బహుశా కలియుగంలో సాయిబాబా మాత్రమే కాబోలు మనిషిగా పుట్టి చిట్టచివరిగా అద్భుతాలు చేసి భక్తుల బాధలను తొలగించినది. ఆంజనేయస్వామి, శ్రీరాముడు, పరమశివుడు ఇలా ప్రతి వాడలో వెలిసే దేవాలయాలలో సాయిబాబా దేవాలయం కూడా ఉంటుంది. ప్రపంచంలో సాయి భక్తులు ఎక్కడున్నా శిరిడినే అత్యత్తమ దేవాలయంగా పరిగణిస్తారు. శిరిడి తరువాత ఆ స్థాయిలో మన ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలోని బలభద్రపురంలోని సాయి దేవాలయాన్ని ఆంధ్రప్రదేశ్ శిరిడిగా పరిగణిస్తున్నారు.
ఈ దేవాలయానికి వందల సంవత్సరాల చరిత్ర లేదు.. ఈ ఆలయ స్థాపనకు దారి తీసిన అద్భుతమైన సంఘటనలు లేవు. చారత్రిక నేపధ్యం అనేది లేకపోయినా కాని అత్యంత మహిమాన్వితమైన కోవెలగా భక్తులతో పూజలందుకుంటున్నది. సాయిబాబా జన్మదినం నాడో మరే ఇతర పండుగరోజులలో మాత్రమే కాదు నిత్యం వేలాదిమంది భక్తులు ఈ దేవాలయాన్ని దర్శించుకుంటారు. కృష్ణ పురుషోత్తమ రెడ్డి మరియు భక్తుల సహకారంతో 2005లో ఈ దేవాలయం స్థాపించబడినది.
ఏ దేవాలయానికైనా మరింత అందాన్ని గోడలమీద ప్రతిష్టించిన శిల్పాలు తెలియజేస్తాయి. ఈ ఆలయంలో కూడా నాడు శిరిడిలో సాయిబాబా చేసిన అద్భుతాలు, నాటి సంఘటనలు, చరిత్ర తాలుకు సన్నివేశాలను శిల్పాలలో ప్రతిష్టించారు. ఈ దేవాలయంలో ఉన్న మరో ప్రత్యేకత ఆరు అడుగల పొడుగున్న సాయిబాబా ప్రతిమకు పాలాభిషేకం చేసే అవకాశం ప్రతిఒక్కరికి ఉండడం.