దేశంలో దేశభక్తి ఉన్నంత కాలం భగత్ సింగ్ బ్రతికే ఉంటాడు. దేశం కోసం తండ్రిని కుటుంబ సభ్యులను సైతం ఎదురించగల సామర్ధ్యం, తెగింపు ఉన్నవాడు. భగత్ సింగ్ వివిధ సందర్భాలలో వివిధ వ్యక్తులకు ఉత్తరాలు రాశారు. ఓసారి కోర్టు వారికి కూడా ఉత్తరం రాశారు "నన్ను ఉరి తియ్యకండి కాల్చి చంపమని.. ఉరితీస్తే గాలిలోనే ప్రాణం పోతుంది.. అదే కాల్చిచంపితే నా నెత్తురు ఈ నేల మీద పడుతుంది.. తన ప్రాణం ఈ భారత భూమి ఒడిలో పోతుందనే కోరిక". అలాంటి భగత్ సింగ్ ఉత్తరాలలో ఒక మూడు ఉత్తరాలను ఇక్కడ పొందు పరుస్తున్నాము.. (మా నెత్తురు వృధా కాదు పుస్తక సౌజన్యంతో..)
పెళ్లికి ఒప్పుకోమని భగత్ సింగ్ కు నాన్న కిషన్ సింగ్ గారు ఉత్తరం రాశారు.. అందుకు జవాబుగా భగత్ సింగ్ గారు రాసిన లేఖ. (అప్పటికి భగత్ సింగ్ వయసు 16సంవత్సరాలు.) భగత్ సింగ్: పూజ్యులైన నాన్న గారికి.. 33కోట్ల ప్రజల తల్లి భరతమాత ఎంతోకష్టంలో ఉంది.? అది ఆలోచించరేం? మనం అందుకోసం సర్వస్వాన్ని త్యాగం చెయ్యాలి. మీ ఉత్తరం చదివి నేను ఆందోళన చెందాను. మీ వంటి దేశభక్తుడు, వీరుడు ఇటువంటి అల్ప విషయాలను పట్టించుకుంటే, ఇక మామూలు మనిషి మాటేమిటి? ఇది పెళ్లిచేసుకునే వయసు కాదు. దేశం నన్ను పిలుస్తుంది. నేను మనసా వాచా, ఆర్ధికంగా దేశసేవ చేస్తానని ప్రతిజ్ఞ చేశాను. పైగా ఇదేమి మనకు కొత్త కూడా కాదు. మన కుటుంబమంతా దేశభక్తికే అంకితమయ్యింది. నేను పుట్టిన రెండు మూడేళ్ళ తర్వాత 1910లో ఒక చిన్నాన్న అజిత్ సింగ్ దేశం నుంచి బహిష్కరించబడి, విదేశాలలో బ్రతుకుతున్నారు. మీరు కూడా జైలులో ఎన్నో యాతనలు అనుభవించారు. నేను కూడా మీరు నడచిన తోవలోనే నడుస్తున్నాను. అందుకే ఈ సాహసానికి ఒడిగట్టాను. మీరు నా యందు దయవుంచి నన్ను వివాహబంధంలో ఇరికించకండి. నా ఆశయంలో విజయుణ్ణి అయ్యేలా ఆశీర్వదించండి. నేను నా జీవితాన్ని మాతృభూమికి సంబంధించిన ఉన్నత ఆశయాలకు అంకితం చేస్తున్నాను. అందువల్ల నాకు కుటుంబ సుఖాలు అనుభవించాలని లేదు. మీకు గుర్తు ఉండే ఉంటుంది. నాకు జంధ్యం వేస్తూ తాతగారు నన్ను దేశసేవకి అర్పిస్తున్నానంటూ నలుగురి మధ్య ప్రకటించారు నేను కేవలం ఆ ప్రతిజ్ఞని పరిపూర్తి చేస్తున్నాను. నన్ను క్షమించగలరని ఆశిస్తున్నాను. -మీ సేవకుడు భగత్ సింగ్.
ఈ ఉత్తరం నాన్నకు పంపిన తర్వాత ఒక సందర్భంలో వివాహం గురుంచి భగత్ సింగ్ ఇలా చెప్పారు.. "మిత్రులారా.. మీకో విషయం చెబుతున్నా ఈ పరాధీన దేశంలో నాకు పెళ్లంటూ జరిగితే మృత్యువే నా వధువు, నా శవయాత్రే పెళ్లి ఊరేగింపు, అమరవీరులే పెళ్ళిపెద్దలు."
2. భగత్ సింగ్ కు కోర్టు ఉరిశిక్ష విధించింది.. ముల్తాన్ అనే జైలులో ఖైదీగా ఉన్న తన సహచరుడు బాటుకేశ్వర్ దత్ కు ఉద్విగ్నంగా భగత్ రాసిన లేఖ. ప్రియ భాయ్.. నాకు ఉరిశిక్ష పడింది. ఈ సెల్స్ లో నేను గాకుండా ఉరితీత అమలుకోసం ఎదురుచూసే అపరాదులెందరో ఉన్నారు. ఈ ఉరిశిక్ష తప్పిపోవాలి భగవంతుడా అని వాళ్ళు ప్రార్ధిస్తున్నారు.. వాళ్ళందర్లోకీ తప్ప పుట్టినవాణ్ణి నేనొక్కణ్ణేమో.. నా ఆశయాల కోసం ఉరికొయ్యకు వెళ్ళాడే అదృష్టం ఎప్పుడు కలుగుతుందా? అని ఆరోజు కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్న వాణ్ని. నేను సంతోషంగా ఉరికొయ్య మీదకి ఎక్కి, విప్లవకారుడు తన ఆశయాల కోసం వీరునిలా ఎంతటి ఆత్మత్యాగం చెయ్యగలడో ప్రపంచానికి ఎలుగెత్తి చాటుతాను. నాకు ఉరిశిక్ష పడితే నీకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. నువ్వు జీవిస్తావు.. జీవిస్తూనే లోకానికి చూపించాలి. విప్లవకారుడు తన ఆదర్శాల కోసం కేవలం మృత్యువును వరించడమే కాదు; జీవిస్తూనే ప్రతిక్షణం ఎదుర్కొనగలడు కూడా - అని లోకానికి చూపించాలి. మృత్యువు కుటుంబ కష్టాల నుండి విముక్తి పొందే సాధనం కారాదు. విప్లవకారుడు పొరబాటున ఉరిశిక్ష అమలునించి తప్పిపోవడం తటస్థిస్తే - తను తన ఆశయాల కోసం ఉరికంబం ఎక్కడమే కాదు, జైలు చీకటి కొట్టులో సైతం నికృష్టమైన తరగతికి చెందిన అత్యాచారాలను సైతం భరించగలడని లోకానికి నిరూపించాలి. -మీ భగత్ సింగ్.
