Contributed by Sai Ram Nedunuri
ఇటీవల విడుదలైన " love story " చిత్రం లోని " ఏయ్ పిల్లా" పాట వినే ఉంటారు. ఈ పాట వినడానికి హాయిగా ఉండడానికి కారణం బాణీ తో పాటు సాహిత్యానికి కూడా ఉంది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ పాట రాసింది చైతన్య పింగళి గారు. మన జాతీయ పతాకం రూపకర్త అయిన పింగళి వెంకయ్య గారి ముని మనవరాలు ఈ రచయిత్రి. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత కూడా. "ఫిదా" చిత్రం లో "ఊసు పోదు", "ఫిదా ఫిదా" పాటలు రాసింది కూడా ఈవిడే. "ఏయ్ పిల్లా" పాటలోని పద ప్రయోగం, భావ ప్రకటన అత్యద్భుతంగా ఉన్నాయనిపించింది. అలాగే పదాలలో తెలుగు పదాలతో పాటు, హైదరాబాద్ పురానా షహర్ మట్టి వాసనలు వెదజల్లే దక్కని భాష కూడా వినిపిస్తుంది. ఈ article లో ఈ పాట లోని భావాన్ని కొన్ని పదాల అర్థాలని విశ్లేషించడం జరిగింది.
పాట ని మొత్తంగా పరిశీలిస్తే, కథానాయకుడు, తను ఉండే ప్రపంచాన్ని, కథానాయకురాలికి పరిచయం చేస్తూ, తన ప్రేమని వ్యక్తపరిచేటప్పుడు తను లోనైన ఆనందాన్ని వివరిస్తూ, తన ప్రపంచం లోని పరిసరాలను, చిన్న చిన్న ఆనందాలను ఆమెకి చూపిస్తూ, ఇక మీద తన జీవితంలో ఉన్నవన్నీ ఆమెకి కూడా సొంతం అని చెప్తూ, తనతో ఆమె జీవితం ఎలా ఉండబోతోందో విశ్లేషిస్తూ ఉండే సాహిత్యంతో సాగుతుంది ఈ పాట.
ఏ పిల్లా, పరుగున పోదామా ఏ వైపో జంటగ ఉందామా రా రా కంచె దూకి, చక చక ఉరుకుతు ఆ .. రంగుల విల్లును తీసి ఈ వైపు వంతెన వేసీ, రావా ..
అతను, ఆమెని తన ప్రపంచంలోకి రమ్మని ఆహ్వానిస్తూ, ఆమెకి ఉండే ఆంక్షల కంచెలని దూకి, రంగుల హరివిల్లును తన వైపు వంతెనగా వేసి, ఆ వంతెన ద్వారా తన దరికి రమ్మని అడుగుతున్నాడు అతను.
ఎన్నో తలపులు, ఏవో కలతలు బతుకే పొరవుతున్నా గాల్లో పతంగి మల్లె ఎగిరే కలలే నావి
అతను, తన జీవితం తీరుని, జీవితం యందు తనకి ఉన్న దృక్పథాన్ని చెప్తున్నట్టు ఉంటాయి పై వాక్యాలు. పోరు అంటే యుద్ధం అనే అర్థం వస్తుంది. కలతలు అంటే కష్టాలు అనే అర్థం. తనకి ఉండే ఎన్నో తలపులు, కష్టాలతో బ్రతుకే ఒక యుద్ధం గా మారినా సరే, గాల్లో ఎగిరే పతంగిలా తన కలలు ఎగురుతూనే ఉంటాయి అని చెప్తున్నాడు అతను. ఇక్కడ పతంగి అనే పదం ఎక్కువ మనకి హైదరాబాదీ హిందీ (దక్కని) భాషలో వినిపిస్తూ ఉంటుంది.
ఆశ నిరాశల, ఉయ్యాలాటలు పొద్దూ మాపుల మధ్యే నాకంటూ ఉందింతే, ఉందంతా ఇక నీకే ..
పొద్దూ మాపులు అంటే సూర్యోదయం, సూర్యాస్తమయము అనే అర్ధాలు వస్తాయి. ప్రతిరోజూ ఎన్నో ఆశ - నిరాశల ఎత్తు పల్లాలతో అతని జీవితం సాగుతుంది అని చెప్పాడనికి పొద్దూ మాపుల మధ్య ఆశ నిరాశల ఉయ్యలాటలు అనే వాక్యం రాశారు రచయిత్రి.
