Contributed By Bhavani
ఔరా అమ్మక్క చల్ల... ఈ మాట వినగానే ఒక్కసారిగా ఎవరి మనసులోకైనా తెలియని ఆనందం అప్రయత్నంగా వచ్చేస్తుంది. ఆపద్బాంధవుడు సినిమాలోని ఈ పాట బాణీ ప్రేమ వంటి ఒక సమ్మోహన భావంలో ముంచేస్తుంది. పాట పూర్తయ్యే సమయానికి ఏదో మధురోహలో నుంచి ఎవరో బయటకు తోసేసిన భావన కలుగుతుంది. అంత అద్భుతమైన పాట ఇది. నిజానికి ఆ రోజుల్లో ఆపద్భాంధవుడు పెద్దగా ఆడిన సినిమా ఏమీ కాదు, కానీ పాటలు సూపర్ హిట్. అందునా ఔరా అమ్మక్క చల్లా ఆబాల గోపాలాన్ని ఆకట్టుకుంది.
మహా పండితుడైన కవి రాసిన పాటను అతడి కూతురు అయిన కథానాయికతో కలిసి ఆమె స్నేహితుడి వంటి పామరుడైన కథానాయకుడు బాణీ కట్టడం ఈ పాట సన్నివేశం. అతడు తాను కూడా బాణీ కట్టగలనని అనడం నిజమా అని ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నట్టుగా అతడిని సవాలు చెయ్యడం, మొదట అతను మొదలు పెట్టగానే ఆమె నచ్చలేదనడం, అతడు ప్రయత్నించడం అంతా సరదాగా సాగుతుంది.
పాట నెపంతో కథానాయకుడి వ్యక్తిత్త్వాన్ని వివరించినట్టుగా ఉంటుంది. సూటిగా కృష్ణ లీలను వర్ణిస్తున్నట్టు అనిపించినా ఆ మాధవుడి పేరుతో అటువంటి మనసే ఉన్న వాడు ఈ మాధవుడు అని చెప్పకనే చెప్పేందుకు చేసిన ప్రయత్నంలో విశ్వనాథ్ ప్రతిభ అమోఘం. ఆయన ఉద్దేశ్యాన్ని పూర్తి స్థాయిలో పూర్తి చేసి చూపించాయి సీతారామ శాస్త్రి అక్షరాలు.
నల్లరాతి కండలతో కరుకైన వాడే వెన్నముద్ద గుండెలతో కరుణించు తోడే ఆయుధాలు పట్టను అంటూ బావ బండి తోలి పెట్టె ఆ.. నందలాల జాన జాన పదాలతో జ్ఙాన గీతీ పలుకునటే ఆనంద లీల
ఈ సినిమాలో కథానాయకుడు మాథవుడు ఆవులు కాచుకునే అతి సామాన్యంగా మృదు స్వభావంతో కనిపించినప్పటికీ, అవసరమైతే కరుకుగా కూడా వ్యవహరించగలిగే సమర్థ్యం కలిగి ఉన్నాడని చెప్పకనే చెబుతారు. ఆయుధాలు పట్టను అంటూ అర్జునుడి రథసారధిగా కనిపించినప్పటికీ కురుక్షేత్రాన్ని నడిపింది ఆయనే నడిపిన విధంగా తాను గురువుగా, గాడ్ ఫాదర్ గా భావించే వ్యక్తి రచనలు అచ్చు వేయించేందుకు ఊర్లోని పెద్దావిడతో తాను వెనకుండి డబ్బు ఇప్పించి ఆ మహత్కార్యాన్ని పూర్తి చేయిస్తాడు మాధవుడు.
ఆలమంద కాపరిగా అనిపించలేదా ఆ నందలాల ఆలమందు కాలుడిగా అనిపించుకాదా ఆనంద లీల వేలితో కొండను ఎత్తే కొండంత వేలుపటే ఆనందలాల తులసీదళానికే తేలిపోయి తూగునటే ఆనందలీల
అనాథగా ఉన్న తనని చేరదీసి పెంచినందుకు కృతజ్ఞతగా ఆ కుటుంబం ఎప్పుడు కష్టంలో ఉన్నా ఆదుకునేందుకు ఎన్నడూ వెనుకాడ లేదు మాధవుడు. గోపాలకుడిగా కనిపించే జగన్నాటక సూత్రధారి శ్రీ కృష్ణుడయితే... అమాయకంగా కనిపించినప్పటికీ తాను ఆరాధించే అమ్మాయి జీవితంలో వచ్చిన కష్టాన్ని తీర్చడం కోసం శ్రమించి ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా జీవితాన్ని నిలబెట్టిన గొప్ప మనసున్న ఆపద్భాందవుడు ఈ మాధవుడు.
ఔరా అమ్మక్కచల్లా ఆలకించి నమ్మడమెల్లా అంత వింత గాథల్లో ఆనందలాల బాపురే బ్రహ్మకు చెల్లా వైనమంత వల్లించ వల్ల రేపల్లే వాడల్లో ఆనంద లీల
కృష్ణలీల విని నమ్మగలమా... రేపల్లే వాడల్లోని అతని వైనాలు వివరించేందుకు బ్రహ్మకైనా చేతనవునా అని ఆశ్చర్యపడుతుంటాడు కవి భక్తి పారవశ్యంలో పల్లేపదంలా మొదలైన ఈ పాట హీరోయిన్ శాస్త్రీయ సంగీత స్వరాలతో ముగుస్తుంది. మధ్యలో తూర్పుగోదావరి యాసలో సాగే కోరస్ ఎంత ఆకట్టుకుంటుందంటే విన్న ప్రతిసారీ కృష్ణుడి దివ్యమంగళ స్వరూపం అలా కళ్ల ముందు కదలాడక మానదు. చక్కటి సాహిత్యానికి కీరవాణీ బాణీ ప్రాణం పోసింది. ఈపాటను కనీసం చిన్నగా కూనిరాగం తియ్యకుండా ఉండడం అసాధ్యం అంటే అతిశయోక్తి కాదు.
ఈ పాట చిరంజీవి, మీనాక్షీ శేషాద్రి మీద చిత్రికరించారు. నది ఒడ్డున ఆడిపాడే ఈ పాటలో వారి ఆహార్యం కూడా రాధకృష్ణులను స్ఫురించే విధంగా ఉంటుంది. నృత్య దర్శకులుగా ప్రభుదేవా, భూషణ్ ఇద్దరి పేర్లు కనిపిస్తాయి. ఇద్దరిలో ఎవరైనా నృత్యం అద్భుతంగా ఉంటుంది. చిరంజీవి తనదైన శైలీలో దాన్ని తెరమీద ప్రదర్శించిన తీరు మరింత బావుంటుంది. మీనాక్షీ శేషాద్రి శాస్త్రీయ నర్తకి కావడం వల్ల ఆమె హావభావ ప్రదర్శన ఆకట్టుకుంటుంది. బృందావనంలో విహరిస్తున్నంత అందంగా సాగిన చిత్రీకరణ, నృత్యం ఎన్నిసార్లు చూసినా అద్భుతంగానే అనిపిస్తుంది. ఈ పాట నిజంగానే జానపదంలో జ్ఞాన గీతి పలికినట్టే ఉంటుంది.
This Post was originally Posted by K.Viswanath Facebook Page.