Contributed by Bharat Raj.V
Urgent గా alarm 5 గంటలకే మోగేసింది కనీసం కనికరం లేకుండా, దాని గోల భరించడం కన్నా కంటున్న కలని మధ్యలో ఆపేయడం మంచిదని లేచి మళ్ళీ రేపు 5 వరకూ అరవకుండా దాని నోరు నొక్కేసింది.
బద్దకాన్ని బాధ్యతలు overcome చేస్తుంటే భారంగా పైకి లేచి బయటికొచ్చి తన పిల్లలు రాత్రి ఇల్లంతా అలంకరించిన ఆటవస్తువులు, పుస్తకాలు,పేజీ ముక్కలు అన్నింటిని తమ తమ స్థానలకు పంపేసింది. రాత్రి కడుపు నింపిన కంచాలు ఖాళీగా గుంటలో పడ్డ ఏనుగు పిల్లలా వాసనతో అరుస్తున్నాయ్, పిలుస్తున్నాయ్... వాటిని కాపాడి cupboardలో పెట్టింది.
Stove వెలిగించి పాలు పైన పెట్టి, అవి పైకొచ్చి పిలిచేలోపు వచ్చేయొచ్చనుకుని పిల్లల్ని లేపడానికని ఆ పక్క గదిలోకెళ్ళింది, పిల్లల పక్క దగ్గరకి వెళ్ళి తన ప్రేమనంతటిని నుదిటిపైన పెట్టి తట్టి లేపింది.
కాసేపు ఖాళీగా ఉన్నాదనుకున్నాయేమో ఆ పాపిష్టి పాలు అదే అదునుగా చూసుకుని చట్టుకున కిందకి దూకేసాయ్, గట్టిగా నవ్వుకుంటున్నయ్ అహా నవ్వు కాదది వికటాట్టహాసం దిగ్విజయంగా ఇంకో పని పెంచేసామనుకుని. రెండు అడుగులు ఒక్కటిగా చేసుకుని పరుగెత్తినా లాభం లేకపోయింది పాపం ఆమెకి, యదావిధిగా తలకొట్టుకుని ఆకోపాన్ని పిల్లల మీద అరిచింది లేచి ready అవ్వమని.
ఆ అరుపుతో ఆరంభం ఆ ఇంట్లో ఉరుకులు. పిల్లలొచ్చేలోపు tiffin ready చేసి table పైన ప్రదర్శనకు పెట్టింది, museum కెళ్ళి తవ్వకాలలొ బయట పడ్డ వస్తువుని చూసినట్టు చూస్తారే తప్ప తినరు, ముందు వరకు వచ్చింది నోటి దాకా రాకపోతుందా అన్న నమ్మకం అనుకుంటా, అది అర్ధం చేసుకుని చేసేదేమీలేక నోటికందించింది, మొత్తం మాములుగా తినేస్తే అలుసైపోరూ పిల్లలూ. అందుకే ఇల్లు వాకిల్లు ఒక round వేసి సంగం తిని ఇంకోసంగం కింద వెదజల్లి ఆఖరికి అయ్యిందనిపించుకునేసరికి, నన్నొకదాన్ని ఇక్కడ పెట్టి చచ్చావ్ గా ఎక్కువ సార్లు అరిస్తే ఇడ్లి గట్టిగా చేసానని నాకు చెడ్డపేరు, వచ్చి నన్ను కట్టి చావు అన్నట్టుంది ఆ ఇద్లి cooker అరుపు, వెంటనే వెళ్ళి cooker ఆపేసి ఇడ్లి hot pack లోకి తీసింది, వేడి తగ్గితే వేడేక్కిపోతారు శ్రీవారు.
అన్నట్టు అయ్యగారికి coffee నీళ్ళు గొంతులో పోస్తేగాని నిద్ర లేవరు అని గుర్తుచేసింది పక్కనున్న కాఫి కప్పు.వెంటనే పతి దేవుడి ముందు ప్రత్యక్షం కాఫి కప్పుతో నవ్వుతూ నుంచుంది ఆయన ముందు. కాఫి కప్పు బాగ పెద్దదనుకుంటా పాపం ఆమె మొహం కూడా కనపడనట్టు కప్పు తీసుకుని తాగడం మొదలు పెట్టాడు, అలవాటైపోయిన అవమానం కదా పెద్దగా నొప్పిలేదు, కాదు చూపించలేదు తను.