నీతో ఇలా ఏ బెరుకు లేకుండా నువ్వే ఇగ నా బతుకు అంటున్నా నా నిన్న నేడు రేపు కూర్చి నీకై పరిచానే తలగడలా నీ తలను వాల్చి కళ్ళు తెరిచి నా ఈ దునియా మిల మిల చూడే
తలగడ అంటే దిండు, pillow అనే అర్థం వస్తుంది. అతను తన గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తుని ఆమెకి చెప్పగా, వాటిని చూసి, తన జీవితంలోకి వచ్చి, తన ప్రపంచంలోని తలుకుబెలుకులని చూడమంటున్నాడు అతను. ఈ మొత్తం భావాన్ని, తలగడ మీద ఆమె తల వాల్చి, కళ్ళు తెరిచి, అతని దునియాలో ఉన్న మెరుపులు చూడమని అతను అడుగుతున్నట్టు పోల్చి చాలా అద్బుతంగా చెప్పారు రచయిత్రి.
వచ్చే మలుపులు, రస్తా మెరుపులు, జారే చినుకుల జల్లే పడుగు పేకా మల్లే, నిన్నూ నన్నూ అల్లే పొద్దే తెలియక గల్లీ పొడుగున ఆడే పిల్లల హోరే నాకంటూ ఉందింతే, ఉందంతా ఇక నీకే
రస్తా అంటే దారి అనే అర్థం వస్తుంది. గల్లీ అంటే English లో స్ట్రీట్ అని అర్థం. ఇవి రెండూ కూడా హైదరాబాదీ ఉర్దూ పదాలే. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పద ప్రయోగం, "పడుగు పేక". "పడుగు పేక" అంటే English లో length and breadth అని అర్థం. పైన వాక్యాలలో, భవిష్యత్తులో వచ్చే మలుపులు, ఎదురయ్యే మెరుపులు, చినుకుల జల్లులు అన్నీ మన జీవితాల length and breadth, అంటే మొత్తంగా అల్లుకుంటాయి అని అతను ఆమెతో చెప్తున్నాడు.
అలాగే గల్లీలో ఆడే పిల్లల హోరు గురించి చెప్పి, అతనికి ఉండే చిన్న చిన్న ఆనందాల గురించి చెప్పారు రచయిత్రి.
పారే నదై నా కలలు ఉన్నాయే చేరే దరి ఓ వెతుకుతున్నాయే నా గుండె ఓలె చేసి ఆచి తూచి అందించా జాతరలా ఆ క్షణము ఛాతి పైన సోలి చూసా లోకం మెరుపుల జాడే
"ఓలె" అంటే వరుస అనే అర్థం వస్తుంది. "సోలి" అంటే మైమరపు, తన్మయత్వం అనే అర్ధాలు వస్తాయి. వాడుక భాష లో అయితే సేదతీరడం అనుకోవచ్చు. దరి అంటే గట్టు, సమీపం అనే అర్ధాలు వస్తాయి. ఛాతీ అంటే శరీరంలో గుండె ఉండే పై భాగం అని అర్థం.
పారుతున్న అతని కలలు, చేరడానికి గట్టు వెతుకుతున్నాయి అని చెప్తూ, తన గుండెని వరుసగా చేసి జాగ్రత్తగా జాతర లాగ ఆమెకి అందించానని చెప్తున్నాడు అతను. జాతర అంటే పండగకి జరిగే వైభవం అనే అర్థం వస్తుంది. ఈ వాక్యం ద్వారా, అతను ఆమెకి తన ప్రేమ ఎలా తెలిపాడో చెప్తూ, ఆ తెలిపే సమయాన్ని పండగతో పోల్చి చెప్పాడని రాశారు రచయిత్రి. అలా తన ప్రేమ చెప్పే క్షణం, అతనికి లోకం మొత్తం మెరుపుల ఆనందాలు కనిపించాయి అనే భావాన్ని, ఆ ప్రేమని చెప్పే క్షణం యొక్క గుండె పై సేద తీరినప్పుడు, ఈ లోకం మొత్తం మెరుపుల ఆనందాలు కనిపించాయని అద్బుతంగా రాశారు రచయిత్రి. ఇక్కడ "సోలి" అనే పదం వాడడం వలన, తన ప్రేమని వ్యక్త పరచడంలో అతనికి ఉన్న హాయిని వివరించారు రచయిత్రి. "ఫిదా" cinema లో "ఊసు పోదు" పాట లో కూడా "సోయి లేదు సొలనీదు" అనే వాక్యం ఉంటుంది. జానపద మాండలికాల మీద రచయిత్రి ఇష్టం వ్యక్తమౌతుంది ఇలాంటి పదాల వలన.
నింగిన మబ్బులు ఇచ్చే బహుమతి నేలన కనిపిస్తుందే మారే నీడలు గీసే తేలే బొమ్మలు చూడే పట్నం చేరిన పాలపుంతలు పల్లెల సంతల బారే నాకంటూ ఉందింతే, ఉందంతా ఇక నీకే ..
