Contributed By Bold Writes
గుప్పెడు మట్టి, చిటికెడు ప్రాణం, మూడొంతుల నీరు, ఆకాశమంత ఆశ, నిలువెత్తు స్వార్థం, ఆకలితో పోరాటం ఇది మనిషి. ఏ బ్రహ్మ కలం నుండి జారిపడిన పదం ఇది, ఏ బ్రహ్మ సృష్టించిన జన్మ ఇది, పిలవడానికే సిగ్గు పడే పేరు కదా.. తలుచుకోవాటనికే పనికిరాని బూతు పదం కదా..! మరి ఎంతో మంది విలాసాల వస్తువైంది, కొన్ని తలరాతలు మార్చే సిరా అయింది.
•••••••••••• బాల్యం బానిసత్వంలో, వృద్దాప్యం యాచకత్వంలో, నడుమ ఎగిరెగిరి పడే యవ్వనం, నిర్లక్ష్యపు అహంకారంలో, నిలువెత్తు హృదయ శిల్పమెప్పుడో సమాధిగా మారింది. పాపమొక భోగం, ఆడతనమొక శాపం, దహించు రోగం... అరణ్య రోదనం, తనువు పుండై... ఒకరికి పండై, నేను శవమై... ఒకరికి వశమై, శిలగా మారి.. తనువుని పంచి, నాలుగు నోట్ల మధ్య నలుగుతున్న అస్తిత్వం.. సమాజ కోరల మధ్య ఉరేయబడ్డ మానవత్వం, ఏనాడో వెలేయబడ్డ చీకటి ప్రపంచ జ్వాలలం. ఆఖరి శ్వాసల ఉత్తేజం లేని ఉచ్వాసం, నిస్సత్తువ నిచ్వాసం.. రేపన్నది లేనేలేదు బయట ప్రపంచమొక మధ్యరాత్రి పీడ కల, నీలినీడల ఆనవాళ్లు, కాల రాత్రుల ఆర్తనాదాలు, గమనం లేని గాయాల శిథిలాలు. నేనొక అర్ధరాత్రి స్వతంత్రం.. నాదొక అంటరాని వసంతం.
గుడి లేదు కానీ, ఊరందరికీ నా ఒడి ఉంది, ఎవ్వరికీ వినిపించని ఎద సడి ఉంది, నా కడుపు ఖాళీనేమో కానీ, అందరి " ఆకలి " తీర్చే అందం ఉంది..! చెప్పినా ఏ చెవికి ఎక్కని చేదు నిజాల చరిత్ర ఉంది..!! చీకటి పడితే కానీ, మా బ్రతుకుల్లోకి వెలుగు రాదు.. స్వతంత్రంగా అర్ధరాత్రి నడిరోడ్డుపై తిరిగేది మేమే కావొచ్చు, అది కూడా మా శరీరాలు అమ్ముకోవడానికి.
•••••••••••••• ఏది నిజం? ఏది అబద్దం?? గెలుపో ఓటమో.. పుట్టింది మొదలు తుదకు ఏది మిగులుతుందో! సత్యమో అసత్యమో.. బ్రతుకు పాట పాడుతూ పడక సుఖపు బాటలో! అడుగు అడుగు కదుపుతూ కూడు లేక కుదుపుతూ డొక్కల్లో ఖాళీతనం, దిక్కులంతా బేలతనం కులమేది? మతమేది? నువ్వేది? నేనేది? నీదేది? నాదేది? అన్నీ "ఆకలి" కడుపులే కొండల్లో కోనల్లో...రేయేది? పగలేది? నడిచేటి దారుల్లో... మేడేది? పాకేది? నింగి నేల ఏకమైన నీడ కోసమేగా పోరాటం ఆశేది? భాషేది?... అంతరంగపు ఘోషేది అనునిత్యపు హోరులో మనిషితనపు మూర్ఖత్వం మంటలేన్నో రేపుతుంటే మనసులంతా మట్టే చివరికి మిగిలేది గుప్పెడు బూడిదే.. అయినా లోకానికి నేను చేసేది తప్పు, కానీ ఇది చేయనిదే తప్పదు, కడుపు నింపుకోవటానికి, నన్ను నేను ఖర్చు పెట్టుకుంటున్నా.. నలుగుతూ బ్రతికి, బ్రతికిస్తూ చస్తున్నా.. నాలుగు మెతుకులకై దేహాన్ని అమ్ముకుంటున్నా..
ఐదు నిమిషాల సుఖం కోసం, ఎంతో మంది తమ వ్యక్తిత్వాన్ని అమ్మేసుకుంటున్నారు. మా కాళ్ళ మధ్యకు వచ్చే వారే కానీ మా బాధల్ని అర్థం చేసుకొనే వారు కాదు, మా స్తనాలపై బరువు మోసే వాళ్ళమే కానీ, దాని వెనుక ఎద రోదన వినే వారు కాదు, మా మనుసెరగని మనుషులకి, కనిపించేది మా ఒళ్ళే.. మాటల మూటలెన్నో మాకిచ్చే అందరూ మాములోల్లే, మల్లెపూల ఘుమ ఘుమల మత్తులో, మా తనువు పైన స్వారీ చేసే మీసాలు, ఘనకార్యం ఎదో చేసిన గర్వంతో, నాట్యమాడు తోడేళ్ళ వేళ్ళు, గుట్టు చప్పుడు కాకుండా తలగడలపై పొంగే మా కన్నీళ్ళు.
పచ్చ నోటుపై ఉన్న ఓ బోసి నవ్వుల తాతా, పడపు వృత్తిలో ఉండటం మేము రాసుకున్న తలరాతా? మా కడుపు కాలే కష్టంలో పోషించే వారుండరు కానీ, దూషించడానికి ఎంతమందికి తీరికో! మర మనుషుల్లా బ్రతికే మాకు, మాది ఆడ పుటకే అని తెలిపే సిగ్గు ఏడ ఉందో? పైట జార్చిన మొదటి రోజునే, మూగబోయిన నా అంతరాత్మకి మాటలోస్తే ఎన్ని మాటలు అంటుందో?
••••••• కలల రాజ్యాలేలే మీకు ఒక రాత్రికే రాణులం. మీ కామం కరువు తీరాక కరిగే కొవ్వొత్తులం. నాలుగ్గోడల మధ్యన నలిగే మా బ్రతుకుల్లో నామ మాత్రంగా అయిన సుఖ సంతోషాలుండవ్.. ఇన్ని బాధలకోర్చీ, మీ సుఖానికి చిరునామా అవుతూ, బ్రతకలేక మా మానాన్ని అమ్ముకుంటుంటే, ఇంకా చిన్న చూపేనా!! ఎడతెగని ఈ ఆలోచనలు ఎందుకొస్తాయో? మార్పేమీ ఉండదని తెలిసి మదినేందుకు కోస్తాయో? నాకోసం నేను పడుకుని ఎన్నాళ్ళయిందో!! ఆడది కనిపిస్తే ఎగబడిపోతూ, వేశ్యా అంటూ వేలెత్తి చూపే మీరా ఎంగిలి మనుషులు?? మేమా?? అంగట్లో నిత్య అవయవదానం చేసే అందాల అవమానం మేము. బ్రతుకు కొరకు, బజారు వెంట పోయాము, భరించలేక బాధితుల్లా కూర్చున్నాము...
నేనొక అర్ధరాత్రి స్వతంత్రం, నాదొక అంటరాని వసంతం.