ఈ మధ్య మా మామయ్య రాజముండ్రి నుండి వస్తూ పూతరేకులు ఒక డబ్బా, మామిడి తాండ్ర ఒక డబ్బా తీసుకొచ్చార్లెండి. ఈ fast foodలు తిని తిని బాగా పిచ్చి పట్టేసిన నాకు ఇలా నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోయే పూతరేకులు, కమ్మకమ్మగా నాకోసమే పుట్టింది అన్నట్టు నా నాలిక మీద తీయ తీయగా, మెత్త మెత్తగా మెలికలు తిరిగే మామిడి తాండ్ర తింటూ ఉంటె అబ్బబ్బ, వెంటనే స్వర్గానికి భూమ్మీది address మన ఆత్రేయపురం అని అర్థమైపోయింది. ఇక ఆగలేక మీకు చెప్పేయాలని ఇలా వచ్చేసాను.
(Photo courtesy : bebakasura.com)
తియ్యతియ్యగా కమ్మకమ్మగా నోట్లో వేసుకోగానే అలా అలా అలా కరిగిపోయే పూతరేకుల గురించి మీరు వినే వుంటారు కదూ?తెల్లోళ్ళకు నోరు తిరగక వాటికి ‘paper sweets’ అని పేరు పెట్టేసార్లెండి. ఈ పూత రేకులు మన అచ్చ తెలుగు సంపద. మన తూర్పు గోదావరి జిల్లాలోని ఆత్రేయపురం ఈ తీయ తీయని పూతరేకులకు, కమ్మకమ్మని మామిడి తాండ్రకు పుట్టినిల్లు. ఈ ప్రాంతం మన రాజమండ్రి నుండి ఒక 25 కిలోమీటర్లు ఉంటుంది. అలాగే మన కాకినాడ లేదు? అక్కడి నుండి ఒక 90 కిలోమీటర్ల దూరం ఉండే గ్రామం. చరిత్ర తిప్పి చూస్తేవీటి పుట్టుక ఒక 100 ఏళ్ళ క్రితం జరిగింది.
(Video courtesy: HMTV)
ఈ గ్రామం లోని కొన్ని వందల కుటుంబాలు ఈ వృత్తి లో తరతరాలుగా కొనసాగుతున్నాయి. బియ్యం, పొడికొట్టిన చక్కర మరియు నెయ్యి తో పూతరేకులను తయారు చేస్తారట. ఆడవాళ్ళు ఈ తయారీలో మగవారికంటే ఎక్కువగా పాలుపంచుకోవడం, తమ ఇంటి ఆర్ధిక అభివృద్ది లో ముందుండడం ఇక్కడొక గొప్ప విశేషం. అమెరికా వెళ్ళినా ఆస్ట్రేలియా వెళ్ళినా మన ఆత్రేయపురం పూతరేకులు తీసుకుని వెళ్ళాల్సిందే. ఆత్రేయపురం పూతరేకులు అంటే ఒక స్వీట్ కాదు, IT’S A BRAND.
ప్రతి రోజు కొన్ని వేల ఆర్డర్లు వస్తూనే ఉంటాయ్. ఈ ‘తీపి కాగితాలు’ మరియు మామిడి తాండ్ర ‘ఆత్రేయపురం’ అనే ఒక కుగ్రామాన్ని ప్రపంచ పటం పై నిలబెట్టాయి అనడం లో ఏ మాత్రం సందేహం లేదండోయ్. ఈ పేరుతో జరుగుతున్న నకిలీ దందాలను పారద్రోలి, మన తెలుగు సంపద అయిన ఈ ఆత్రేయపురం పూతరేకులను, మామిడి తాండ్రను ఒక ‘Brand’గా తీర్చిదిద్ది అక్కడి మహిళలకు, గ్రామస్తులకు ఒక గౌరవాన్ని, గుర్తింపుని, సిరిసంపధలని తీసుకురావాలని మనసారా కోరుకుంటూ మరొక పూతరేకుని నోట్లో వేసుకుంటున్నాను.
