కొన్ని మాటలు వింటేనే ఎంతో మధురంగా అనిపిస్తాయి , సినిమాలో సీన్/సన్నివేశం లాగానే పుస్తకాలలో కూడా పరిస్థితులకి , ఊహలకి అనుగుణంగా అందంగా రాస్తారు , ఒక భావాన్నిని సరిగ్గా వ్యక్తపరచడం చాలా మంది వల్ల కాదు, వాటిలో చాలా భావాల్ని చక్కగా విడమరిచి పదాలలో అల్లి మనకి ఇచ్చారు ఎందరో తెలుగు కవులు , అందులో ఒకరు డా కేశవ రెడ్డి గారు , వృత్తిపరంగా డాక్టర్ అయినా ఆయన రచనలు చాలా ప్రఖ్యాతిని పొందాయి , ఆయన రాసిన నవల అయిన “అతడు అడివిని జయించాడు” 1988 లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ నవలగా ఎంపిక చేయబడింది,ఆ తరువాత తెలుగు సాహిత్యంలో ఈ నవలకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం సంపాందించి పెట్టుకుంది .
ఈ నవల మన కార్తీ నటించిన ఖైదీ సినిమా లాగా సాయంత్రం మొదలు పెడితే ఉదయం కల్లా అయిపోతుంది , కానీ కార్తీ లాగా ఇక్కడ కమర్షియల్ హీరో కూడా లేడు, ఉన్నదల్లా ఒక ముసలి తాత , ఆయన ముద్దుగా పెంచుకుంటున్న తన సుక్క పందులు.
అసలొక మనిషితో తనలో తను మాట్లాడుకున్న మాటలతో ఒక కథ అల్లడం మాములు విషయం కాదు . ఈ నవలలో , ముసలివాడు తను ఎంతో ముద్దుగా పెంచుకుంటున్న పందులలో ఒకటి అడివిలో తప్పిపోతుంది , దాన్ని వెతకడానికై ఒంట్లో నిలువెత్తు బలంలేకపోయిన , క్రూర మృగాలు నిండిన అడివిలో గాలించడానికి బయలుదేరతాడు, మరుసటి రోజుకి తిరిగొచ్చాడా? తన పంది తనకి దొరికిందా ? అసలా ఆ రాత్రి ఎం జరిగింది అనేదే మిగతా కథ, ఈ సావాసంలో ముసలివాడు తను జీవితంలో ఎదురుకొన్న సమస్యలు అన్ని గుర్తు చేస్కుంటూ అడుగడుగుకి ధైర్యం తెచ్చుకుంటూ , చేసిన సాహసాలు , గెలిచిన ఆలోచనలు, ఓడిపోయిన యుద్ధాలు ,అన్ని కలిపి ఒక 115 పేజీలలో రచయిత మనకి వివరించారు.
జీవిత పాఠాలు కథలనుండో, కలం నుండో రావు , కాలం నుండి వస్తాయి, అలానే ఈ కథలో ముసలి వాడు కాలం నుండి నేర్చుకున్న పాఠాలని వాడుకొని అడివి నుండి తప్పించుకుంటాడు , కానీ ఒక రాత్రి ఖరీదు ఎన్ని మధుర జ్ఞాపకాల త్యాగమో అతనికి మాత్రమే తెలుసు.
అంత చిన్న కథాంశాన్ని కేశవ రెడ్డి గారు ఆయన వర్ణన తో చాలా ఆసక్తికరంగా మలిచారు. నవల
రచయిత ముసలివాడిని , ఆయనకు ఎదురైనా పరిస్థుతలని హారం లో ముత్యం అమర్చినట్టు ఎంతో అందంగా అర్దవంతంగా రాసారు.తెలుగు భాష తియ్యదనం వింటే తెలుస్తుంది కానీ దాని అసలైన మధుర భావం చదివితే తప్ప అనుభవించలేం.