మళ్ళీ తిరిగి వెళ్ళిపోయింది ఆ వంటకారణ్యంలోనికి ఒంటరిగా ఎదురొచ్చిన వంకాయల్ని మిరపకాయల్ని నరికిపారేసింది దెబ్బకి కూరై కూర్చున్నాయన్ని. పొగలు పోకుండా మూతపెట్టి ఊపిరి పీల్చుకుంది ఒక పని అయ్యిందని, పాపం ఆ ప్రాణానికి గుర్తు రాలేదు తనకు ఏళ్ళొచ్చి ఎదిగిన పిల్లాడు ఒకడున్నాడని అది గుర్తోచ్చేలోపే order వినిపించింది.
ఆయన కూర్చున్న మంచానికి నూట యనబై రెండు point ఎనిమిది ఎనిమిది centimeters దూరంలో bathroom లో కుడి పక్క గోడమీద నూట ఇరవై ఒకటి point తొమ్మిది రెండు centimeters ఎత్తులో ఉన్న water heater switch on చెయ్యమని, రెండే రెండు గదుల దూరం లో బోడి వంట చేస్తున్న ఆవిడ వచ్చి switch on చేసి వెల్లిపోతూ ఉంది... ఇచ్చిన దానిని తిరిగి తీసుకెళ్ళాలని కూడా తెలీదు పిచ్చి మారాణికి అన్ని భర్తతో చెప్పించుకోవాలి, అరుపుకి వెనక్కి వచ్చి మతి మరుపు అన్న బిరుదుతోపాటు కాఫి కప్పు కూడా తీసుకుకెళ్ళింది.
అంతలో అరుచుకుంటూ వచ్చింది పిల్లల బండి, వాళ్ళకి బ్రతుకు పరుగు నేర్పడానికి పరుగెత్తుకుంటూ మరీ ఎక్కించింది, చేతుల్తో అయితే మాత్రం వదిలి వచ్చేసింది గాని మనసుతో మాత్రం ఇంకా పట్టుకునే ఉంది జిగురులా ఎలా తింటారో ఎలా ఉంటారో అని అదేదో మొదటిసారి అన్నట్టు.వెన్నక్కి రాగానే సోఫా లో కూర్చుని మొహం మొత్తం పేపర్లో పెట్టేసి ధర్మరాజు నాన్న గారిలా తీర్పిచ్చాడు "బద్దకం వదిలి కొంచెం ముందు లేస్తే అలా పరుగెత్తక్కర్లేదు కదా" అని, కదా! మరీ ఇంత చిన్న logic ఎలా మిస్సైందో ఈ మిస్సెస్.
నిట్టూరుస్తూ గడియారం వైపు చూసింది, ఇంకో 10ని"లో 9 ఐపోతా అని బెదిరించింది గడియారం, అది ఆయన tiffin time అది దాటితే ఆయన టిఫ్ఫిన్ దాటెస్తారు, తను ఆకలి తట్టుకోలేడు, వెంటనే ఆయన ముందు ఇడ్లి ప్రదర్శన పెట్టింది మూత పెట్టి దాచిన పొగలు రుజువు చూపించింది ఇంకా వేడిగానే ఉన్నాయని.
Plate లో పెట్టి అవి ఆయన నోట్లోకెళ్ళేటప్పటికి తన నోరు శుభ్రం చేసుకుందామనుకుని ఆ విషయం చెప్పి "ఇంకా చెయ్యకుండా ఏం చేస్తున్నావ్ అన్న complimentని వెంట తీసుకెళ్ళింది.కొంచెంసేపు ఆగితే తప్పేముంది కక్కుర్తి కాకపోతేనూ, తినే వరకు ఉండొచ్చుగా, వెళ్ళి క్షణం అయ్యిందోలేదో వెంటనే పిలుపు పచ్చడిలో ఉప్పు తక్కువయ్యిందని. పక్కనే ఉందిగా వచ్చి ఇవ్వొచ్చుగా అరుపులు లాంటి విసుగులు వినిపిస్తే గాని రాలేదు బయటకి భద్రకాళిలా నోట్లో brush పెట్టుకుని. అక్కడెక్కడో dining table కి అవతలవైపు ఉన్న salt డబ్బా తెచ్చి ఇచ్చింది, పాపం ఎంత ఆకలేస్తుందో మరి వెంటనే లాక్కున్నాడు డబ్బాని విస్తుగా...
