తిరుపతికి చెందిన దుర్గం భావన తనలోని అద్వితీయమైన అందంతో మిస్ ఇండియా, మిస్ యునివర్స్ లేదంటే సినీ వినిలాకాశంలో పయణించాలని ఏనాడు అనుకోలేదు. కాకపొతే ఒక సంఘటన తన గమనాన్ని పూర్తిగా మార్చివేసింది.
తనవల్ల సమాజానికి ఏదైనా మంచి జరగాలని భావన నిత్యం తపిస్తూ ఉండేది. సాధారణంగా కార్పొరేట్ స్కూల్ లో చదువుకుంటున్న పిల్లల కన్నా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలు కొంత వెనుకబడి ఉంటారు. అది ఆర్ధికంగా కానివ్వండి, టెక్నాలజీ విషయంలో కానివ్వండి. స్వతహాగా వారిలో కష్టపడే మనస్తత్వం ఉండడం వల్ల చిన్న చిన్న సజెషన్స్, టిప్స్ ఇచ్చినా కాని వారు దూసుకుపోతారు. ఈ కోవలోనే "ఐ-టీచ్" అనే స్వచ్చంద సంస్థలో భాగస్వామిగా చేరి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలకు టీచింగ్ ఇచ్చేవారు.
ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లల్లో చాలామంది కాలికి చెప్పులు లేకుండా కిలోమీటర్లు కాలినడకన వచ్చేవారు.. ప్రభుత్వ స్కూల్స్ లో చాలావరకు ఏ విధమైన సౌకర్యాలు లేకుండేవి. వాష్ రూమ్ ఫెసిలిటి, సీలింగ్ పెచ్చులు ఊడిపోయి పిల్లల మీద పడిపోవడం, ఆఖరికి మంచినీటి సధుపాయం కూడా లేకపోవడం భావనను ఎంతగానో కలిచివేసింది. రేపటి భారత పౌరులు చదువుకునే ఇలాంటి స్కూల్స్ భారతదేశమంతటా ఉన్నాయి. వీటిని మార్చాలి.. కాకపొతే వీటి ప్రక్షాళనకు నిధులు అధిక స్థాయిలో అవసరమవుతాయి. ఈ మధనంలోనే భావన ఓ బలమైన నిర్ణయానికి వచ్చారు.
అమ్మ నాన్నలు పుట్టుకతోనే నాకో బలమైన ఆస్థిని అందించారు. ఆ ఆస్థి అందం. ఈ అందం ద్వారా తనకంటూ జాతీయ స్థాయిలో ఓ గుర్తింపును తెచ్చుకుంటే తాను అనుకున్న లక్ష్యం త్వరగా నెరవేరుతుంది అనే ఆలోచన నుండే ఫెమినా మిస్ ఇండియా పోటీలలో పాల్గొన్నది. కర్ణాటక బి.ఎం.ఎస్ కాలేజీలో మెడికల్ ఇంజినీరింగ్ థర్డ్ ఇయర్ లో ఉన్న భావనకు మోడలింగ్ రంగం మీద ఏ విధమైన అవగాహన లేదు. కేవలం ఇంటర్నెట్ ద్వారానే రీసెర్చ్ చేసింది. మనసు దృఢత్వం కోసం యోగా, శరీర దృఢత్వం కోసం ఫిజికల్ ఎక్సెర్సయిస్ చేస్తూ, కరెంట్ అఫైర్స్ మీద కూడా అవగాహన ఏర్పరుచుకుంది.
అలా కర్ణాటక తరుపున 500 మంది పోటీ పడితే కేవలం 15 మంది మాత్రమే ఎంపికయ్యారు ఆ 15 మందిలో భావన ఒకరు. 15 మందిలో ఒకరు మిస్ కర్ణాటక టైటిల్ పై విజయం సాధించారు. ఆ విజేత కూడా దుర్గం భావన నే. ఈ పోటీలు మిస్ ఇండియా పోటీలకు అంతర్భాగంగా వ్యవహరిస్తారు. మే 21 నుండి జూన్ 24 వరకు జరిగే ఫెమినా మిస్ ఇండియా పోటీలలో కూడా తన బెస్ట్ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నది భావన. మిస్ కర్ణాటక గా విజయం సాధించిన తర్వాత కొన్ని యాడ్స్ చేసే అవకాశం కూడా అందుకున్న భావన స్కూల్స్ కోసం చేస్తున్న పోరాటాన్ని నెమ్మదిగా మొదలుపెట్టారు.
ఈ ప్రకృతి ప్రతి ఒక్క వ్యక్తికీ ఓ ప్రత్యేకమైన టాలెంట్ ను ఆస్థి రూపంలో అందించింది. చాలా మంది ఆ ఆస్థిని తమ సొంత ఆనందం కోసం ఉపయోగించుకుంటుంటే దుర్గం భావన లాంటి అతికొద్ది మంది మాత్రమే సమాజానికి ఉపయోగపడుతుంటారు. పేదలకు మాత్రమే కాదు పేదలకు సహాయపడే వారికి సైతం మనం అండగా నిలబడాలి.