నింగిలో ఉండే మబ్బులు ఇచ్చే బహుమతి ఏముంటుంది వాన చినుకులు తప్ప. మబ్బులు ఇచ్చే వాన చినుకులు మనకి నెల మీద కనిపిస్తాయి అని చెప్తూ, అద్భుతమైన బహుమతులన్నీ మనం మన కాళ్ళు నేల మీద ఉంచి సాదా సీదా జీవనం గడిపినప్పుడు అందుతాయని చెప్పకనే చెప్పారెమో రచయిత్రి. మారుతున్న నీడలు అంటే నీలి మబ్బుల నీడలుగా అర్ధం చేసుకోవచ్చు. అలా కదులుతున్న నీలి మబ్బుల నీడల నుంచి జాలువారే వర్షం చినుకులతో నేల పైన ఏర్పడిన నీళ్ళల్లో, మన ప్రతిబింబాలు మనకి తేలుతూ కనిపిస్తాయి. వాటినే మారుతున్న నీడలు గీసే, తేలే బొమ్మలని ప్రస్తావించారు రచయిత్రి. వర్షాన్ని గూర్చిన ప్రక్రియ మొత్తం వర్షం అనే పదం వాడకుండా ఎంత బాగా చెప్పారో కదా ..!!
బారు అంటే సమూహం అనే అర్థం వస్తుంది. సంత అంటే సాధారణంగా పల్లెల్లో వస్తువుల అమ్మకానికి పెట్టే ప్రక్రియ. పట్నంలో ఇప్పుడు కనిపిస్తున్న పాలపుంతలు, పల్లెల్లో మనకి సంతల బారుల్లా ఎక్కువగా కనిపించేవే అని చెప్పినట్టున్నారు రచయిత్రి. ఈ వాక్యంతో, పల్లె నుంచి పట్నానికి వలసలు, అలాగే పట్నంలో అడపాదడపాగా కనిపించే పాలపుంతల లాంటి అందమైన బంధుత్వాలు, పల్లెల్లోనే ఎక్కువగా దొరుకుతాయి అని చెప్పకనే చెప్పినట్టు ఉన్నారు రచయిత్రి.
ఇంత మంచి పాటని మనకి అందించిన సంగీత దర్శకుడు పవన్ గారికి, రచయిత్రి చైతన్య గారికి, Love story cinema crew మొత్తానికీ ధన్యవాదాలు చెప్తూ, నేను వేతికినంతలో నాకు అర్థమైనంతలో పాటని విశ్లేషించే ప్రయత్నం చేశాను. ఇందులో తప్పులు దొర్లి ఉంటే, మన్నించగలరు.
మొత్తం పాట ని కింద ఇవ్వడం జరిగింది.
ఏ పిల్లా, పరుగున పోదామా ఏ వైపో జంటగ ఉందామా రా రా కంచె దూకి, చక చక ఉరుకుతు ఆ .. రంగుల విల్లును తీసి ఈ వైపు వంతెన వేసీ, రావా ..
ఎన్నో తలపులు, ఏవో కలతలు బతుకే పొరవుతున్నా గాల్లో పతంగి మల్లె ఎగిరే కలలే నావి ఆశ నిరాశల, ఉయ్యాలాటలు పొద్దూ మాపుల మధ్యే నాకంటూ ఉందింతే, ఉందంతా ఇక నీకే ..
నీతో ఇలా ఏ బెరుకు లేకుండా నువ్వే ఇగ నా బతుకు అంటున్నా నా నిన్న నేడు రేపు కూర్చి నీకై పరిచానే తలగడలా నీ తలను వాల్చి కళ్ళు తెరిచి నా ఈ దునియా మిల మిల చూడే
వచ్చే మలుపులు, రస్తా మెరుపులు, జారే చినుకుల జల్లే పడుగు పేకా మల్లే, నిన్నూ నన్నూ అల్లే పొద్దే తెలియక గల్లీ పొడుగున ఆడే పిల్లల హోరే నాకంటూ ఉందింతే, ఉందంతా ఇక నీకే
పారే నదై నా కలలు ఉన్నాయే చేరే దరి ఓ వెతుకుతున్నాయే నా గుండె ఓలె చేసి ఆచి తూచి అందించా జాతరలా ఆ క్షణము ఛాతి పైన సోలి చూసా లోకం మెరుపుల జాడే
నింగిన మబ్బులు ఇచ్చే బహుమతి నేలన కనిపిస్తుందే మారే నీడలు గీసే తేలే బొమ్మలు చూడే పట్నం చేరిన పాలపుంతలు పల్లెల సంతల బారే నాకంటూ ఉందింతే, ఉందంతా ఇక నీకే ..