"జీవితం నందనవనం కావాలంటే.." అని మొదలుపెడుతూ సూక్తులు ప్రతిఒక్కరూ చెప్పగలుగుతారు, చెప్పే వ్యక్తి వ్యక్తిత్వాన్ని బట్టే ఆ మాట హృదయంలోనికి నేరుగా చేరుకుంటుంది. అక్కినేని నాగేశ్వరరావు రావు గారు.. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో కీర్తి శిఖరాన్ని అందుకున్న దృవతార. 75 సంవత్సరాలు పాటు వివిధ పాత్రలలో నటించి, కోట్లాదిమంది అభిమానుల హృదయాలలో నిలిచి పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషన్ తో పాటుగా, గౌరవ డాక్టరేట్, దాదా సాహెబ్ పాల్కే పురస్కారాలను స్వీకరించారు. నాగేశ్వరరావు గారి జీవితంలోనూ ఎన్నో ఆటుపోటులను చవిచూశారు. కాని ఆయనకున్న విశేషమైన వ్యక్తిత్వంతో అక్కడే ఆగిపోలేదు. ఆయన నటనలో మార్గదర్శి, స్టూడియో అధినేతగా మార్గదర్శి, ఒక తండ్రిగా, తాతగా మార్గదర్శి, అన్నిటికీ మించి ఓ మనిషిగా మరెందరికో మార్గదర్శి.. నాగేశ్వరరావు గారు ఎంతో ఇష్టంగా రాసుకున్న "అ ఆ లు.. అదే అక్కినేని ఆలోచనలు" పుస్తకంలో కొన్ని జీవిత సత్యాలను తెలుసుకుందాం.
1. భావానికి సరైన తాత్పర్యం చెప్పేవాణ్ణి పండితుడు అనుకుంటాం అప్పుడప్పుడు. శబ్దానికి విపరీతార్ధం తీసేవాడిని ప్రకాండుడు అనుకుంటున్నాం ఇప్పుడిప్పుడు.
2. మంచిని చెప్పేవాడిని మార్గదర్శి అనుకునే వాడొకప్పుడు మానవుడు. చెడును బోధించేవాడిని స్నేహితుడు అనుకుంటున్నాడిప్పుడు.
3. అర్ధం చేసుకోలేని వాళ్లకు - అపార్ధాలు గోచరిస్తాయి. అపార్ధం చేసుకున్న వారి మాటలకు - అర్ధాలు వెదకడం అనవసరం.
4. నలుగురు ఏదో అన్నారని నూతిలో పడబోకు. నూతిలో పడి నీలాపనిందను - నిజం చేయకు.
5. నిజం చాటడానికి బ్రతక ప్రయత్నించకు. నిజాయితీగా బ్రతకడానికే - నిజంగా ప్రయత్నించు.
6. త్యాగిబుద్ధితో దేశానికి సేవచేసే వాడొకప్పుడు మానవుడు. బుద్ధినే త్యాగం చేసి దేశాన్ని దోచుకుంటున్నాడు ఇప్పుడు.
7. వ్రేలిని కాపాడడానికి గోరు పుట్టింది. గోరు ఎక్కువగా పెరిగితే ఎదురుదెబ్బ తింటుంది. ఏది ఎక్కువైనా ఎదో దెబ్బ తగలక మానదు.
8. లాగుకు ఒక్క గుండి వుడితే గుర్తుచేయ ప్రయతించు. గుండీలన్నీ ఊడతీసుకు తిరిగేవాడికి చెప్పడం దేనికి.? నవ్వుకుని ఊరుకో!!
9. బ్రతికి బావుకునేదిలేదని చావబోకు, చచ్చి సాధించేదిలేదని బ్రతకబోకు. బ్రతికి జీవితాన్ని సాధించు చనిపోయి కలకాలం జీవించు.
10. సద్విమర్శల్ని సవినయంగా సన్మానించేవాడొకప్పుడు మానవుడు. కువిమర్శల్ని గుంభనంగా చేరదీసి కులుకుతున్నాడిప్పుడు.
11. డబ్బు సంపాదించడం అంటే నాకు గౌరవం. ఖర్చు చేయడమంటే మిత గౌరవం. సద్వినియోగం చేయడమంటే అతి గౌరవం.
12. జీవించడం తెలియకపోయినా జీవితం అంటే ఏమిటో తెలియాలి. జీవితమంటే ఏమిటో తెలియకపోతే జీవించడమంటూ అసలే తెలియదు.
