ధ్యైర్యానికి ప్రాణస్నేహితుడు.. పిరికితనానికి బద్ద శత్రువు భగత్ సింగ్.! ప్రతి వ్యక్తి ఒకే జన్మలో రెండుసార్లు పుడతారు ఒకసారి తల్లిదండ్రులకు పుడితే ఇంకోసారి ఆ పుట్టుకకు అర్ధం తెలుసుకున్నప్పుడు మరొక్కసారి పుడతారు.. తాను ఎందుకోసం పుట్టాడో అని మిగిలిన వారికి యుక్త వయసులో తెలిస్తే భగత్ సింగ్ కు మాత్రం తన బాల్యంలోనే తెలిసిపోయింది. మిగిలిన తల్లిదండ్రులు నా కొడుకు ఇంజనీర్/డాక్టర్ లా పెద్ద ఉద్యోగం చేయాలని కారు, పెద్ద ఇల్లుతో సంపన్నులమవ్వాలని వారి పిల్లలకు హితభోద చేస్తారు.. కాని భగత్ సింగ్ తల్లిదండ్రులు మాత్రం వారి కొడుకు గొప్ప దేశభక్తుడై దేశం గర్వించ దగ్గ పౌరుడిగా ఎదగాలని భగత్ సింగ్ కు నూరిపోశారు. భగత్ సింగ్ మాత్రమే కాదు ఆయన కుటుంబ సభ్యులు కూడా స్వాతంత్ర సంగ్రామంలో ఎన్నో పోరాటాలు చేశారు. ఒకానొక సందర్భంలో భగత్ సింగ్ బాబాయ్ అజిత్ సింగ్ బ్రిటీష్ వారిపై పోరాటం చేస్తున్న సమయంలో అనుకున్న సమయానికి ఇంటికి రాకపోతే వెక్కి వెక్కి ఏడుస్తున్న పిన్ని కన్నీళ్ళను తుడుస్తూ "బాధపడకు పిన్ని.. బాబాయ్ తప్పక వస్తాడు, ఒక వేళ రాకపోయినా మీరు గర్వంగా ఉండండి.. ఆయన దేశం కోసం ప్రాణత్యాగం చేసే అద్భుత అవకాశం వచ్చి ఉంటుంది. తొందరలో నేను కూడా బాబాయ్ లా బ్రిటీష్ వారిపై పోరాటం చేస్తా.. నా తల్లిని దాస్య సంకెళ్ళ నుండి విముక్తురాలిని చేస్తా అంటూ ప్రతిజ్ఞలు చేసేవారు.
భగత్ సింగ్ వీరోచితంగా చేస్తున్న దాడులకు బ్రిటీష్ వారికి వెన్నులో వణుకు పుట్టేది.. ఆ క్రమంలోనే భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురు లను పట్టుకుని ఉరిశిక్ష విధించింది. భగత్ సింగ్ ఎక్కడ ఉంటే అక్కడ భారతీయుల కోసం వారి సమస్యలపై పోరాడేవారు. ఆకరికి చివరి రోజుల్లో జైలులో ఉన్న కూడా జైలులోని ఎన్నో సమస్యలపై పోరాటం చేశారు.
నిజానికి భగత్ సింగ్ క్షమాభిక్ష కోరితే బ్రిటీష్ వారు అంగీకరించేవారు ఒక బలమైన షరతుతో. ఇక ఎన్నటికి స్వాతంత్రోద్యమంలో ఏ రకంగా కూడా పోరాటం చేయకూడదు అని..! "నేను(భగత్ సింగ్) చావనైనా చస్తాను కాని నా దేశాన్ని ఆక్రమించుకున్న వారి పాదాల దగ్గర నా తలపెట్టను, నాకు బ్రతకాలనే కోరిక లేదు అని చెప్పలేను కాని ఒకవేళ బ్రతికితే మాత్రం ఒక బానిసగా బ్రతకును.! నేను ఈ వయసులోనే ఎన్నో చేశాను నా పేరు వినగానే భారతీయుల గుండెల్లో దేశభక్తి ధ్యైర్యంగా ఉదయిస్తుంది అది చాలు..! ఒక్క భగత్ సింగ్ పోయినా నా దేశానికి వచ్చే నష్టమేమి లేదు. కాని నా చివరి కోరిక ఒక్కటే నన్న ఉరితీయకండి.. కాల్చి చంపండి..! ఉరితీస్తే నేను గాలిలో వేలాడాల్సి వస్తుంది అదే తుపాకితో కాల్చితే నేను నా తల్లి భారతమాత ఒడిలో ఈ భూమి మీద హాయిగా చనిపోయే అవకాశం వస్తుంది.." నా నెత్తురు ఈ గడ్డ మీద పడి నా లాంటి భగత్ సింగ్ లు ఎంతోమంది పుడతారు.. అని బలంగా పరితపించి తుపాకితో కాల్చాలని అప్పటి పంజాబ్ గవర్నర్ కు ఉత్తరం కూడా రాశారు. కాని భగత్ సింగ్ చివరి కోరికను నెరవేర్చకుండా ఓ సూర్యాస్తమయం పూట ఉరితీశారు.
భగత్ సింగ్ అనుకుంటే క్షమాభిక్ష వేడుకొనవచ్చు కాని అది స్వాతంత్ర ఉద్యమాన్ని పలుచన చేస్తుంది.. భారతీయులు అంటే ప్రాణానికి భయపడేవాళ్ళు అని బ్రిటీష్ వారికి ఒక నమ్మకం ఏర్పడి భారత స్వాతంత్రాన్ని మరింత వ్యతిరేకించేవారు. అందుకే భగత్ సింగ్ వెనకడుగు వేయలేదు.. ఆకరికి భగత్ సింగ్ చావులో కూడా స్వాతంత్ర పోరాటం చేశారు. దేశభక్తి ఉన్నంతకాలం భగత్ సింగ్ జీవించి ఉంటాడు. ఇంక్విలాబ్ జిందాబాద్..!