అతను officeకని అడుగు బయట పెట్టడానికి ఎన్ని అడిగి తెచ్చుకోవలసివచ్చిందో పాపం అతనికి, బట్టలు ఇస్త్రీ చేయించుకోవాలి, టై వెతికిపెట్టించాలి, office files అన్ని ఒక చోటకి తెప్పించుకోవాలి, shoe polish చేయించుకోవాలి, అప్పుడప్పుడూ అరవాలి, carrier పెట్టించుకోవాలి, వీటన్నిటి మధ్యలో బలం రావడానికి పాలు తాగి పెట్టాలి, అబ్బో ఆవిడగారితో ఇన్ని చేయించడానికి అతని కష్టం ఆ దేవుడికే తెలియాలి.
గడియారం గుర్తుచేసింది పాప నీకు పావుగంటే ఉంది పట్టాలెక్కడానికి అని, అంతే పరుగందించుకుంది, పాదం ఇంటి బయట పెట్టడానికి పది నిమిషాలు కూడా పట్టలేదు, పది గంటలకల్లా పాదం పట్టాలపై ఉంది,
ఎక్కడైనా కూర్చోవడానికి ఖాళీ ఉందేమో చూడమని కాళ్ళు కీళ్ళూ కల్లకి మోరపెట్టుకున్నాయ్, కూర్చోవడానికి ఖాళీలేదు సరికదా కనీసం నుంచోవడానికి చోటు దొరికింది సంతోషపడు అన్నటుంది అక్కడ పరిస్థితి.ఆ ఇరుకులో ఎవరెవరో ఎక్కడెక్కడో తగలడాలు, రాసుకోవడాలు, మాటల్లో చెప్పలేని పలకరింపులు, అన్నీ తప్పనివి, తప్పించుకోలేనివి ఆఖరికి తప్పులేనివి ఐపోయాయ్ ఈమధ్య. అవన్నిటిని తలకెక్కించుకుంటే తట్టుకోలేమని తెలుసుకుని, తలవంచుకుని తెగిపోడానికి తెగ ఉభలాటపడిపోతున్న తన చెప్పులని చూసుకుంది, అరిస్తే దానికి అర్దంకాదు అని అర్థం చేసుకుని నిట్టూర్చి తను దిగాల్సిన stop వచ్చి కదిలింది...
అరగంట ఆలస్యంగా office లో అడుగుపెట్టిందోలేదో అందరూ కళ్ళతోనే ఆరాలు మొదలుపెట్టేసారు, లేని, రాని, కాని, నవ్వుని సమాధానంగా పడేసింది అందరికి, ఎందుకో ఆ క్షణం తన జాగా జర దూరంగా అనిపించింది తనకి.
మహానుభావుల మాటలకి చేష్టలకి అర్దాలే వేరని ఎందుకు నవ్వాడో తెలీదు BOSS గాడు తనని చూసి, అంతే 3rd Umpire runout declare చెయ్యగానే fielders అందరూ ఒక దగ్గరగుమ్మికూడీనట్టు అందరూ ఒకదగ్గరకి ఒక topic తో ఎక్కడా ఎప్పుడూ లేని ఐకమత్యంతో గుస గుసలాడుకోవడం మొదలుపెట్టారు, గుసగుసలంటే పక్కవాళ్ళకి వినపడకుండా మాట్లాడుకోవడం అన్న minimum జ్నానం కూడా లేకుండా గుసగుసలాడుకుంటున్నారు.
ముందున్న computer screen నేలకేసి కొట్టి "shutup, నాకేమి సంబంధం లేదు" లాంటి అరుపులు అరుద్దామనుకుంది కాని అవి ఆ చెవులకి కనపడవని, వాళ్ళ దిగివతరగతి దిగజారుడుతనాన్ని అర్థం చేసుకుని, 6 అయ్యే వరకూ అనుచుకుని అడుగు బయట పెట్టింది.
ఇంటికొచ్చేసరికి పొద్దున్న కంగారులో మర్చిపోయిన గిన్నెలు, పరుపులు అన్నిటిని పలకరించేసి, పెద్దేదో పొద్దున్ననుండీ కష్టపడిపోయునదానిలా టీ పెట్టుకుంది, దాన్ని కప్పులో వేసుకుని తగుదునమ్మా అన్నట్టు తాగడానికి తయారయ్యింది, ఇలాగే వదిలేస్తే relax ఐపోదూ అందుకే తను కప్పు నోటి దగ్గరకి తెచ్చుకునేసరికి భళ్ళుమని తపులు తెరుచుంటూ దానికంటె పెద్దగా ఆనందంతో అరుస్తూ పిల్లలు లోపలికి వచ్చారు, వాళ్ళని చూసిన వెంటనే టీ కప్పు పక్కన పెట్టేసి వాళ్ళ దగ్గరకి వెళ్ళి ఆలింగనాలు, ఆరాలు అన్ని అయ్యాక వాళ్ళని మళ్ళా ready చేసి tution కి పంపేసింది, వీటన్నిటి మధ్యలో పాపం ఆ టీ కప్పు పొగలతో పిలుస్తుంది అరుస్తుంది చల్లారిపోతున్నా అని, అలా అరిచి అరిచి ఆఖరికి అనగారిపోయి చల్లారిపోయింది.