13. జీవితమంటే సప్తవ్యసనాల పుట్ట. ఒక్క వ్యాసనానికి లొంగిపోయేవాడు వట్టి మానవుడు. సప్త వ్యసనాలకు లొంగనివాడు మానవాతీతుడు. జీవితాన్ని తరచి - చూసేవాడే నిజమైన మానవుడు.
14. ముందుకు వెళ్ళి సాధించేదేమిటో తెలియనినాకు వెళ్ళిపోయిన తరువాత మిగిల్చిందేమిటో తెలియాలి మీకు.
15. నన్ను బ్రతికిస్తూ చంపేది చంపి బ్రతికించేది కాలమే. అవును రాబోయే కాలమే తేల్చుకోవాలి.
16. ఎంతో మందికి, మనసు మహా చెడ్డది. కొద్ది మందికి మనస్సు మంచిది. ఒకొక్కరి దగ్గర ఒక్కోరకంగా మసులుతుంది. అందరికీ అన్ని రకాల ఆలోచనల్ని ఇస్తుంది. మంచికీ - చెడ్డకీ పోటీ పెడుతుంది. ప్రపంచానికే ముప్పుతెచ్చి పెడుతుంది. అయినా నాకెందుకో అది మంచిది.
17. స్నేహం కోసం స్నేహం చేసేవారొకప్పుడు. స్నేహం కోసం ప్రాణాలిచ్చేవారొకప్పుడు. స్వార్ధంకోసం స్నేహం చేస్తున్నారిప్పుడు. స్వార్ధం కోసం స్నేహానికి తిలోదకాలిస్తున్నారిప్పుడు.
18. శక్తివంతమైన మెదడు మనిషికున్న మహావరం. సారవంతమైన మట్టి దేశానికున్న మంచి సంపద. మెదడు నిండా మట్టి పేర్చుకొని మనిషి శక్తిహీనుడయ్యాడు. మట్టిని మందులతో కలుషితం చేసి నిస్సారంగా మారుస్తున్నాడు.
19. మానవునికి పవిత్రత సాధించడం సామాన్యమైన పని కాదు. కనీసం పవిత్రంగా వుండాలని ఆలోచించడం సలక్షణమైన పని.
20. నువ్వు మంచివాడివని అందరూ అనుకోవాలని ఆలోచించకు. చెడు చేయకూడదని ఆలోచించు. నీకు తెలియకుండానే మంచివాడివే అవుతావు.
21. ఓటు విలువ తెలుసుకోలేని అజ్ఞాని కాళ్ళు పట్టుకోవడం గాడిద కాళ్ళు పట్టుకున్నట్టే. ఓటు విలువ తెలుసుకున్న విజ్ఞానిని పలుకరించవలసిన పనిలేదు కూడా, ఏ విజ్ఞానికి ఓటు వెయ్యాలో తెలుసుకోగల విజ్ఞుడు కాబట్టి.
22. నీతులు చెప్పేవారు - నియమాలు తెలిసినవారూ, న్యాయాలు - ధర్మాలు నిర్ణయించే వారు కాదు మనకు కావాల్సినది. ఇవన్నీ వారు పాటించి, మనల్ని కూడా పాటించేసే వారూ మనల్ని ముందుకు నడిపేవారూ మనకు కావాలి.
23. ఏ నీరు లేనిది మనిషి జీవించలేడో ఆ నీరే మనిషిని మట్టి పాలుచేస్తుంది. ఏ నిప్పులేనిదే మనిషి వెలుగు చూడలేడో ఆ నిప్పే మనిషిని బూడిద పాలు చేస్తుంది. ఏ డబ్బు లేనిదే మనిషికి మనుగడ లేదో ఆ డబ్బు దాహమే మనిషిని సర్వనాశనం చేస్తుంది. ఏ ప్రజల అభిమానం మనిషిని అందలమెక్కిస్తుందో ఆ ప్రజల దురభిమానమే మనిషిని అధః పాతాళానికి తొక్కుతుంది.
24. ఎదుటి వారి విజయాన్ని వారి అదృష్టంగా చిత్రిస్తాం. అపజయాన్ని వారి తెలివిలేని తనాన్నిగా ఊహిస్తాం. మన విజయాన్ని మన తెలివి కృషిగా చిత్రిస్తాం. మన అపజయాన్ని ప్రజా భావదారిద్ర్యంగా భావిస్తాం. ఈ భావన మారేవరకూ ఎదుటివారి గొప్పదనాన్ని గుర్తించం, మన లోపాల్ని గ్రహించం.
25. ఎదుటివారి గొప్పదనాన్ని తెలుసుకోలేనివాడు.. తన లోపాన్ని గ్రహించలేనివాడు తెలివి తక్కువవాడు. ముందుకుపోలేడు గమ్యాన్ని గ్రహించలేడు.