
ఈ జగమంతా సృష్టించింది జగన్మాతా అందుకే కాబోలు ఈ భూమి అంతా తనకు ఆరాధన స్థలం అయ్యింది.. అమ్మవారు అనేక మహత్తర ప్రదేశాలలో వెలసి వాటిని పుణ్య క్షేత్రాలుగా మలిచింది అటువంటి మహిమాన్విత పుణ్య క్షేత్రాలలో ఒకటి ఈ కనకదుర్గ దేవాలయం. ఇది హైదరాబాద్ నుండి దాదాపు 280కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక రాజధాని అయినా విజయవాడలో పవిత్ర కృష్ణనది సమీపంలో నిర్మితమైనది. భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన దేవాలయాలలో ఒకటి అయిన ఈ గుడి తెలుగురాష్ట్రాలలోనే తిరుమల తర్వాత రెండవ అతి పెద్ధ గుడిగా కీర్తింపబడుతుంది. ఈ ఆలయంలో అమ్మవారు నాలుగు అడుగల విగ్రహంలో ఎనిమిది చేతులతో రాక్షసుడైన మహిషాసురుడిని త్రిశూలంతో సంహరిస్తు దర్శనమిస్తుంది. అత్యంత శక్తివంతుడైన అర్జునుడు శివుడి నుండి "పాశుపతాశ్రాన్ని" పూర్వం విజయవాడలోనే పొందాడని ఇక్కడి స్థల పురాణం.

కీలుడు ఒక యక్షుడు అమ్మవారికి గొప్ప భక్తుడు. కృతయుగానికి ముందే ఈ కీలుడు ఘోర తపస్సు చేసి ఆ జగన్మాతను ప్రసన్నం చేసుకున్నాడు. అమ్మ సాక్షాత్కరం తర్వాత ఏ భోగ భాగ్యాలు కోరుకోక తన హృదయంలో కొలువుండమని ప్రాధేయపడ్డాడు ఇందుకు అమ్మవారు పరవశించి కీలుడిని పర్వతంగా నిలబడి ఉండమని చెప్పి రాక్షస సంహారం పూర్తిచేసిన పిదప ఈ పర్వతం మీద కొలువై ఉంటానని వరమిచ్చింది. కీలుడు కీలాద్రిగా రూపాంతరం చెందాడు. ఇచ్చిన మాటగ అమ్మవారు ఆ పర్వతం మీద ఆశీనురాలయింది.. అమ్మవారిని సేవించడానికి ప్రతిరోజు ఇంద్రాది దేవతలు ఇక్కడికి రావడంతో ఇక్కడి క్షేత్రాన్ని ఇంద్రకీలాద్రి గా పిలవబడుచున్నది. అమ్మవారు బంగారు ఆభరణములతో ధగ ధగా కనక వర్ణంతో మెరిసిపోవడంతో ఇక్కడి అమ్మవారిని కనకదుర్గ గా కొలుస్తున్నారు.

భారతదేశంలోనే ఎక్కడ జరగలేని విధంగా అమ్మవారి దసర ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి ఈ తొమ్మిది రోజులు అమ్మవారు వివిధ అలంకారాలలో భక్తులకు దర్శనమిస్తుంది. మొదటిరోజు బాలా త్రిపుర సుందరీ దేవిగా, రెండవరోజు గాయత్రి దేవిగా, మూడవరోజు అన్నపూర్ణ దేవిగా, నాల్గొవరోజు లలితా త్రిపుర సుందరీ దేవిగా, ఐదవరోజు సరస్వతీ దేవిగా, ఆరవరోజు దుర్గాదేవిగా, ఏడవరోజు మహాలక్ష్మీ దేవిగా, ఎనిమిదవరోజు మహిషాశుర మర్దినీ దేవిగా, తొమ్మిదవరోజు రాజరాజేశ్వర దేవిగా పూజరులు అలంకరిస్తారు.

అమ్మవారికి వచ్చె కానుకలలో బంగారం కూడా అధిక స్థాయిలోనే ఉంటుంది ఈ దేవాలయ వార్షిక హుండి ఆదాయం కోట్లల్లో ఉంటుంది. ఈ దేవాలయంలోని శివుడి విగ్రహాన్ని పూర్వం బ్రహ్మదేవుడు ప్రతిష్టించి మల్లెపూలతో అర్చన చేయడం మూలంగ ఇక్కడ శివుడు మల్లేశ్వర స్వామిగా పూజలందుకుంటున్నాడు. తెలుగురాష్టాలలో అత్యంత భక్తి క్రమశిక్షణతో భవానీ దీక్ష మాలను దరించిన భక్తులు వేల సంఖ్యలో ఇక్కడికి వచ్చి పూజచేసి దీక్షను విరమిస్తారు. ఈ శక్తివంతమైన దేవాలయంలోనే భవాని మంటపం, మల్లేశ్వర స్వామి, విఘ్నేశ్వర స్వామి, నటరాజ స్వామి, శివకామ సుందరీలు, నాగేంద్ర స్వామి దేవతలకు ప్రత్యేక మందిరాలు కలవు. లక్షకుంకుమార్చన స్థలం, నిత్యపూజ స్థానం, కళ్యాణ మంటపం, శంకరాచార్య మంటపం, చండీహోమ మందిరం శ్రేష్టమైనవి. సంవత్సరానికి దేశ విదేశాల నుండి లక్షలాది సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మ ఆశీస్సులు తీసుకుంటారు.