అతిథి మానసిక వికలాంగుల కేంద్రం పది సంవత్సరాల క్రితం ఓ మహాన్నత ఆశయం కోసం స్థాపించబడిన స్వచ్చంద సంస్థ. ఈ మహోన్నత ఆశయం వెనుక ఒక విశాదం దాగి ఉంది. సరిగ్గా 20 సంవత్సరాల క్రితం సుజాత గారు తన రెండు సంవత్సరాల పాపతో హైదరాబాద్ కు వెళ్ళారు. కాకపోతే హన్మకొండకు ఒక్కరే రావాలిసి వచ్చింది. రైల్వే స్టేషన్ రద్దీగా ఉంది. కాని ఆ రద్దీనే తన పాలు మరవని కూతురిని కమ్మేస్తుందని అంచనా వేయలేక పోయారు. దాదాపు పది సంవత్సరాల పాటు హైదరాబాద్ తో పాటుగా ఎన్నో ప్రాంతాలు వెతికారు కాని ఎక్కుడా జడ దొరకలేదు.
![](https://cdn.shopify.com/s/files/1/0896/6753/5157/files/25508124_757867984398985_5922944028919823418_n-e1521290012404.jpg)
సుజాత గారు ఎంతో మానసిక వ్యధకు గురైయ్యారు. తనలో ప్రాణం పోసుకున్న ఎక్కడ ఉందో, ఎలా ఉందో, తనని బాగా చూసుకుంటున్నారో లేదోననే ఆలోచనలతో నిత్యం గడిపేవారు. ఏ అమ్మాయిని చూసిన ఈ వయసులో నా కూతురు ఇలా ఉండేదేమోనని ఊహించుకునేవారు. ఈ ప్రయాణంలోనే కొంతమంది మానసిక వికలాంగులను చూడడం జరిగింది. ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా కనీసం వారెవరో వారికే తెలియకుండానే బతుకుతున్న వారిని చూడగానే ఒకవేళ తన కూతురికే ఇలాంటి పరిస్థితి వస్తే ఎలా? తన పాపను వీరిలో చూసుకుని వీరికి సేవచేయాలి అలా ఐనా నా ప్రేమ నా కూతురికి చేరుతుందని భావించారు. తల్లిదండ్రులు లేని, పేద పిల్లలను చేరదీసి 2008 లో ఈ "అతిథి మానసిక వికలాంగుల కేంద్రం" స్థాపించారు.
![](https://cdn.shopify.com/s/files/1/0896/6753/5157/files/25158200_753431374842646_3832870146846223474_n-e1521290028530.jpg)
వీరికి ట్రైనింగ్ ఇవ్వడానికి ఉద్యోగులను నియమిస్తే ప్రేమగా నేర్పిస్తారో లేదోననే భావనతో సుజాత గారే ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకుని మానసిక వికలాంగులకు శిక్షణ ఇస్తున్నారు. ఒకప్పుడు సరిగ్గా మాట్లాడలేని వారు, తమ పనులు వారు చేసుకోలేని వారు కూడా సుజాత మరియు వారి టీంతో ఎంతో మార్పుచెందారు.
![](https://cdn.shopify.com/s/files/1/0896/6753/5157/files/14721662_573367689515683_283266226573789006_n-e1521290042874.jpg)
హన్మకొండ లోని ఈ స్వచ్చంద సంస్థ నిర్వహణ కోసం పూర్తి ఖర్చులను సుజాత గారి కుటుంబమే చూసుకుంటుంది. పది సంవత్సరాలుగా ఇంతటి శ్రమకు సరైన ఫలితమే దక్కింది. మిగిలిన వారి మీద సొంత పనుల కోసం మాత్రమే ఆధారపడపకుండా వారి కుటుంబాన్ని పోషించే స్థాయికి ఎదిగారు. కొవ్వత్తులు తయారుచేయడం, టైలరింగ్, నాట్యం వివిధ రంగాలలో శిక్షణ ద్వారా అందులో కూడా రాణిస్తున్నారు. ఆటల్లో కూడా మిగిలిన వారికి మేము తీసిపోలేమని నిరూపిస్తున్నారు.. 11బంగారు, 17 వెండి, 12 కాంస్య పతకాలు రాష్ట్ర స్థాయిలో సాధించారు. ప్రేమ తలుచుకుంటే సాధించలేనిదంటూ ఏది ఉండదు అని చెప్పుకోవడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఏముంటుందండి.
![](https://cdn.shopify.com/s/files/1/0896/6753/5157/files/20799806_706533789532405_8234186383549912613_n-e1521290057843.jpg)
![](https://cdn.shopify.com/s/files/1/0896/6753/5157/files/FI-8-e1521290069471.jpg)