామస్థులకు విపరీతంగా నచ్చడంతో గ్రామస్థుల కోరిక మేరకు అదే ఊరిలో ఓ చిన్నపాటి హోటల్ ను కూడా స్టార్ట్ చేశారు. అదే రుచిని మిగిలిన కొంతమంది గ్రామస్థులు నేర్చుకుని వారు తర్వాతి కాలంలో హోటల్ ను స్థాపించారు. ఇప్పటికీ రామాగౌడ్ కుమారులు అంకాపూర్ లోనే భోజన ప్రియుల ఆకలిని తీరుస్తున్నారు. ఇక్కడికి చుట్టు ప్రక్కల గ్రామ ప్రజలు మాత్రమే కాదండి. వివిధ జిల్లాల నుండి కూడా భోజనప్రియులు వస్తూ ఉంటారు. వీరిలో సామాన్యుల నుండి మంత్రులు, ఎమ్. ఎల్. ఏ లు కూడా ఉన్నారు.
విదేశాలలో సైతం:
ప్రస్తుతం అంకాపూర్ ఇంకా పరిసర ప్రాంతంలో దాదాపు 70 ఫుడ్ సెంటర్లు అంకాపూర్ చికెన్ ను తయారుచేస్తున్నారు. ఇక్కడి నుండి వివిధ జిల్లాలకు, భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు పార్సిల్ల రూపంలో వెళుతుంటాయి. ఈ అంకాపూర్ చికెన్ రెసిపీ తెలుసున్న కొంతమంది వ్యక్తులు హైదరాబాద్, బెంగళూర్ లాంటి మహానగరాల లో రెస్టారెంట్స్ స్థాపించారు. ఆ తర్వాత విదేశాలలో సైతం తెలుగువారుండే కొన్ని ముఖ్య ప్రాంతాలలో ఈ తెలంగాణ బ్రాన్డ్ చికెన్ ను తయారుచేస్తున్నారు.
అందుబాటులో ఫలానా హోటల్ లో అంకాపూర్ చికెన్ దొరుకుతుంది అక్కడా భోజనం చేద్దాం అని అనుకుంటే మీ ఆకలి తీరదండి. అసలైన అంకాపూర్ చికెన్ రుచి చూడాలంటే అంకాపూర్ కు వెళ్లి చూస్తేనే కాని తెలియదు. ఈ ఊరి షాపులలోని వంటవారు సంవత్సరాల తరబడి చికెన్ చేసి రాటుదేలి పోయారు. అది కాక మా ఊరికి మంచి పేరు రావాలి అనే కాంక్ష కూడా ఉండడం వల్ల ఆ చికెన్ ను మరింత రుచికరంగా తయారుచేస్తుంటారు.