ఈ మధ్యనే మనం ఈ నల్ల కోళ్ళను చూస్తున్నాము కాని వివిధ కణజాలాలతో ఇదేమి ల్యాబ్ లలో అభివృద్ధి చేసినది కాదు ఇది అత్యంత పురాతనమైన కోడి. మామూలుగా ఫామ్ లో పెంచే బాయిలర్ కోడి కన్నా నాటుకోడి చాలా బెటర్ అనుకుంటాం. కాని నాటు కోడి కన్నా బెటర్ ఈ కడక్ నాథ్ కోడి.
రైతులకెంతో ఉపయోగం:
నాకు తెలిసిన ఓ రైతు మిత్రుడు ఓ మాట చెప్పారు.. "నువ్వు ఏ వ్యాపారస్తుడినైనా ఎంత లాభం వస్తుందని అడగొచ్చు కాని ఒక రైతును మాత్రం అడగలేము".. ఎందుకంటే ఆ లాభాన్ని వినియోగారునికి రైతుకి మధ్య ఉన్న వ్యక్తి అనుభవిస్తున్నాడు కనుక. రైతుకు అన్ని రకాల పంటలు, ఫామ్స్ విషయంలో ఖచ్చితంగా రిస్క్ ఉంటుంది. 99% రిస్క్ తక్కువగా ఉండే పెంపకమే ఈ కడక్ నాథ్ కోళ్ళ పెంపకం. ఈ కోడి శరీరం నలుపుగా ఉంటుంది కాని గుడ్డు నలుపుగా కాకుండా మామూలు నాటు కోడి గుడ్డు లానే పోలి ఉంటుంది. కేవలం ఒక్కో కోడి పిల్లకు 80 రూపాయల ఖర్చుతో పెట్టుబడి పెడితే కేజి మాంసానికి మెట్రో సిటీలలో 700 నుండి 1,000 ధర పలుకుతున్నది. సుమారు ఐదు నెలలలో కటింగ్ కు సిద్దమవుతుంది.
ప్రత్యేకంగా పంట సాగు కోసం:
పంజరంలో పెంచిన పక్షి కన్నా స్వేచ్చగా తిరిగిన పక్షి ఇంకా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ కోళ్ళను కూడా మాములు నాటుకోళ్ళు లాగానే స్వేఛ్ఛగా వదిలేస్తే కడక్ నాథ్ కోళ్ళను పంట పొలాలను ఆశించే అన్ని రకాల పురుగులను తినేస్తాయి. వీటికోసం ప్రత్యేకంగా కొన్ని రకాల పెస్టిసైడ్స్ కొనాల్సిన అవసరముండదు. అంతేకాకుండా పొలంలోనే ఎక్కువ సమయం ఉండడం వల్ల వాటి విసర్జితాలు పంటకు ఎరువుగా కూడా ఉపయోగపడతాయి. నిజానికి ఈ కోళ్ళు "కలిమసి" గా ఎప్పటినుండో ఉన్నా వీటి విశిష్టత మైసూర్ లోని కేంద్ర ఆహార పరిశోధన సంస్థ కొంతకాలం క్రితం రీసెర్చ్ చేసి చెప్పడంతో మరోసారి ఈ కోళ్ళల్లోని గొప్పతనం తెలిసింది. రుచి విషయంలో కూడా బాయిలర్, నాటుకోడి కన్నా అద్భుతంగా ఉంటుంది.
న్యూట్రిషన్ చార్ట్:
కడక్ నాథ్ కోళ్ళల్లోని న్యూట్రిషన్ చార్ట్ పరిశీలిస్తే ప్రొటీన్ 20 శాతం ఎక్కువగా ఉంటుంది. ఫ్యాట్ కంటెంట్ కూడా కేవలం 0.73 - 1 మాత్రమే ఉంటుంది. విటమిన్స్ తో పాటుగా కాల్షియం, పాస్పరస్, నికోటిన్ ఆమ్లం, ఐరన్ కంటెంట్ మిగిలిన వాటిలో కన్నా 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. హార్ట్ ప్రాబ్లమ్స్, క్షయ, ఆస్తమా మొదలైన వ్యాధి గ్రస్థులకు ఈ మాంసం ఉపశమనం ఇస్తుందని పేర్కొంటుంటారు. లైంగిక పటుత్వానికి కూడా బాగా ఉపయోగపడుతుందని నిపుణులు వివరిస్తుంటారు.
కడక్ నాథ్ కోడి ద్వారా ఇటు రైతులకు మాత్రమే కాదు అటు వినియోగదారునికి కూడా లాభం చేకూరుతుంది. ప్రస్తుతం తెలుగు ప్రాంతాలలో కొత్తగా పెంచుతున్నవారు కొద్ది సంఖ్యలో ఉన్నా రాబోయే కాలంలో మరింత మంది రైతులకు ఇది లాభసాటి వ్యాపారంగా మారనుంది.