Contributed by Masthan Vali తామిద్దరూ జంట పదాలు... కాదు జంట మనుషులని తెలియడానికేమో "త"మతో మొదలవుతారు - తల్లితండ్రులు ఈ భూమ్మీద తొలి ప్రేమను రుచి చూపేది కాబట్టేమో ఆమె తొలి అక్షరంతో మొదలవుతుంది - అమ్మ నాకు సంబంధించినవన్నీ తనవనుకుని గొప్పగా మురిసిపోయె వ్యక్తయినందుకు కాబోలేమో అతను "నా"తో మొదలవుతాడు - నాన్న అమ్మ ప్రేమ తియ్యనైనది...కమ్మనైనది.... మనం పుట్టగానే అమ్మ పాలు పట్టించినప్పుడు... అసలు ప్రేమంటే ఏమిటో తెలియకుండానే ఆమెను ప్రేమించేస్తాం...అలా జీవితాంతం ప్రేమిస్తుంటాం... మరి నాన్న...? ... అంత తొందరగా గ్రహించలేం. అదే అతని గొప్పతనం. చూడగానే అర్థమయ్యే అందం అమ్మైతే... ఛేదించి, శోధించి, సాధించే గుప్త నిధి కంటే గొప్పనైనది నాన్న ప్రేమ... ఒక పట్టాన అర్థం కాదు. అర్థం అయ్యాక ఆ ఆనందం అంతా ఇంతా కాదు...! నాన్న మీద మన మొదటి భావన ఎలాంటిదైనా, మనం పెరెగే కొద్దీ... "నాన్నెందుకు ఇలా చేస్తారు...? ఎందుకు తిడతారు...? ఎందుకు తొందరగా ఇంటికి రమ్మంటారు..? ఎందుకు చెప్పిందే చెప్తుంటారు...?.." అనే వైపు మల్లుతుంది. ఆ మలుపుల గుండా ప్రయాణిస్తూ వెలుతుంటే... ఒక్కో విషయం "బోధ" పడుతుంది. ఒకానొక సందర్భం లో మనకు తెలియకుండానే మనం ఆయనలా మాట్లాడతాం... తెలియకుండానే ఆయనలా కోప్పడతాం... ఆయనలా బాధపడతాం...ఇలా మనకు తెలియకుండానే నాన్న గురించి తెలుసుకుంటాం... మనం అపార్థం చేసుకున్నపుడు కూడా మనల్ని అర్థం చేసుకోవడం మనం మాట్లడనప్పుడు తను కూడా మౌనం నటించడం మనం బాధపడుతున్నప్పుడు ఎవ్వరికీ తెలియకుండా ఏడవడం మనం ఏదైనా సాధించినపుడు మనకన్నా గొప్పగా ఆనందపడిపోవడం మనం కిందకు జారిపోతున్నఫ్ఫుడు... మనల్ని మనలా మరలా నిలబడేలా చేయడం మన ముందెంత అరిచినా తర్వాత అమ్మతో బాగోగులు ఆరా తీయడం రేయి పగలు మరచి తన రెక్కల కష్టంతో మన ఇష్టాన్ని నెరవేర్చడం... ఇన్ని చేసిన నాన్నకి... ఒక్క విషయం మాత్రం తెలియదు...!! "ఇవన్నీ నీకోసం చేసాన్రా... నీ మీద ప్రేమతో చేసాను..." అని తన ప్రేమను మనకు అర్థం అయ్యేలా "బయట"కు చెప్పడం తెలియదు.! ఎన్ని సంవత్సరాలయిన మన కోసం తపిస్తుంటారే తప్ప...మనమంటే ప్రేమని చెప్పరు. “అవును... చెప్పకండి నాన్న. చెప్పవలసిన అవసరం లేదు. నాకర్థం అయ్యింది. మీ శ్రమకి పేరు ప్రేమని... ఆ ప్రేమ కి అర్థం నేనని... నాకర్థం అయ్యింది….” ఇట్లు మీ అంత కాకపోయినా, నా వంతు ప్రేమతో మీ సుపుత్రుడు...!