తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఎన్నో రకాల అపోహలున్నాయి కాని ఈరోజు భారతదేశంలోనే తెలంగాణ వాయువేగంగా అభివృద్దిలో దూసుకుపోతుంది. పారిశ్రామికంగా, సాఫ్ట్ వేర్ రంగంలో, విదేశి పెట్టుబడులు లాంటి రంగాలలో మంచి ఫలితాలను రాబట్టుతుంది కాని వ్యవసాయ రంగంలో మాత్రం ఇంకా వెనుకబడే ఉందని చెప్పుకోవచ్చు.. వ్యవసాయ రంగంలోనూ ఉత్తమ ఫలితాలను తీసుకురావాలని 25 సంవత్సరాల హరికాంత్ ఎంతగానో కృషి చేస్తున్నాడు. ఇందులో భాగంలోనే ఆస్ట్రేలియాలో పండించే ద్రాక్షను హరికాంత్ ఎలా మన తెలంగాణ మట్టికి పరిచయం చేయబోతున్నాడన్నది తెలుసుకుందాం.
గిరిజన యువకుడు:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా అన్నంపల్లి అనే మారుమూల ప్రాంతానికి చెందిన హరికాంత్ కు చిన్నతనం నుండి వ్యవసాయం అంటే ఎంతో ఇష్టం. ఆ ఇష్టాన్నే తన కెరీర్ గా మలుచుకుని దేశంలోని వ్యవసాయ రంగంలో విపరీతమైన మార్పులు చేయాలని భావించాడు. అందుకోసం ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బిఎస్సీ, ప్రతిష్టాత్మక కోయంబత్తూర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ, ప్రస్తుతం పీ.హెచ్.డి చదువుతున్నారు.
మామూలు ద్రాక్షకు ఆస్ట్రేలియన్ ద్రాక్షకు ఏంటి తేడా.?
మనదేశంలో పండించే ద్రాక్ష తో పోలిస్తే "రెడ్ గ్లోబ్" ఆకారంలో పెద్దగా ఉంటుంది. ప్రస్తుతం ఈ ద్రాక్ష మార్కెట్ లో కిలో రూ.350 వరకు ధర ఉంది. ఎకరం సాగు చేస్తే రూ.15 లక్షల వరకు రైతులు సంపాదించవచ్చు. నీటి శాతం తక్కువగా ఉండడం, రుచి కూడా అద్భుతంగా ఉండడంతో దీనిని మన భారతదేశంలోనూ పండించాలని భారత కేంద్ర ప్రభుత్వం భావించింది. అందులో భాగంలోనే కోయంబత్తుర్ ప్రాంతం ఈ పంటకు అనుకూలంగా ఉందని భావించి అక్కడ పండించాలని కోయబత్తూర్ యూనివర్సిటీకి బాధ్యతలను అందించింది. యూనివర్సిటీ అద్యాపకులు "రెడ్ గ్లోబ్" సాగు బాధ్యతలను మన హరికాంత్ కు అప్పగించారు.
యూనివర్సిటీలో ఉన్న కొద్దిపాటి వ్యవసాయ భూమిలో హరికాంత్ "రెడ్ గ్లోబ్" ద్రాక్ష ను సాగుచేశాడు. విత్తనాలు నాటిన దగ్గర నుండి మొక్క ఎదుగులకు అవసరమయ్యే నీటిని, చీడపురుగులు ఆశించకుండా అన్ని రకాల జాగ్రత్తలు పాటించి మంచి దిగుబడితో పంటను పండిచాడు. ఈ రకమైన ద్రాక్ష ఆస్ట్రేలియా లాంటి దేశాలలో మాత్రమే పండుతుంది కాని దీనిని చిన్నపాటి మార్పుచేసి భారతదేశంలో పండించినందుకు తమిళనాడు ప్రభుత్వం వారు బెస్ట్ రీసెర్చ్ అవార్డ్ తో సత్కరించారు. ఈ అవార్ఢ్ ను ఎం.ఎస్ స్వామినాథన్ గారి చేతులమీదుగా హరికాంత్ పురస్కారాన్ని అందుకున్నారు. మన తెలంగాణ యువకుడైన హరికాంత్ పక్క రాష్ట్రంలో అవార్డ్ లు అందుకోవడం నిజంగా గొప్ప విషయమే కాని హరికాంత్ మనసంతా కూడా తెలంగాణ ప్రాంత రైతుల మీదనే ఉంది. ప్రభుత్వం వారు ముందుకు వస్తే ఆస్ట్రేలియన్ రెడ్ గ్లోబ్ మాత్రమే కాదు, ప్రపంచంలో అత్యధిక దిగుబడినిచ్చే పంటలను తెలంగాణ వాతావరణ పరిస్థితులకు తగ్గట్టు అభివృద్ది చేసి రైతుల జీవితాలను మార్చాలని ఎన్నో ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నాడు.