"అమ్మ" పరిచయం అక్కర్లేని ఏకైక వ్యక్తి, పదం. సృష్టికర్తగా, స్థితి కర్తగా, ప్రళయ కర్తగా(నిద్రపుచ్చుతోంది కనుక) ఆమె పరబ్రహ్మ స్వరూపిణి, పితృఋణాన్ని తీర్చుకోవచ్చు కానీ, మాతృఋణం తీర్చుకోవడం సాధ్యం కాదని శాస్త్రవాక్కు. -చాగంటి కోటేశ్వర శర్మ గారు.
నువ్వు పడుతున్న శారీరక శ్రమ చూసి నేను బాధపడతానని తెలిసే నేను నీ కడుపులో ఉన్నపుడు నాకు ఊహ తెలియకుండా చేశావు కదూ. కావాలనే నాతో ఆడుకున్నావు, పాలిచ్చావు, మాటలు నేర్పించావు అన్ని నేర్పించావు.. నా శరీరాన్ని మనస్సుని నిర్మించిన మొదటి వ్యక్తివి నువ్వు.. ఇంత చేసిన నీకు తిరిగి నేనేమి ఇవ్వగలను.? ఇచ్చేంతటి ఆస్థి నా దగ్గర ఎమున్నది.? ఒక్కోసారి నేను ఎన్ని విజయాలు, మన్ననలు పొందినా నీ ముందు అల్పుడిలా తొస్తుంది.. మరోసారి నీకు నువ్వే నేర్పించుకుని, నువ్వే గెలిచి తిరిగి నువ్వే ఆనందపడుతున్నావని అర్ధమవుతుంది. అమ్మ అంతటా నువ్వే ఉన్నావు కాదు.. నన్ను మోస్తున్నావు, ప్రాణవాయువునిస్తున్నావు, వర్షాలు కురిపించి మొక్కల్ని జాగ్రత్తగా పెంచి, కోతకోసి, వంట వండి నాకు భోజనం పెడుతున్నావు. అమ్మ ఇంకా నీ గర్భంలోనే ఉన్నాను కదా నేను.. అమ్మా.. నువ్విచ్చిన ఈ మనసు, చేతుల ద్వారానే ఆర్టికల్ రాస్తున్నాను. నువ్విచ్చిన ఈ కళ్ళ ద్వారానే బాపు గారు వేసిన ఈ బొమ్మలను నీకు చూపిస్తున్నాను..
1. యమద్వారం ముందు మహాఘోరమైన వైతరణీ నది ఉంటుంది. అది నువ్వు దాటడానికి వీలుగా నీకు ఈ మాతృపిండాన్ని సమర్పిస్తున్నాను.
2. శరీరం కళ తగ్గి మృత్యుముఖంలోకి వెళ్లి తిరిగి వస్తుంది. అందుకు ప్రతిగా నీకు ఈ మాతృపిండాన్ని సమర్పిస్తున్నాను.
3. నేను వ్యాధితో బాధపడుతున్నప్పుడు బాధపడేదానివి నువ్వే. అందుకు ప్రతిగా నీకు ఈ మాతృపిండాన్ని సమర్పిస్తున్నాను.
4. అందరు పిల్లలు తినగా మిగిలిన దానినే అల్పాహారంగా స్వీకరించిన నీకు ప్రతిగా ఈ మాతృపిండాన్ని సమర్పిస్తున్నాను.
5. ఆకలితో అలమటించిన నాకు, తినడానికో తాగడానికో ఇచ్చి రక్షించినందుకు ప్రతిగా నీకు ఈ మాతృపిండాన్ని సమర్పిస్తున్నాను.
6. చాల దీర్ఘమైన మాఘమాస రాత్రులందు శిశిరాతపాన్ని దుఃఖాన్ని అనుభవింపచేసినందుకు ప్రతిగా ఈ మాతృపిండాన్ని నీకు సమర్పిస్తున్నాను.
7. రాత్రిపూట మలమూత్రాలతోనే నీ పక్క తడిపి నీకు సుఖం లేకుండా చేసినందుకు ప్రతిగా ఈ మాతృపిండాన్ని నీకు సమర్పిస్తున్నాను.
8. రాత్రిపగలు అన్న తేడా లేకుండా నాకు నీ స్తన్యాన్ని ఇవ్వమని వేదించినందుకు ప్రతిగా నీకు ఈ మాతృ పిండాన్ని సమర్పిస్తున్నాను.
9. ఇది అది అనకుండా అన్ని రకాలైన చేదు, కషయాలు తినడం తాగడం చెయ్యవలసి వచ్చింది నా వల్ల. అందుకు ప్రతిగా ఈ మాతృపిండాన్ని నీకు సమర్పిస్తున్నాను.
10. మరణం తర్వాత మూడు రాత్రులు దేహం అగ్నిలో శోషిస్తుంది ఆహారం లేక. అందుకు ప్రతిగా నీకు ఈ మాతృపిండాన్ని సమర్పిస్తున్నాను.
11. ప్రసవం అయిన దగ్గర నుండి చిక్కి శల్యమైపోయినా నాకు ఎన్నో సేవలు చెయ్యవలసి వచ్చింది. అందుకు ప్రతిగా ఈ మాతృపిండాన్ని నీకు సమర్పిస్తున్నాను.
12. తల్లివైన నీకు కష్టం కలుగుతుందన్న ఆలోచన లేక, గర్భంలో ఉన్నప్పుడు, బయటపడిన తర్వాత కూడా కాళ్లతో తన్నినందుకు ప్రతిగా నీకు ఈ మాతృపిండాన్ని సమర్పిస్తున్నాను.
13. పదినెలలు నిండిన తర్వాత, తల్లివైన నీకు ఎక్కువ కష్టం కలిగించినందుకు ప్రతిగా ఈ మాతృపిండాన్ని నీకు సమర్పిస్తున్నాను.
14. ప్రసవ పర్యంతం నెలనెలా కష్టం కలిగించినందుకు ప్రతిగా ఈ మాతృపిండాన్ని నీకు సమర్పిస్తున్నాను.
15. కొడుకులు కలిగేదాక తల్లి చింతతో బాధపడుతుంది. అటువంటి చింత కలిగించినందుకు ప్రతిగా ఈ మాతృపిండాన్ని నీకు సమర్పిస్తున్నాను.
16. గర్భం ధరించడమే దుఃఖం. దానికి తోడు ఎగుడుదిగుడు నేలమీద నడవడం అంతకన్న కష్టం. ఆ కష్టం కలిగించినందుకు ప్రతిగా ఈ మాతృపిండాన్ని సమర్పిస్తున్నాను