అలానే అతడు అడివి జయించాడు అనేది చిన్న కథ అయిన రచయిత దాన్ని రాసిన విధానం , చిన్న సన్నివేశాన్ని కూడా కేశవ రెడ్డి గారు వర్ణించడానికి వాడిన పదాలు ఊహాతీతం , రచయిత ఆలోచనలు ఎంతో స్వచ్చంగా ఉంటాయి , వర్ణించిన చాలా సన్నివేశాలలో నైచ్యం లో ఔన్నత్యం , హేయం లో ప్రియం అనుభూతించారు(The beauty In ugliness )
నవలలో ఆయన సామాన్య పదాలు ఉపోయోగించి వర్ణించిన సన్నివేశాలు ఇంకా వాటి ద్వారా మనకి చెప్పిన ఎన్నో కఠిన నిజాలు.
-
అయిష్టమైన సంభవం భ్రాంతిగాను , ప్రీతిపాత్రమైన భ్రాంతి సంభవంగాను మానవునికి తోచడం కద్దు
-
పక్షికిగాని , జంతువుకి గాని మానవుడు చేయగల మహోపకారం - వాటి మానాన వాటిని వదిలిపెట్టడమే
-
రాజ వీధులలో మధగజంవలె ,ఆకాశంలో కారు మేఘంవలె హుందాతనంతో అతడు సాగుతున్నాడు.
-
బూడిద కింద ఉన్న నిప్పులు గాలి విచినప్పుడల్లా తమ ఉనికిని బయటికి కనబరుస్తున్నాయి
-
సైరంద్రిని కీచకుని బారినుండి తప్పించడానికై వెళ్తున్న భీమసేనునివలె అతడు వేగిర పడుతున్నాడు
-
అమృతప్రాయమైన వెన్నెలలో తడుస్తూ అతడు నిలుచున్నాడు
-
సముద్రం వలె ,భూమివలె పర్వతం వలె మేఘం వలె అతి గంభీరమైనది .ఆ గంభీరతయే దాని సొగసు దాని హంగు
-
చేతినిండా పని ఉంచుకుని, విసుగుని , అలసటను దరిజేరనియ్యడం చాలా అవమానకరం
-
సూర్యుడు లేని ఉదయాన పట్టిన పొగమంచువలె వేదన అతనిని ముమ్మరంగా ఆవరించింది
-
స్నేహకాలం కన్న , స్నేహం లోని తీవ్రతయే ప్రధానం.
-
ఏ మానవుడూ పరిపూర్ణనంగా అదృష్టవంతుడు కాదు , ఏ మానవుడూ తాను వేలుపెట్టిన చోటల్లా విజయుడైరాలేదు
-
ఎండ సూర్యుని నుండి పుడుతుంది , వెన్నెల చంద్రుడి నుండి పుడుతుంది , మరి చీకటి ఎక్కడ నుండి పుడుతుందో?
-
తన దేహం లో వివిధంగాలు ఒక దాని నుండి ఒకటి విడిపోయి ఎక్కడెక్కడో నిర్జీవంగా పడి ఉన్నట్లు అనిపిస్తుంది , కానీ మనసు మాత్రం చితి వలె రగులుతునే ఉంది .
-
బహుశా చీకటికి చావు పుట్టుకులు లేవేమో , అది నిరంతరాయంగా ఉంటుంది కాబోలు.
-
ఎంత విచిత్రం ! రూపురేఖలు కలిగిన దేహం చలన రహితంగా పడి ఉండగా , రూపురేఖలు లేని మనసు పచ్చిక మైదానం లో సీతాకోకచిలుక వలె ఎగురుతూ ఉన్నది!
-
జయాపజయాల సమన్వయ భావమే జీవితం
ఇవి పుస్తకం లో అణువంత మాత్రమే , ఇలాంటి వర్ణనలు ఎన్నో ఉన్నాయి, చదివిన తరువాత మీ అనుభవాన్ని మాతో పంచుకోండి.