భద్రాచలం...దక్షిణాది అయోద్య..! యావత్ తెలుగు ప్రజల ఇలవేల్పు శ్రీ రాముడు..! ఆ రాముడ్ని తన కీర్తనలతో కొలచి అనిర్వచనీయమైన భక్తికి ప్రతి రూపం అయ్యాడు కంచర్ల గోపన్న.. తన భక్తితో శ్రీ రామదాసు గా చిరస్మరణీయుడైనాడు... భక్త రామదాసు సీతారామలక్ష్మణు లకు ఆలయం నిర్మించి జైలు పాలయ్యాడు (ప్రజల పన్ను తో కట్టినందుకు గానూ)..కేవలం ఆలయమే కాక దేవతా మూర్తులకు ఆభరణాలు కూడా చేయించాడు ఆ వాగ్గేయకారుడు..కారాగారంలో శిక్ష లను భరించలేక "ఇక్ష్వాకు కుల తిలకా" అంటూ ఆ అభరణాల గురించి ప్రస్తావిస్తూ కీర్తన చేశాడు.ఇప్పటికీ భద్రాచల ఆలయం లోనున్న మ్యూజియంలో ఈ విశేష ఆభరణాలు ఉన్నాయి...! వీటిని కేవలం ప్రతి ఏటా జరిగే సీతా రాముల కళ్యాణోత్సవానికి మాత్రమే బయటకి తీసి స్వామికి అల౦కరిస్తారు..! రామదాసు చేయించిన ఆ ఆభరణాలు...
1. భరతునకు చేసితి పచ్చల పతకము రామచంద్రా ఆ పతకమునకు పట్టె పదివేల వరహాలు రామచంద్రా...

2. శత్రుఘ్నునకు నేను చేసితి మొలత్రాడు రామచంద్రా ఆ మొలత్రాడునకు పట్టె పదివేల మొహరీలు రామచంద్రా...

3. లక్ష్మణునకు చేసితి ముత్యాల పతకము రామచంద్రా ఆ పతకమునకు పట్టె పదివేల వరహాలు రామచంద్రా...

4. సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము రామచంద్రా ఆ పతకమునకు పట్టె పదివేల వరహాలు రామచంద్రా...

5. కలికి తురాయి నీకు పొలుపుగ చేసితి రామచంద్రా నీవు కులుకుచు తిరిగెద వెవరబ్బ సొమ్మని రామచంద్రా..

6. చుట్టు ప్రాకారములు సొంపుగచేయిస్తి రామచంద్రా ఆ ప్రాకారమునకు పట్టె పదివేల వరహాలు రామచంద్రా..

7. రామదాసు సీతమ్మ వారికి చేయించిన మంగళ సూత్రాలు చాలా ప్రత్యేకమైనవి..ఎక్కడైనా రెండే సూత్రాలు ఉంటాయి కానీ దశరథ మహారాజు తరుపున ఒకటి,జనకుని తరుపున మరొకటి,రామదాసు తన తరుపున చేయించినది..ఇలా మొత్తం మూడుంటాయి..

శ్రీరామదాసు రాముడిని ని౦ది౦చాక పశ్చాతాప౦తో ఈ విధ౦గా స్తుతి౦చాడు. "అబ్బా తిట్టితినని ఆయాసపడవద్దు రామచంద్రా ఈ దెబ్బల కోర్వక అబ్బ తిట్టితినయ్య రామచంద్రా.. సర్కారు పైకము తృణముగ నెంచకు రామచంద్రా దెబ్బల కోర్వను అప్పుతీర్పుమయ్య రామచంద్రా.."ఇలా రామదాసు ఆ రామచంద్రుని వేడుకోవడమూ..స్వయాన ఆ రామ లక్ష్మణులు తానీషా గారి వద్దకు వెళ్ళి, ఆరు లక్షల వరహాలు శిస్తు చెల్లించడమూ, అలా రామదాసు విడుదల కావడము జరిగిందని ప్రతీతి. అప్పుడిచ్చిన నాణెములను రామటంకా నాణెములని అంటారు. వీటికి ఒకవైపు శ్రీరామ పట్టాభిషేకము ముద్ర, మరొకవైపు రామభక్తుడు హనుమంతుని ముద్ర ఉన్నాయి. ఇవి ఇప్పుడు కూడా మ్యూజియంలో ఉన్నాయి. ఈ సారి భద్రాద్రి రాముని దర్శనానికి వెల్లినప్పుడు తప్పక చూడండి మ్యూజియంను తరించండి...