3. భగత్ సింగ్ కు ఉరిశిక్ష విధించిన తర్వాత కుటుంబసభ్యులు చివరిసారిగా కలుసుకున్నారు. ఆ తర్వాత పెద్ద తమ్ముడు కులబీర్ సింగ్, చిన్నతమ్ముడు కులతార్ సింగ్ లకు చివరిసారి రాసిన ఉత్తరం. మార్చి 3, 1931, లాహోర్ సెంట్రల్ జైలు. ప్రియతమ కులబీర్ సింగ్.. నాకోసం నువ్వు చాలా చేశావు. గతసారి నన్ను కలిసినప్పుడు నీ ఉత్తరానికి జవాబుగా నాలుగు ముక్కలు రాయమని చెప్పావు. రాస్తున్న చూడు. నేను ఎవరికీ ఏమి చేయలేదు. నీకు కూడా. ఇక ఇప్పుడు మిమ్మల్ని కష్టాలలో విడిచి వెళ్లిపోతున్నా. నీ బ్రతుకేలా తెల్లవారుతుంది? పోషణ ఎలా జరుగుతుంది? ఇవన్నీ ఆలోచించుకుని వణికిపోతున్నాను. కానీ భాయి! ధైర్యంగా ఉండు. కష్టాల్లో సైతం బెంబేలు పడిపోకు. ఇంతకి తప్ప నేనేమి చెప్పను. నువ్వు అమెరికా వెళ్లగలిగితే చాలా బావుణ్ణు. ఐతే ఇప్పుడు అది కూడా అసాధ్యంగా తోస్తుంది. నెమ్మది నెమ్మదిగా కష్టపడి చదువుకో. ఏదైనా పని నేర్చుకోగలిగితే చాలా మంచిది. ఐతే ఏం చేసినా నాన్నగారి సలహా తీసుకొని చెయ్యి. సాధ్యమైనంత వరకు అంతా ఐక్యమత్యంతో జీవించండి. నాకు తెలుసు.. ఈనాడు నీ గుండెల్లో దుఃఖం సముద్రంగా మారి, అందులోంచి ఉవ్వెత్తున అలలుగా లేస్తున్నాయి. ఐనా ఏం చెయ్యను? ధైర్యంగా ఉండు. నా ప్రియమైన, ఎంతో ప్రియాతి ప్రియతమైన భాయి! జీవితం బండరాయి. లోకానికెలాంటి మోహమాటము లేదు. అందరూ నిర్ణయాలు, కేవలం ప్రేమ, ధైర్యంతోనే బతుకులు వెళ్ళమార్చుకోవాలి. కులతార్ సింగ్(చిన్న తమ్ముడు) చదువు గురుంచి కూడా నువ్వే చూసుకోవాలి. మనసు సిగ్గుతో చచ్చిపోతుంది. బాధపడటం కన్నా నేనేం చేయగలను.? ప్రియమైన కులతార్.. ఈవేళ నీ కళ్ళమ్మట కన్నీరు చూసి, నా మనసు విలవిల్లాడిపోయింది. ఈవేళ నీవు వాడిన మాటల్లో ఎంతో వ్యధ నిండిఉంది. నీ కన్నీరుని నేను భరించలేకపోయాను. ఒరేయ్ భాగ్యశాలి! స్థిమితంగా చదువుకో.. నీ ఆరోగ్యం జాగ్రత్త. ధైర్యంగా ఉండు. ఇహనేం రాయనూ! వాడిదొక్కటే ధ్యాస క్రూరత్వంలో కొత్త పద్దతులెలా కనిపెట్టాలని నా తపన వేరు అత్యాచారాల నెలా అంతమొందించాలని నరకం అంటే కోపమెందుకు.? ఆకాశాన్ని నిందించడం దేనికి.? లోకమంతా అన్యాయం నిండి ఉంటే, రా.! ఎదుర్కొని పోరాడుదాం.! నేను కొద్దిక్షణాల అతిధిని పొద్దు పొడుపుని సూచించే వేగుచుక్కని ఆరిపోవడం అంటే భలే ఇష్టం నాకు నా చుట్టూ గాలిలో చైతన్యపు విద్యుత్తు ప్రవహిస్తోంది పిడికెడు బుగ్గి క్షణికమైనది ఉంటే ఎంత.? లేకుంటే ఎంత.? సుఖంగా ఉండు తమ్ముడూ! సాగిపోతున్న పయనమై ధైర్యంగా ఉండు.. నమస్తే -నీ గురుంచి సదా ఆలోచించేవాడు భగత్ సింగ్