అంతలో రసం పీల్చేసిన మామిడిపండులా ఆయన అడుగుపెట్టారు, వచ్చి కుర్చీలో కూలబడిపోయి కళ్ళజోళ్ళు కాళ్ళజోళ్ళు విప్పుతూ తియ్యటి విసురులాంటి అరుపుతో మంచినీళ్ళు order ఇచ్చారు, అడిగిన అరక్షణానికి గాని తేలేదు ఆ ఇళ్ళాలు, బయటా పనిచేసి, ఇంట్లో ఈమెగారితో పనిచేయించుకుని అబ్బబ్బా ఆయన కష్టం పగోడికి కూడా రాకూడదు. పాపం ఆ కష్టానంతటిని మంచినీళ్ళతోనే దిగమింగుకునీ, ఆ కళ్ళ జోళ్ళు కాళ్ళ జోళ్ళు, Bagలు ఎక్కడ పెట్టాలో జాగ్రత్తగా చెప్పి అప్పటికి గాని స్నానానికి వెళ్లడం కుదరలేదు పాపం అతనికి.
తను తిరిగొచ్చేలోపు dining table మీద పొగలతో పిలుస్తున్న టీ ఉంది, ఎదురుగా t.v లో మనల్ని పనిచేయకుండా కూర్చోపెట్టడానికి కష్టపడి పనిచేసే ఒక anchor, assemblyలో చోటులేకో, mike ఇవ్వకో అక్కడికొచ్చిన ఇద్దరు మంత్రులు అరుపుల మధ్యలో మాట్లాడుకుంటున్నారు అదేదో ఆడవాళ్ళ హక్కులకోసం... మహిళా సాధికారత లాంటి పెద్దపెద్ద పదాలు వాడుతూ ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తే అభివ్రుద్ది ఉంటుందని ఒకడు, ఆడది గడప దాటి అడుగు బయటపెడితే అంతకన్నా పరువుతక్కువపని ఉండదని ఇంకొకడు వాదించుకుంటున్నారు. అది చూస్తూ dining table అవతల వైపు కూర్చుని కూరగాయలు కోస్తున్న తన భార్య వైపు చూసి
భర్త: అసలు ఈ మగాళ్ళు ఎందుకింత narrow minded గా ఉంటున్నారు, ఆడాళ్ళు ఉద్యోగం చేస్తే ఎమైంది, ఇంటి పని చేస్తూ బయట ఉద్యోగం చేసుకోకూడదా, ఇంటి బాధ్యతలు ఇద్దరూ మోస్తే తప్పెంటి? అందరూ ఇంటి పనీ వంటపనీ ఆడవాళ్ళదే అన్నట్టు అది తప్ప ఇంకేమి చెయ్యకూడదన్నట్టు మాట్లాడతారేంటి, ఈ mindset ఎప్పుడు మారుతుందో, ఇప్పుడు నువ్వున్నావ్ నేను నిన్ను బయట ఉద్యోగం చెయ్యడానికి allow చేస్తున్నాగా, ఇంటి బాధ్యత ఇద్దరం చూసుకుంటున్నాం గా ఎమైనా ఐపోయిందా ఇప్పుడు? అని ఆయన చెప్తున్న మాటల్ని వింటూ కూరగాయల్ని కోస్తుంది. అంతలో ఆయన వెనక ఎక్కడో... రెం...డ...డు...గుల దూరం లో ఉన్న stove మీద అన్నం పొగడం చూసాడు... అంతే గబగబా వెన్నక్కి తిరిగి పక్కనే dining table అవతల వంటగదికి నాలుగంటే నాలుగే అడుగుల దూరంలో పనిలేక కూరగాయల్ని కోస్తున్న తన భార్యతో
" లక్ష్మీ అన్నం పొంగుతుంది వెళ్ళి కట్టు" అని అరిచాడు అది విని ఇప్పటివరకూ తన భర్త చెప్పిన మాటలు గుర్తోచ్చి ఆయన వైపు ఆత్మీయతతో కూడిన జాలితో ఒక చూపు చూసి తన పని చేసుకోవడానికి వెల్లిపోతుంది.....